వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్కవుతున్న మైనర్లు
వివిధ ఆన్‌లైన్ సైట్‌లలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు
మోసపోయి జీవితాలను అంధకారం చేసుకుంటున్న బాలికలు
సింగ్‌నగర్, నున్న రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే నెలకు 40కు పైగా కేసులు నమోదు
జాతీయ బాలికా దినోత్సవం రోజున వెలుగులోకి ముగ్గురు బాలికల అదృశ్యం కేసు
రోజుల పరిచయానికి కన్నవారినే కాదనుకుంటున్నారు.. అంతా తమకే తెలుసునన్న భ్రమలో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక.. కనిపించేదంతా నిజమేమో అని రంగుల మాయలో పడుతూ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.. చేతుల్లోని సెల్ ఫోన్ ఈ మైనర్ ప్రేమ వ్యథలకు వారథి అవుతుండగా.. ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాలు వారిని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా బాలికలు ఈ విషయంలో సమిధలవుతున్నారు.
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): అడుగు బయటపెడితే ఎటు వెళ్లాలో దారులు కూడా సరిగ్గా తెలియని అమాయక మైనర్లను.. చేతిలో ఉన్న ఫోన్లు, అందులో ఉన్న పలు ఆన్‌లైన్ సైట్‌లు తప్పుదోవ పట్టేలా చేస్తున్నాయి. ఆయా సైట్‌లలోని రంగుల ప్రపంచం మాదిరిగానే వాస్తవ పరిస్థితులు కూడా ఉంటాయనే భ్రమలో మితిమీరిన పరిచయాలను పెంచుకుంటూ.. వారి జీవితాలను వారే అంధకారంగా మార్చుకుంటున్నారు. పదిహేనేళ్ల వయస్సులోనే ‘తప్పు’టడుగులు వేసి గర్భం దాల్చడం.. బిడ్డలను కని రోడ్డున పడి.. తమ కన్నవారికి తీరని గుండె ఘోషను మిగుల్చుతున్నారు. సింగ్‌నగర్, నున్న రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని మైనర్ బాలికలు, యువతులు ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్ వంటి సైట్‌లలో పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి.
⇒ సింగ్‌నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని సమీపంలోని ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లి ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలుపగా అతగాడు ఆ నగ్నఫొటోలతో వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
⇒ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆన్‌లైన్‌లో పోస్ట్‌లు, వీడియోలను చూసి ఓ యువకుడికి దగ్గరైంది. వారిళ్లల్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా కలుసుకున్నారు. ఆ బాలిక మూడు నెలల తరువాత గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
⇒ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క సింగ్‌నగర్, నున్న రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే నెలలో నలభై కేసుల వరకూ బాలికలు అదృశ్యమయ్యారని, బాలికలు, యువతులపై లైంగిక దాడుల ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఉపాధ్యాయులు, ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ వంటి విభాగాలు బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలో వీరికి అవగాహన సదస్సులు నిర్వహించడం, పోలీసులతో ఈ చట్టాల గురించి బాలబాలికలకు అవగాహన కల్పించడం చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల ఇవి అరకొరగా జరుగుతున్నా ప్రభావం చూపడం లేదు.
బాలికలపై లైంగిక దాడులు, అదృశ్య కేసులను నియంత్రించాలంటే వారిపై నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా యుక్త వయస్సులో ఉన్న బాలబాలికల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారు స్కూల్‌కు, కాలేజ్‌కు, ట్యూషన్‌కు వెళ్తున్నారా.. లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తరచూ బాలికలకు సమాజంపై అవగాహన కల్పించడం, అప్రమత్తంగా ఉండి.. వారికి ఎప్పటికప్పుడు తోడుగా ఉండడం, వారితో ఎప్పుడూ స్నేహంగా నడుచుకోవడం.. ఫోన్‌లను దూరంగా ఉంచడం ద్వారా పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం తగ్గుతుందని మానసిక వైద్య నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచండి..
బాల బాలికలు తప్పుడు త్రోవలో వెళ్లేందుకు ప్రధాన కారణం సెల్‌ఫోన్‌లే. చిన్నపిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వడం, ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్, ఓటీటీ వంటి వాటికి ఎడిక్ట్ అవ్వడం, చదువు, సంప్రదాయాలను తెలుసుకోకుండా రీల్స్ పేరుతో చిన్నవయస్సులోనే చెడు అలవాట్లన్ని నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు అతి గారాబం చేయకూడదు. స్కూల్‌లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కదలికలపై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ శాఖ తరఫున పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు, సెల్‌ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం.
– బీహెచ్ వెంకటేశ్వర్లు, సింగ్‌నగర్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment