హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి కోట్లాది కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారెందరో. అయితే మహమ్మారిలోనూ కొందరు కొత్త అవకాశాలను అంది పుచ్చుకోవడం విశేషం. ఈ విషయంలో మహిళలూ ముందున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు వాట్సాప్ వేదికగా లక్షలాది మంది చిన్న వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఇంటినే వ్యాపార కేంద్రంగా మలుచుకుంటున్నారు. 2020 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 53.18 లక్షల మంది డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలోకి కొత్తగా ప్రవేశించడం.. పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇంటి నుంచే వ్యాపారం..
ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన పురుషులు, మహమ్మారి ముందు వరకు ఇంటికే పరిమితమైన మహిళలు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆరోగ్యం, పోషకాహార పదార్థాలు, పచ్చళ్లు, కేక్స్, బిస్కట్స్, పిండి వంటలు, రోజువారీ ఆహార పదార్థాల విక్రయం, యోగా, ట్యూషన్స్, మ్యూజిక్.. ఇలా తమకు నైపుణ్యం ఉన్న విభాగాల్లో ప్రవేశిస్తున్నారు. ఖర్చు లు పోను కనీసం రూ.15,000 మిగుల్చుకుంటున్నారు. రీసెల్లర్స్ కనీసం రూ.30,000, ఆన్‌లైన్ ట్యూషన్స్ ద్వారా రూ.25,000, కుకింగ్ క్లాసెస్, వెల్‌నెస్, హెల్త్ విభాగంలో రూ.50,000 వరకు సంపాదిస్తున్నారు. లైవ్ వీడియోల్లో వస్తువులను ప్రదర్శిస్తూ అమ్మకాలను సాగించే వారూ ఉన్నారు. విదేశాలకూ వస్తువులను ఎగుమతి చేయడమేకాదు అక్కడి వారికి ఆన్‌లైన్ ద్వారా క్లాసులు చెబుతున్నారు.
డిస్కౌంట్లతో అమ్మకాలు..
వస్తువులు, ధర విషయంలో వినియోగదారులు ఎప్పుడూ స్మార్ట్‌గా వ్యవహరిస్తారు. డిస్కౌంట్స్ ఉంటే చాలు కొనుగోలు చేసేందుకు సై అంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఈ విషయంలో చాలా సక్సెస్ అయ్యాయి. మార్కెట్ ధర కంటే తక్కువకే కస్టమర్‌కే నేరుగా విక్రయిస్తూ బ్రాండ్ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ఈ–కామర్స్ కంపెనీ తీసుకునే కమీషన్, డెలివరీ చార్జీల భారం వినియోగదారుడిపైనే ఉంటుంది. ఈ భారం లేకపోవడమేగాదు డిస్కౌంట్స్, బహుమతులతో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 2019–20 నాటికి దేశవ్యాప్తంగా 74 లక్షల మంది యాక్టివ్ సెల్లర్స్ ఉన్నారు. వీరిలో 50 శాతం మంది మహిళలే కావడం విశేషం. 2020 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 53.18 లక్షల మంది కొత్తగా చేరారు. 28 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.16,778 కోట్ల వ్యాపారం నమోదు చేసింది. అంతర్జాతీయంగా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారత్ 12వ స్థానంలో ఉంది.
తక్కువ పెట్టుబడితో..
డైరెక్ట్ సెల్లింగ్‌లో రూ. 2,500 పెట్టుబడితో ప్రవేశించొచ్చు. పరిచయాలు, వాట్సాప్ గ్రూప్స్‌తో ఈ రంగంలో సులభంగా సక్సెస్ కావొచ్చు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా వినియోగదార్లకు చేరువ అవుతున్నారు. డిస్కౌంట్స్ ఒక్కటే సరిపోదు.. నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వాల్సిందే. కస్టమర్లకు నమ్మకం ఏర్పడినప్పుడే ఈ రంగంలో విజయవంతం అవుతాం.
– లలిత లారెన్స్, డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్
నైపుణ్యానికి పదును..
భార్యాభర్తలిద్దరూ సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకేముంది తమకు ఉన్న నైపుణ్యానికి పదును పెడుతున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గ్రామాలతోపాటు విదేశాలకూ విస్తరిస్తున్నారు. వాట్సాప్‌లో గ్రూప్స్‌గా చేరి ఒకరినొకరు సాయం చేసుకుంటూ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉండే ఆర్జిస్తుండడం విశేషం. ఔత్సాహికులకు సలహాలు ఇస్తున్నాం.
– లత చౌదరి బొట్ల, ఫౌండర్, నారీసేన
Comments
Please login to add a commentAdd a comment