Business Bureau
-
ఒకసారి చార్జింగ్‌తో 400 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా తాజాగా ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్‌సీ40 రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.55.9 లక్షలు. ఆన్లైన్లో మాత్రమే ఈ కారును బుక్ చేయాల్సి ఉంటుంది. భారత్‌లో అసెంబుల్ అయిన తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వెల్లడించింది. 78 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల 500 కిలోల లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. బ్యాటరీపై ఎనమిదేళ్ల వారంటీ ఉంది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. 4.9 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ వీల్ డ్రైవ్, హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, కొలీషన్ మిటిగేషన్ సపోర్ట్ వంటి హంగులు ఉన్నాయి బుకింగ్ కోసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలు అక్టోబర్ నుంచి మొదలవుతాయి. -
ట్రయంఫ్ టైగర్ 1200 అడ్వెంచర్ బైక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం మోటార్‌సైకిల్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ బ్రాండ్ ట్రయంఫ్ తాజాగా భారత్‌లో సరికొత్త టైగర్ 1200 అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, అలాగే సుదూర ప్రయాణాల కోసం జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.19.19 లక్షల నుంచి ప్రారంభం. టైగర్ 1200 చేరికతో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో 660 నుంచి 1200 సీసీ శ్రేణిలో తొమ్మిది మోడళ్లను కంపెనీ పరిచయం చేసినట్టు అయింది. -
మారుతీ సుజుకీ డిజైర్ ఎస్–సీఎన్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎస్–సీఎన్జీ పరిజ్ఞానంతో కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను రెండు ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.14 లక్షల నుంచి ప్రారంభం. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయని కంపెనీ తెలిపింది. మైలేజీ కిలోకు 31.12 కిలోమీటర్లు అని వెల్లడించింది. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, అధిక మైలేజీ కారణంగా ఎస్–సీఎన్జీ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయిదేళ్లలో కంపెనీ ఈ విభాగంలో ఏటా సగటున 19 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. -
భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 115 పీఎస్ పవర్‌తో 1.0 లీటర్, 150 పీఎస్ పవర్‌తో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైయిన్స్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో రూపుదిద్దుకుంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్, స్కోడా స్లేవియా వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. మధ్య స్థాయి ప్రీమియం సెడాన్స్ విభాగంలో 12–15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ‘కొత్త ఉత్పాదన రాగానే విభాగం వృద్ధి చెందుతుంది. 2022 డిసెంబర్ నాటికి ఈ విభాగం 1.5 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనా ఉంది. కారు నిర్మాణ శైలికి ఇప్పటికీ దేశంలో ఆదరణ ఉంది. మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో ఈ శైలి కార్ల వాటా 12–14 శాతం కైవసం చేసుకుంది. ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మధ్యస్థాయి సెడాన్ విభాగం గతేడాది 28 శాతం వృద్ధి చెందింది’ అని వివరించారు. -
మెడికవర్ మరిన్ని ఆసుపత్రులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. 20 నెలల్లో 2,000 పడకలను జోడించి మొత్తం సామర్థ్యం 4,500లకు చేర్చింది. ఇప్పుడు అంతే వేగంగా 2024 నాటికి 7,500 బెడ్ల స్థాయికి చేరేందుకు ప్రణాళిక రచించినట్టు మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ అనిల్ కృష్ణా రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలో వైద్యులు, నర్సింగ్, ఇతర విభాగాల్లో కలిపి 10,400 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మూడేళ్లలో మరో 5,000 మందికి కొత్తగా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనింకా ఏమన్నారంటే.. మెట్రో నగరాలు లక్ష్యంగా.. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, కాకినాడ, మహారాష్ట్రలో ఔరంగాబాద్, నాసిక్, సంగమనేర్లో ఆసుపత్రులు నెలకొన్నాయి. వీటిలో మల్టీ స్పెషాలిటీతోపాటు క్యాన్సర్ కేర్, పిల్లలు, స్త్రీల వైద్యం కోసం ప్రత్యేక కేంద్రాలూ ఉన్నాయి. మూడేళ్లలో కొత్తగా హైదరాబాద్‌తోపాటు వరంగల్, మహారాష్ట్రలో ముంబై, పుణే, కొల్హాపూర్, నాసిక్‌లో హాస్పిటల్స్ జతకూడనున్నాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరులో విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తాం. కొన్ని కేంద్రాలు లాభాల్లో, మిగిలినవి లాభనష్టాలు లేని స్థితికి చేరుకున్నాయి. సంస్థలో ప్రధాన వాటాదారు అయిన మెడికవర్ అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాం. ఇతర విభాగాల్లోకి ఎంట్రీ.. ఔషధాల ఉత్పత్తి, విక్రయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నాం. డయాగ్నోస్టిక్స్ సేవలనూ పరిచయం చేస్తాం. ఇప్పటి వరకు సంస్థ రూ.1,450 కోట్లు వెచ్చించింది. మూడేళ్లలో కొత్త కేంద్రాలకు రూ.1,000 కోట్లు వ్యయం కానుంది. క్యాన్సర్ కేర్, పిల్లలు, స్త్రీల కోసం స్పెషాలిటీ హాస్పిటల్స్ నాలుగైదు రానున్నాయి. ఇందుకు మరో రూ.300 కోట్లు వ్యయం ఉంటుంది. 50 శాతం రుణం, మిగిలిన మొత్తాన్ని అంతర్గత వనరులు, వాటా విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరిస్తాం. సంస్థలో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు 60 శాతం వాటా ఉంది. అన్నీ సవ్యంగా సాగితే 2025లో ఐపీవోకు రావాలన్నది ఆలోచన. -
టాటా మోటార్స్ చిన్న ఎస్యూవీ పంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ పంచ్ పేరుతో దేశంలో తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. రూ.21,000 చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టారు. డైనా ప్రో టెక్నాలజీతో 1.2 లీటర్ రెవొట్రాన్ ఇంజన్‌తో తయారైంది. పరిశ్రమలో తొలిసారిగా ఆధునిక ఏఎంటీతో ట్రాక్షన్ ప్రో మోడ్, బ్రేక్ స్వే కంట్రోల్ పొందుపరిచారు. 90 డిగ్రీల కోణంలో తెరుచుకునే డోర్లు, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, కార్నర్ సేఫ్టీ కంట్రోల్‌తో ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్ స్టీరింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఏడు రంగుల్లో లభిస్తుంది. పంచ్ అభివృద్ధికి 150 నమూనా కార్లను వాడారు. ఇవి 20 లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. భారత్, యూకే, ఇటలీలోని డిజైన్ స్టూడియోలు ఈ కారు అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. -
‘గ్రీన్’ విద్యుత్‌పై 20 బిలియన్ డాలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక (గ్రీన్) విద్యుదుత్పత్తి రంగంపై వచ్చే దశాబ్ద కాలంలో 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. పర్యావరణ హిత విద్యుత్‌కు సంబంధించి వివిధ రూపాల్లో తమ పెట్టుబడులు మొత్తం మీద 50–70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రోలైజర్ల తయారీ భాగస్వాములు మొదలుకుని సౌర.. పవన విద్యుత్ వ్యాపారాలకు అవసరమైన ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పారిశ్రామిక క్లౌడ్ ప్లాట్‌ఫాంలు మొదలైనవన్నీ ఈ కోవలోకి వస్తాయని వివరించారు. వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మూడు రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు అదానీ పేర్కొన్నారు. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ చాప్టర్ సోమవారం నిర్వహించిన సస్టెయినబిలిటీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా గౌతమ్ అదానీ మాట్లాడారు. మన వైద్య, విద్య, రవాణా తదితర వ్యవస్థల్లో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారులను నిలువరించేందుకు టీకాలైనా ఉన్నాయని.. కానీ వాతావరణ మార్పుల చికిత్సకు ఎలాంటి టీకాలు లేవని అదానీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పు సమస్యలకు తగు పరిష్కార మార్గాలు కనుగొనడమే కాకుండా.. సైన్స్, విధానాలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా అందరికీ ప్రయోజనాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 28 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్ .. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్ 28 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాను గతేడాది చెప్పానని అదానీ పేర్కొన్నారు. అమెరికా తలసరి ఆదాయంలో ప్రస్తుతం ముప్ఫయ్యో వంతుగా ఉన్న భారత్ తలసరి ఆదాయం 2050 నాటికి మూడో వంతుకు చేరుతుందన్నారు. రాబోయే రోజుల్లో అనేక దశాబ్దాల పాటు భారత్ రెండంకెల స్థాయి వృద్ధి సాధించగలదని అదానీ చెప్పారు. మరోవైపు, పర్యావరణ హిత విధానాలను, స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. అక్టోబర్ 6 దాకా సదస్సు.. రాబోయే తరాలకు కూడా వనరులను మిగిల్చే విధంగా.. ప్రస్తుత తరం అవసరాలను తీర్చుకునేందుకు పాటించాల్సిన విధానాలపై (సస్టెయినబిలిటీ) చర్చించేందుకు ఇజ్రాయెల్, కోస్టారికాల భాగస్వామ్యంతో టై నిర్వహిస్తున్న సదస్సు అక్టోబర్ 6 దాకా జరగనుంది. ఇందులో 64 దేశాల నుంచి 25,000 పైచిలుకు సంస్థలు పాల్గొంటున్నాయి. తొలి రోజున ఇరు దేశాల్లోని వ్యవసాయ, సాంకేతిక తదితర రంగాల స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా ఇజ్రాయెల్, భారత్‌లోని టై విభాగాలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ సదస్సు ఊతంతో రాబోయే రోజుల్లో స్టార్టప్‌లకు దాదాపు 100 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కే అవకాశం ఉందని టీఎస్ఎస్ 2021 చైర్పర్సన్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ దౌత్యవేత్త నిక్కి హేలీ (వర్చువల్‌గా), కోస్టా రికా దౌత్యవేత్త క్లాడియో అన్సోరెనా, ఇజ్రాయెల్ డిప్యుటీ చీఫ్ ఆఫ్మిషన్రోని క్లెయిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మ్యూచువల్ ఫండ్లకు అపార అవకాశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మ్యుచువల్ ఫండ్లు ఇంకా సామాన్య ప్రజానీకానికి పూర్తిస్థాయిలో చేరలేదని, ఈ నేపథ్యంలో ఫండ్స్ విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ, సీఈవో నిమేష్ షా తెలిపారు. పెట్టుబడి సాధనంగా ఫండ్స్‌పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా 2018–19 జూన్‌లో రూ. 7,554 కోట్ల పెట్టుబడులు రాగా, 2020–21 జూన్‌లో రూ. 9,156 కోట్లు రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతి బుల్ మార్కెట్ తరహాలోనే ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు నేరుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ధోరణులు కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యురోకి ఇచ్చిన ఇంటర్వూ్యలో తెలిపారు. అయితే, మార్కెట్లు బులిష్‌గా ఉన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండని ఇన్వెస్టర్లు ఆ తర్వాత రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని చరిత్ర చెబుతోందన్నారు. సరైన పెట్టుబడి సాధనాలకు తగు పాళ్ళలో నిధులను కేటాయించడం ముఖ్యమని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సలహాదారు సహాయాన్ని తీసుకోవాలని షా సూచించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుత మార్కెట్లు.. అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు విడుదల చేసిన నిధుల ఊతంతో ప్రపంచవ్యాప్తంగాను, దేశీయంగాను స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలకు పరుగులు తీస్తున్నాయి. భారీ వేల్యుయేషన్లతో ట్రేడవుతున్నాయి. నిధుల లభ్యతతో పాటు దాదాపు సున్నా స్థాయి వడ్డీపై రుణాలు మొదలైన అంశాలన్నీ ఈక్విటీ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. వ్యాపార పరిస్థితుల వలయాన్ని బట్టి చూస్తే భారత బిజినెస్ సైకిల్ ఆకర్షణీయంగానే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వృద్ధి రికవరీ కాస్త మందగించినట్లుగా ఉన్నప్పటికీ దేశీయంగా సానుకూల ఆర్థికాంశాలు, ప్రభుత్వ విధానాలు, రిజర్వ్ బ్యాంక్ ఉదారవాద చర్యలు తదితర అంశాలు వల్ల సరైన దిశలోనే సాగుతోందని చెప్పవచ్చు. వచ్చే రెండేళ్లలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫండ్స్ విషయంలో ఇన్వెస్టర్లు పాటించాల్సిన వ్యూహం.. అంతర్జాతీయంగా ఈక్విటీలు, కమోడిటీలు సహా రిస్కులతో కూడుకున్న అన్ని పెట్టుబడి సాధనాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో వ్యాపారాలు కోలుకునే క్రమంలో కార్పొరేట్ల ఆదాయాలు, లాభదాయకత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల బిజినెస్ సైకిల్ ఆధారిత ఫండ్‌ను ప్రవేశపెట్టాం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈక్విటీల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం శ్రేయస్కరం. మహమ్మారి పరిణామాలు, అంతర్జాతీయంగా వృద్ధి రికవరీ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు తోసిపుచ్చలేము. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా డైనమిక్ అసెట్ అలోకేషన్ కేటగిరీకి చెందిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఇలాంటి ఫండ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ఈక్విటీల్లో పెట్టుబడుల వ్యూహాలను సరిచేసుకుంటూ ఉంటాయి. అటు మార్కెట్ క్యాప్లపరంగా వివిధ కేటగిరీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. వేల్యూ ఇన్వెస్టింగ్ ద్వారా సైతం మంచి రాబడులను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పలు రంగాల్లో సంస్థలు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో లభిస్తున్నాయి. వీటిలో చాలా మటుకు విభాగాలు 2008 తర్వాత పెద్దగా రాణించలేకపోయాయి. ఈక్విటీలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు .. వేల్యూ ఇన్వెస్టింగ్ విధానం పాటించవచ్చు. అయితే, రికార్డు స్థాయిలో నిధులు వస్తుండటంతో ప్రస్తుతం ధరలు.. వాస్తవిక స్థాయిలో లేవు. సెంట్రల్ బ్యాంకుల చర్యల ప్రభావాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి ప్రతీ పెట్టుబడి సాధనానికి ఎంతో కొంత రిస్కు ఉంటుందన్న సంగతి ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం.. డెట్ సంక్షోభం.. గతేడాది తొలినాళ్లలో డెట్ మార్కెట్లో సంక్షోభమనేది ఒక కంపెనీకి మాత్రమే పరిమితమైన సంఘటన తప్ప వ్యవస్థాగతంగా ఎలాంటి రిస్కులూ తలెత్తలేదు. మా విషయానికొస్తే గత 23 ఏళ్లలో ఎన్నడూ ఏ స్కీములోనూ డిఫాల్ట్ గానీ చెల్లింపుల్లో జాప్యం గానీ జరగలేదు. -
మహమ్మారిలోనూ భలే చాన్సులే..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి కోట్లాది కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారెందరో. అయితే మహమ్మారిలోనూ కొందరు కొత్త అవకాశాలను అంది పుచ్చుకోవడం విశేషం. ఈ విషయంలో మహిళలూ ముందున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు వాట్సాప్ వేదికగా లక్షలాది మంది చిన్న వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఇంటినే వ్యాపార కేంద్రంగా మలుచుకుంటున్నారు. 2020 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 53.18 లక్షల మంది డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలోకి కొత్తగా ప్రవేశించడం.. పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంటి నుంచే వ్యాపారం.. ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన పురుషులు, మహమ్మారి ముందు వరకు ఇంటికే పరిమితమైన మహిళలు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆరోగ్యం, పోషకాహార పదార్థాలు, పచ్చళ్లు, కేక్స్, బిస్కట్స్, పిండి వంటలు, రోజువారీ ఆహార పదార్థాల విక్రయం, యోగా, ట్యూషన్స్, మ్యూజిక్.. ఇలా తమకు నైపుణ్యం ఉన్న విభాగాల్లో ప్రవేశిస్తున్నారు. ఖర్చు లు పోను కనీసం రూ.15,000 మిగుల్చుకుంటున్నారు. రీసెల్లర్స్ కనీసం రూ.30,000, ఆన్లైన్ ట్యూషన్స్ ద్వారా రూ.25,000, కుకింగ్ క్లాసెస్, వెల్నెస్, హెల్త్ విభాగంలో రూ.50,000 వరకు సంపాదిస్తున్నారు. లైవ్ వీడియోల్లో వస్తువులను ప్రదర్శిస్తూ అమ్మకాలను సాగించే వారూ ఉన్నారు. విదేశాలకూ వస్తువులను ఎగుమతి చేయడమేకాదు అక్కడి వారికి ఆన్లైన్ ద్వారా క్లాసులు చెబుతున్నారు. డిస్కౌంట్లతో అమ్మకాలు.. వస్తువులు, ధర విషయంలో వినియోగదారులు ఎప్పుడూ స్మార్ట్‌గా వ్యవహరిస్తారు. డిస్కౌంట్స్ ఉంటే చాలు కొనుగోలు చేసేందుకు సై అంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఈ విషయంలో చాలా సక్సెస్ అయ్యాయి. మార్కెట్ ధర కంటే తక్కువకే కస్టమర్‌కే నేరుగా విక్రయిస్తూ బ్రాండ్ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ఈ–కామర్స్ కంపెనీ తీసుకునే కమీషన్, డెలివరీ చార్జీల భారం వినియోగదారుడిపైనే ఉంటుంది. ఈ భారం లేకపోవడమేగాదు డిస్కౌంట్స్, బహుమతులతో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 2019–20 నాటికి దేశవ్యాప్తంగా 74 లక్షల మంది యాక్టివ్ సెల్లర్స్ ఉన్నారు. వీరిలో 50 శాతం మంది మహిళలే కావడం విశేషం. 2020 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 53.18 లక్షల మంది కొత్తగా చేరారు. 28 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.16,778 కోట్ల వ్యాపారం నమోదు చేసింది. అంతర్జాతీయంగా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారత్ 12వ స్థానంలో ఉంది. తక్కువ పెట్టుబడితో.. డైరెక్ట్ సెల్లింగ్‌లో రూ. 2,500 పెట్టుబడితో ప్రవేశించొచ్చు. పరిచయాలు, వాట్సాప్ గ్రూప్స్‌తో ఈ రంగంలో సులభంగా సక్సెస్ కావొచ్చు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా వినియోగదార్లకు చేరువ అవుతున్నారు. డిస్కౌంట్స్ ఒక్కటే సరిపోదు.. నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వాల్సిందే. కస్టమర్లకు నమ్మకం ఏర్పడినప్పుడే ఈ రంగంలో విజయవంతం అవుతాం. – లలిత లారెన్స్, డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్ నైపుణ్యానికి పదును.. భార్యాభర్తలిద్దరూ సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకేముంది తమకు ఉన్న నైపుణ్యానికి పదును పెడుతున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గ్రామాలతోపాటు విదేశాలకూ విస్తరిస్తున్నారు. వాట్సాప్‌లో గ్రూప్స్‌గా చేరి ఒకరినొకరు సాయం చేసుకుంటూ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉండే ఆర్జిస్తుండడం విశేషం. ఔత్సాహికులకు సలహాలు ఇస్తున్నాం. – లత చౌదరి బొట్ల, ఫౌండర్, నారీసేన -
రూ. 500 కోట్లతో పోకర్ణ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలో నూతన ప్లాంటును నెలకొల్పింది. ఇటలీకి చెందిన పేటెంటెడ్ బ్రెటన్‌స్టోన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఫెసిలిటీని జూలై 31న (నేడు) ప్రారంభించనున్నారు. మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది మార్చిలో ప్లాంటులో ఉత్పత్తి మొదలైందని పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ శుక్రవారం తెలిపారు. -
కొత్త నగరాలకు ‘ట్రూజెట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో ప్రాంతీయ విమానయాన సేవల్లో ఉన్న టర్బో మేఘా ఎయిర్వేస్... జనవరి 19 నాటికి 10 లక్షల మంది ప్రయాణికులను వివిధ నగరాలకు చేరవేసి మిలియన్ మార్కును దాటింది. తాజాగా ట్రూజెట్ ఖాతాలో 5వ ఎయిర్‌క్రాఫ్ట్ చేరికతో కొత్త నగరాల్లో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫిబ్రవరి నుంచి సేలంలో అడుగుపెడుతోంది. మార్చిలో షిర్డీ, ఏప్రిల్‌లో వైజాగ్‌కు సర్వీసులను అందిస్తామని టర్బో మేఘా ఎయిర్వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉడాన్ స్కీమ్ కింద కడప, మైసూరు, విద్యానగర్, నాందేడ్‌కు విమానాలు నడుపుతున్నట్టు చెప్పారు. కొత్త పైలట్లు, సిబ్బంది చేరగానే సర్వీసులు పెంచుతామన్నారు. మే నాటికి ఆరవ విమానం.. ఈ ఏడాది మే నాటికి ఆరవ విమానం వచ్చి చేరుతుందని సెంథిల్ తెలిపారు. ‘2018 డిసెంబరుకల్లా కంపెనీ ఖాతాలో 8 విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 12 నగరాలకు సర్వీసులు నడిపిస్తున్నాం. ఈ ఏడాది మరో 4 నగరాల్లో అడుగు పెడతాం. సర్వీసుల సంఖ్య 20 ఉంది. కొత్త నగరాలు, విమానాల రాకతో ఇది మూడు రెట్లకు చేరుతుంది. సీట్ల ఆక్యుపెన్సీ 77 శాతముంది. ఇది 85 శాతానికి పైగా చేరుతుందని అంచనా వేస్తున్నాం. 500 మంది సిబ్బంది ఉన్నారు. మరో 100 మందిని నియమించుకుంటున్నాం. ట్రూజెట్ మాత్రమే ఉడాన్ స్కీమ్ కింద దక్షిణాది నుంచి సర్వీసులు అందిస్తోంది. 2018 చివరికి మరో 10 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తామన్న దీమాతో ఉన్నాం’ అని వివరించారు. కంపెనీ కార్యకలాపాలు 2015 జూలై 12న ప్రారంభం అయ్యాయి. -
రక్షణ పరికరాల తయారీకి ఊపు
లెసైన్సు మినహాయింపుతో జోష్ ఉమ్మడి రాష్ట్రంలో రూ. 1,500 కోట్ల వ్యాపారం నాలుగేళ్లలో వ్యాపారం అయిదు రెట్లకు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాల తయారీలో ఉన్న కంపెనీలకు మంచి రోజులు రానున్నాయి. భారత రక్షణ శాఖ లెసైన్సింగ్ను సరళతరం చేయడమే ఇందుకు కారణం. విడిభాగాల తయారీలో హైదరాబాద్ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా తమ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాయి. వైజాగ్, విజయవాడ, కాకినాడ ప్రాంతంలోనూ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం సీమాంధ్ర, తెలంగాణలోని కంపెనీలు ఏటా రూ.1,500 కోట్లకుపైగా విలువైన విడిభాగాలను డీఆర్డీవో, బీడీఎల్, హెచ్ఏఎల్ వంటి సంస్థలకు సరఫరా చేస్తున్నాయి. రక్షణ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ రంగంలో ఉన్న కంపెనీలకు నూతన వ్యాపారావకాశాలు రానున్నాయి. 2018 నాటికి వ్యాపారం అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదీ ప్రభుత్వ నిర్ణయం.. యుద్ధ ట్యాంకులు, రక్షణ, అంతరిక్ష విమానాలు, విడిభాగాలు, యుద్ధ నౌకలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, వీటికి సంబంధించిన పరికరాల తయారీకి మాత్రమే లెసైన్సు తప్పనిసరి. రక్షణ శాఖ వినియోగించే ఇతర వందలాది పరికరాల తయారీకి ఇకనుంచి లెసైన్సు అవసరం లేదని గురువారం(జూన్ 26) కేంద్రం ప్రకటించింది. గత జాబితాతో పోలిస్తే 50 శాతం పరికరాల తయారీకి ఇకపై లెసైన్సు అవసరం ఉండదు. విదేశీ కంపెనీలు సైతం వీటిని దేశీయంగా తయారు చేయవచ్చు. భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్కులను ప్రోత్సహించాలి.. హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద 27 కంపెనీలు కలిసి సమూహ పేరుతో ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేస్తున్నాయి. ఎంటీఏఆర్ టెక్నాలజీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఎస్కేఎం టెక్నాలజీస్ ప్రమోటర్లుగా మరో 21 కంపెనీలు పార్కులో వాటాదారులుగా ఉన్నాయి. ఇలా కంపెనీలు కలిసి పార్కు ఏర్పాటు చేసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. తయారీ రంగంపై అధికంగా దృష్టిపెడుతున్న ఈ సమయంలో సమూహ వంటి పార్కులను మరిన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ కోరుతోంది. అంతేగాక డిఫెన్సుకు ప్రత్యేక పారిశ్రామిక విధానం అమలు చేయాలని ఓ కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులతో కూడుకున్న పరిశ్రమలు కాబట్టి ప్రభుత్వం విభాగాలవారీగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్లాంట్లు పెడితే, సెజ్ నుంచి ఈ ప్లాంట్లకు సరఫరా చేసే పరికరాలను ఎగుమతిగా (డీమ్డ్ ఎక్స్పోర్ట్) పరిగణించాలని శ్రీరామ్ అన్నారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా వేరేచోట ప్లాంటు పెట్టాలంటే ఏ కంపెనీకైనా కష్టసాధ్యమేనన్నారు. మేలు చేసేలా ఉంటేనే.. ప్రభుత్వం అమలు చేసే పారిశ్రామిక విధానాల ఆధారంగానే కంపెనీల భవిష్యత్ ఉంటుందని సమూహ ఇంజనీరింగ్ చైర్మన్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ చైర్మన్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. దేశీయ కంపెనీలకు జీవం పోసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. ‘వాణిజ్య కంపెనీల మాదిరిగా ఈ రంగ కంపెనీలపై పన్నులు విధిస్తున్నారు. బ్యాంకు వడ్డీలూ ఎక్కువే. విద్యుత్ సరఫరాలోనూ అవాంతరాలే. కొత్త కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ప్రహసనంగా ఉంటోంది. ఉద్యోగుల సంఖ్యనుబట్టి పన్నులు విధించాలి. పన్నుల విధింపు సహేతుకంగా ఉండాలి’ అని అన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కొత్త కంపెనీలూ వస్తాయి.. తెలంగాణ, సీమాంధ్రలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా కంపెనీలు 400 దాకా ఈ రంగంలో నిమగ్నమయ్యాయి. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 350 ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికిపైగా ఈ రంగంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నింటికీ కొత్త అవకాశాలు వచ్చినట్టేనని సమూహ ఇంజనీరింగ్ ఈడీ, స్కార్లెట్ ఎండీ శ్రీరామ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కొత్త కంపెనీలూ వస్తాయని చెప్పారు. ఇప్పటికే ఉన్న కంపెనీలకు మెరుగైన వ్యాపారావకాశాలు ఉంటాయని, ఇవి సామర్థ్యాన్ని పెంచుకుంటాయని వెల్లడించారు. విదేశీ కంపెనీలు సైతం ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయని చెప్పారు. ఉపాధి అవకాశాలు మూడు రెట్లు అవుతాయని పేర్కొన్నారు. ప్రసుత్తం సీమాంధ్ర, తెలంగాణలో రూ.1,500 కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నారు. నాలుగేళ్లలో ఇది రూ.7,500 కోట్లు దాటుతుందని వివరించారు. పౌర విమానయాన రంగంలో కూడా ఆఫ్సెట్ పాలసీ అమలైతే రెండు రాష్ట్రాల్లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు. -
సూపర్‌మ్యాక్స్ హైదరాబాద్ ప్లాంట్ విస్తరణ
త్వరలో సిస్టమ్, డిస్పోజబుల్ రేజర్ల తయారీ వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చౌదురి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రేజర్ బ్లేడ్లు, డిస్పోజబుల్ రేజర్ల తయారీ సంస్థ సూపర్‌మ్యాక్స్ పర్సనల్ కేర్ హైదరాబాద్ ప్లాంట్‌ను విస్తరిస్తోంది. 6-9 నెలల్లో ఈ ప్లాంటులో సిస్టమ్, డిస్పోజబుల్ రేజర్ల తయారీని చేపట్టనుంది. ప్రీమియం డిస్పోజబుల్ రేజర్ బ్లేడ్ల తయారీలోకి కంపెనీ శుక్రవారం ప్రవేశించింది. వీటి తయారీకి ఉపయోగించే స్పట్టరింగ్ మెషీన్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. మెషీన్‌తో రోజుకు 10 లక్షల బ్లేడ్లు ఉత్పత్తి చేయవచ్చు. రోజుకు 60 లక్షల బ్లేడ్లు ఉత్పత్తి చేయగల మరో మెషీన్ కొద్ది రోజుల్లో రానుంది. హైదరాబాద్ ప్లాంటులో ప్రస్తుతం రోజుకు ఒక కోటిదాకా బ్లేడ్లను తయారు చేస్తున్నారు. డిస్పోజబుల్స్‌కు డిమాండ్.. దేశంలో డిస్పోజబుల్ రేజర్లు, సిస్టమ్‌లకు చిన్న పట్టణాల్లోనూ గిరాకీ పెరుగుతోంది. సాధారణ బ్లేడ్ల అమ్మకాల్లో 20 శాతం వృద్ధి రేటు ఉంటే, ఈ విభాగం 45 శాతం దాకా వృద్ధి నమోదు చేస్తోంది. సాధారణ బ్లేడ్లు రూ.1,000 కోట్లు, డిస్పోజబుల్ రేజర్లు, సిస్టమ్‌లు రూ.700 కోట్ల వ్యాపారం జరుగుతోందని సూపర్‌మ్యాక్స్ స్ట్రాటజీ, కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చౌదురి తెలిపారు. భారత్‌తోసహా ఇతర దేశాల్లో కంపెనీకి 10 ప్లాంట్లున్నాయి. ఆగ్నేయాసియా, బ్రెజిల్, ఈజిప్ట్‌లో ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు. -
త్వరలో గూగుల్ ట్యాబ్ ‘ట్యాంగో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ శక్తివంతమైన ట్యాబ్లెట్ పీసీ ‘ట్యాంగో’ ఈ ఏడాది చివరికల్లా వస్తోంది. ఎన్విడియా టెగ్రా కె1 ప్రాసెసర్‌తో రూపుదిద్దుకుంటోంది. 7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, వైఫై, 4జీ ఇతర విశేషాలు. నిర్మాణాలు, రోడ్లు, కదిలే వస్తువులు, వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారు, పరిమాణం.. ఇలా పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకునేలా ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఫర్నీచర్ దుకాణానికి వెళ్లే ముందు ఇంటి లోపలి పరిసరాలను కెమెరాలో బంధిస్తే చాలు. దుకాణానికి వెళ్లిన తర్వాత అక్కడి ఫర్నీచర్ మీ ఇంట్లో ఎంతమేర స్థలాన్ని ఆక్రమిస్తుందో ఇట్టే చెప్పేస్తుంది. పరిసరాలను 3డీలో స్కాన్ చేసేందుకు వీలుగా మోషన్ ట్రాకింగ్ కెమెరాలు మూడింటిని వెనుకవైపు అమరుస్తున్నారు. సెకనుకు 2.5 లక్షలకుపైగా 3డీ కొలతలను ఇవ్వగలదు. మొబైల్ 3డీ సెన్సింగ్ రంగంలో పనిచేసేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. తొమ్మిది దేశాలకు చెందిన యూనివర్సిటీలు, పరిశోధన శాలలు, పరిశ్రమ నిపుణులతో కూడిన బృందం దీని అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. ధర రూ.60 వేలు ఉండే అవకాశం ఉంది.