రక్షణ పరికరాల తయారీకి ఊపు | Swing for the manufacture of defense equipment | Sakshi
Sakshi News home page

రక్షణ పరికరాల తయారీకి ఊపు

Published Sat, Jun 28 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

రక్షణ పరికరాల తయారీకి ఊపు

రక్షణ పరికరాల తయారీకి ఊపు

లెసైన్సు మినహాయింపుతో జోష్
ఉమ్మడి రాష్ట్రంలో రూ. 1,500 కోట్ల వ్యాపారం
నాలుగేళ్లలో వ్యాపారం అయిదు రెట్లకు...

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాల తయారీలో ఉన్న కంపెనీలకు మంచి రోజులు రానున్నాయి. భారత రక్షణ శాఖ లెసైన్సింగ్‌ను సరళతరం చేయడమే ఇందుకు కారణం. విడిభాగాల తయారీలో హైదరాబాద్ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా తమ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాయి. వైజాగ్, విజయవాడ, కాకినాడ ప్రాంతంలోనూ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం సీమాంధ్ర, తెలంగాణలోని కంపెనీలు ఏటా రూ.1,500 కోట్లకుపైగా విలువైన విడిభాగాలను డీఆర్‌డీవో, బీడీఎల్, హెచ్‌ఏఎల్ వంటి సంస్థలకు సరఫరా చేస్తున్నాయి. రక్షణ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ రంగంలో ఉన్న కంపెనీలకు నూతన వ్యాపారావకాశాలు రానున్నాయి. 2018 నాటికి వ్యాపారం అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.

ఇదీ ప్రభుత్వ నిర్ణయం..

యుద్ధ ట్యాంకులు, రక్షణ, అంతరిక్ష విమానాలు, విడిభాగాలు, యుద్ధ నౌకలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, వీటికి సంబంధించిన పరికరాల తయారీకి మాత్రమే లెసైన్సు తప్పనిసరి. రక్షణ శాఖ వినియోగించే ఇతర వందలాది పరికరాల తయారీకి ఇకనుంచి లెసైన్సు అవసరం లేదని గురువారం(జూన్ 26) కేంద్రం ప్రకటించింది. గత జాబితాతో పోలిస్తే 50 శాతం పరికరాల తయారీకి ఇకపై లెసైన్సు అవసరం ఉండదు. విదేశీ కంపెనీలు సైతం వీటిని దేశీయంగా తయారు చేయవచ్చు. భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పార్కులను ప్రోత్సహించాలి..

హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద 27 కంపెనీలు కలిసి సమూహ పేరుతో ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేస్తున్నాయి. ఎంటీఏఆర్ టెక్నాలజీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఎస్‌కేఎం టెక్నాలజీస్ ప్రమోటర్లుగా మరో 21 కంపెనీలు పార్కులో వాటాదారులుగా ఉన్నాయి. ఇలా కంపెనీలు కలిసి పార్కు ఏర్పాటు చేసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. తయారీ రంగంపై అధికంగా దృష్టిపెడుతున్న ఈ సమయంలో సమూహ వంటి పార్కులను మరిన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ కోరుతోంది. అంతేగాక డిఫెన్సుకు ప్రత్యేక పారిశ్రామిక విధానం అమలు చేయాలని ఓ కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులతో కూడుకున్న పరిశ్రమలు కాబట్టి ప్రభుత్వం విభాగాలవారీగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్లాంట్లు పెడితే, సెజ్ నుంచి ఈ ప్లాంట్లకు సరఫరా చేసే పరికరాలను ఎగుమతిగా (డీమ్డ్ ఎక్స్‌పోర్ట్) పరిగణించాలని శ్రీరామ్ అన్నారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా వేరేచోట ప్లాంటు పెట్టాలంటే ఏ కంపెనీకైనా కష్టసాధ్యమేనన్నారు.

మేలు చేసేలా ఉంటేనే..

ప్రభుత్వం అమలు చేసే పారిశ్రామిక విధానాల ఆధారంగానే కంపెనీల భవిష్యత్ ఉంటుందని సమూహ ఇంజనీరింగ్ చైర్మన్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ చైర్మన్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. దేశీయ కంపెనీలకు జీవం పోసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. ‘వాణిజ్య కంపెనీల మాదిరిగా ఈ రంగ కంపెనీలపై పన్నులు విధిస్తున్నారు. బ్యాంకు వడ్డీలూ ఎక్కువే. విద్యుత్ సరఫరాలోనూ అవాంతరాలే. కొత్త కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ప్రహసనంగా ఉంటోంది. ఉద్యోగుల సంఖ్యనుబట్టి పన్నులు విధించాలి. పన్నుల విధింపు సహేతుకంగా ఉండాలి’ అని అన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
 
కొత్త కంపెనీలూ వస్తాయి..

 
తెలంగాణ, సీమాంధ్రలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా కంపెనీలు 400 దాకా ఈ రంగంలో నిమగ్నమయ్యాయి. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 350 ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికిపైగా ఈ రంగంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నింటికీ కొత్త అవకాశాలు వచ్చినట్టేనని సమూహ ఇంజనీరింగ్ ఈడీ, స్కార్లెట్ ఎండీ శ్రీరామ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కొత్త కంపెనీలూ వస్తాయని చెప్పారు. ఇప్పటికే ఉన్న కంపెనీలకు మెరుగైన వ్యాపారావకాశాలు ఉంటాయని, ఇవి సామర్థ్యాన్ని పెంచుకుంటాయని వెల్లడించారు. విదేశీ కంపెనీలు సైతం ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయని చెప్పారు. ఉపాధి అవకాశాలు మూడు రెట్లు అవుతాయని పేర్కొన్నారు. ప్రసుత్తం సీమాంధ్ర, తెలంగాణలో రూ.1,500 కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నారు. నాలుగేళ్లలో ఇది రూ.7,500 కోట్లు దాటుతుందని వివరించారు. పౌర విమానయాన రంగంలో కూడా ఆఫ్‌సెట్ పాలసీ అమలైతే రెండు రాష్ట్రాల్లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement