!['True jet' to new cities - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/25/MAXRESDEFAULT.jpg.webp?itok=T9yfPR9A)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో ప్రాంతీయ విమానయాన సేవల్లో ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్... జనవరి 19 నాటికి 10 లక్షల మంది ప్రయాణికులను వివిధ నగరాలకు చేరవేసి మిలియన్ మార్కును దాటింది. తాజాగా ట్రూజెట్ ఖాతాలో 5వ ఎయిర్‌క్రాఫ్ట్ చేరికతో కొత్త నగరాల్లో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫిబ్రవరి నుంచి సేలంలో అడుగుపెడుతోంది. మార్చిలో షిర్డీ, ఏప్రిల్‌లో వైజాగ్‌కు సర్వీసులను అందిస్తామని టర్బో మేఘా ఎయిర్‌వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉడాన్ స్కీమ్ కింద కడప, మైసూరు, విద్యానగర్, నాందేడ్‌కు విమానాలు నడుపుతున్నట్టు చెప్పారు. కొత్త పైలట్లు, సిబ్బంది చేరగానే సర్వీసులు పెంచుతామన్నారు.
మే నాటికి ఆరవ విమానం..
ఈ ఏడాది మే నాటికి ఆరవ విమానం వచ్చి చేరుతుందని సెంథిల్ తెలిపారు. ‘2018 డిసెంబరుకల్లా కంపెనీ ఖాతాలో 8 విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 12 నగరాలకు సర్వీసులు నడిపిస్తున్నాం. ఈ ఏడాది మరో 4 నగరాల్లో అడుగు పెడతాం. సర్వీసుల సంఖ్య 20 ఉంది. కొత్త నగరాలు, విమానాల రాకతో ఇది మూడు రెట్లకు చేరుతుంది. సీట్ల ఆక్యుపెన్సీ 77 శాతముంది. ఇది 85 శాతానికి పైగా చేరుతుందని అంచనా వేస్తున్నాం. 500 మంది సిబ్బంది ఉన్నారు. మరో 100 మందిని నియమించుకుంటున్నాం. ట్రూజెట్ మాత్రమే ఉడాన్ స్కీమ్ కింద దక్షిణాది నుంచి సర్వీసులు అందిస్తోంది. 2018 చివరికి మరో 10 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తామన్న దీమాతో ఉన్నాం’ అని వివరించారు. కంపెనీ కార్యకలాపాలు 2015 జూలై 12న ప్రారంభం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment