Component manufacturing
-
బోయింగ్‌కు ఆజాద్ ఎన్ఏఎస్ విడిభాగాలు
హైదరాబాద్: విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌కు తొలి విడిభాగాల కన్సైన్మెంట్ను అందించినట్లు ఆజాద్ ఇంజినీరింగ్ తెలిపింది. జాతీయ ఏరోస్పేస్ ప్రమాణాలకు (ఎన్ఏఎస్) అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేసినట్లు వివరించింది. వివిధ బోయింగ్ విమానాలకు అవసరమైన కీలక ఏరోస్పేస్ భాగాలు వీటిలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రాకేష్ చాప్దర్ తెలిపారు. ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర భారత్ నినాదంలో భాగంగా హైదరాబాద్‌లో అదనంగా మరో యూనిట్‌ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఆజాద్ ఇంజినీరింగ్ తయారు చేస్తోంది. -
వాహన అమ్మకాల జోరు: టాప్ గేర్‌లో విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది. డిమాండ్ పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది. కొత్త వాహనాల ఊతం.. కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల్లాంటివి భారత్‌ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు. ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు. -
ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ?
టెస్లా కారు తర్వలోనే ఇండియాలో పరుగులు పెట్టడం ఖాయమనే వార్తలు ఆటోమొబైల్ సెక్టార్ నుంచి వినిపిస్తున్నాయి. ఓ వైపు దిగుమతి సుంకం తగ్గింపుపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరో వైపు కారు తయారీకి అవసరమైన ఏర్పాట్లను టెస్లా చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంత వరకు టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏర్పాట్లలో టెస్లా భారత్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఓ వైపు పన్నుల తగ్గింపు విషయంలో భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఇండియాలో కార్ల తయారీకి అవసరమైన ఏర్పాట్లలో టెస్లా కంపెనీ చేస్తుందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. కార్ల తయారీకి అవసరమైన విడిభాగాలు తమకు సరఫరా చేయాలంటూ ఇండియాకు చెందిన పలు కంపెనీలతో టెస్లా సంప్రదింపులు చేస్తోందని ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మూడు కంపెనీలతో ఒప్పందం ఇండియాకు చెందిన మూడు కంపెనీలతో ఇప్పటికే టెస్లా ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం ఇన్స్స్ట్రుమెంటల్ ప్యానెల్, విండ్‌షీల్డ్స్, పలు రకాలైన బ్రేకులు, గేర్స్, పవర్సీట్స్ను సరఫరా చేయాల్సిందిగా ఆయా కంపెనీలను టెస్లా కోరిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సోనా కమ్‌స్టర్ లిమిటెడ్, సంధార్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీలు ఎప్పటి నుంచో టెస్లాకు కారు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయని, ఇది కొత్తగా చేసుకున్న ఒప్పందం కాదంటూ మరో వర్గం అంటోంది. మొదట దిగుమతికే అవకాశం టెస్లా, ఇండియా గవర్నమెంటుల మధ్య ఒప్పందం కుదిరినా ఇప్పటికిప్పుడు ఇండియాలో కార్ల తయారీ సాధ్యం కాదని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. మొదట విదేశీల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకుని టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాతే తయారీ యూనిట్ విషయంలో అడుగులు పడతాయని అంటున్నారు. ప్రతిష్టంభన తొలగేనా ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో సంచలనాలు సృష్టించింది టెస్లా. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ప్రోత్సాహం అందిస్తోంది ఇండియా. ఇటీవల మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటే కేంద్రం కోరింది. అయితే ఇండియాలో టెస్లా కార్లు ప్రవేశపెట్టే విషయంలో ఇటు టెస్లాకి అటు భారత ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. దిగుమతి పన్నులు తగ్గించాలంటూ టెస్లా అధినేత ఎలన్‌మస్క్ కోరుతుండగా ఇండియాలో తయారీ యూనిట్ పెడితే పన్నుల విషయంలో సానుకూలంగా స్పందిస్తామంటూ ప్రభుత్వ అధికారులను టెస్లాకు ఫీలర్ వదిలారు. దీంతో ఇండియాకి టెస్లా కార్లు రప్పించే విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. చదవండి : సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్! -
లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయ్
సాక్షి, ముంబై: దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం, ఇతర సెగ్మెంట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఆటోరంగ ఉత్పత్తి 13 శాతం క్షీణతను నమోదు చేసింది. డిమాండ్ తగ్గడం, ఆర్థికమందగనం కారణంగా పలు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశాయి. దీంతో ఆటో రంగంలోనూ ఉద్వాసనలకు తెర లేచింది. అంతేకాదు ఈ ప్రభావంతో ఆటో స్పేర్స్‌లో ఈ ఏడాది జూలై నాటికి 1 లక్ష మంది తమ తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయారని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) శుక్రవారం తెలిపింది. ఊహించనంత సుదీర్ఘమైన మందగమనం వాహన పరిశ్రమను దెబ్బతీస్తోందని, అమ్మకాలు బాగా తగ్గాయని, ఇది ఇతర సెగ్మెంట్లను దెబ్బతీస్తోదని అసోసియషన్ ప్రెసిడెంట్ దీపక్ జైన్ చెప్పారు. 2013-14 తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులేర్పడ్డాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆటో ఉత్పత్తి తగ్గడంతో విడిభాగాల పరిశ్రమ సామర్థ్య వినియోగం 50 శాతం పడిపోయినట్లు తెలిపింది. గతంలో ఇది గరిష్టంగా 80 శాతం నమోదయిందన్నారు. భారతదేశపు 57 బిలియన్ డాలర్ల ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ, దేశ జిడిపిలో 2.3 శాతం వాటాను కలిగిఉంది. అలాగే 5 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ కాలంలో రూ.1.99 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఇదే కాలంలో 10.1 శాతం తగ్గి రూ.1.79 లక్షల కోట్లుగా ఉందని అసోసియేషన్ పేర్కొంది. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నిలిచిపోయినట్లు పేర్కొంది. అయితే ఎగుమతులు 2.7శాతం పెరిగి రూ.51,397 వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయని ఏసీఎంఏ తెలిపింది. -
రక్షణ పరికరాల తయారీకి ఊపు
లెసైన్సు మినహాయింపుతో జోష్ ఉమ్మడి రాష్ట్రంలో రూ. 1,500 కోట్ల వ్యాపారం నాలుగేళ్లలో వ్యాపారం అయిదు రెట్లకు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాల తయారీలో ఉన్న కంపెనీలకు మంచి రోజులు రానున్నాయి. భారత రక్షణ శాఖ లెసైన్సింగ్ను సరళతరం చేయడమే ఇందుకు కారణం. విడిభాగాల తయారీలో హైదరాబాద్ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా తమ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాయి. వైజాగ్, విజయవాడ, కాకినాడ ప్రాంతంలోనూ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం సీమాంధ్ర, తెలంగాణలోని కంపెనీలు ఏటా రూ.1,500 కోట్లకుపైగా విలువైన విడిభాగాలను డీఆర్డీవో, బీడీఎల్, హెచ్ఏఎల్ వంటి సంస్థలకు సరఫరా చేస్తున్నాయి. రక్షణ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ రంగంలో ఉన్న కంపెనీలకు నూతన వ్యాపారావకాశాలు రానున్నాయి. 2018 నాటికి వ్యాపారం అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదీ ప్రభుత్వ నిర్ణయం.. యుద్ధ ట్యాంకులు, రక్షణ, అంతరిక్ష విమానాలు, విడిభాగాలు, యుద్ధ నౌకలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, వీటికి సంబంధించిన పరికరాల తయారీకి మాత్రమే లెసైన్సు తప్పనిసరి. రక్షణ శాఖ వినియోగించే ఇతర వందలాది పరికరాల తయారీకి ఇకనుంచి లెసైన్సు అవసరం లేదని గురువారం(జూన్ 26) కేంద్రం ప్రకటించింది. గత జాబితాతో పోలిస్తే 50 శాతం పరికరాల తయారీకి ఇకపై లెసైన్సు అవసరం ఉండదు. విదేశీ కంపెనీలు సైతం వీటిని దేశీయంగా తయారు చేయవచ్చు. భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్కులను ప్రోత్సహించాలి.. హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద 27 కంపెనీలు కలిసి సమూహ పేరుతో ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేస్తున్నాయి. ఎంటీఏఆర్ టెక్నాలజీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఎస్కేఎం టెక్నాలజీస్ ప్రమోటర్లుగా మరో 21 కంపెనీలు పార్కులో వాటాదారులుగా ఉన్నాయి. ఇలా కంపెనీలు కలిసి పార్కు ఏర్పాటు చేసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. తయారీ రంగంపై అధికంగా దృష్టిపెడుతున్న ఈ సమయంలో సమూహ వంటి పార్కులను మరిన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ కోరుతోంది. అంతేగాక డిఫెన్సుకు ప్రత్యేక పారిశ్రామిక విధానం అమలు చేయాలని ఓ కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులతో కూడుకున్న పరిశ్రమలు కాబట్టి ప్రభుత్వం విభాగాలవారీగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్లాంట్లు పెడితే, సెజ్ నుంచి ఈ ప్లాంట్లకు సరఫరా చేసే పరికరాలను ఎగుమతిగా (డీమ్డ్ ఎక్స్పోర్ట్) పరిగణించాలని శ్రీరామ్ అన్నారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా వేరేచోట ప్లాంటు పెట్టాలంటే ఏ కంపెనీకైనా కష్టసాధ్యమేనన్నారు. మేలు చేసేలా ఉంటేనే.. ప్రభుత్వం అమలు చేసే పారిశ్రామిక విధానాల ఆధారంగానే కంపెనీల భవిష్యత్ ఉంటుందని సమూహ ఇంజనీరింగ్ చైర్మన్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ చైర్మన్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. దేశీయ కంపెనీలకు జీవం పోసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. ‘వాణిజ్య కంపెనీల మాదిరిగా ఈ రంగ కంపెనీలపై పన్నులు విధిస్తున్నారు. బ్యాంకు వడ్డీలూ ఎక్కువే. విద్యుత్ సరఫరాలోనూ అవాంతరాలే. కొత్త కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ప్రహసనంగా ఉంటోంది. ఉద్యోగుల సంఖ్యనుబట్టి పన్నులు విధించాలి. పన్నుల విధింపు సహేతుకంగా ఉండాలి’ అని అన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కొత్త కంపెనీలూ వస్తాయి.. తెలంగాణ, సీమాంధ్రలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా కంపెనీలు 400 దాకా ఈ రంగంలో నిమగ్నమయ్యాయి. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 350 ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికిపైగా ఈ రంగంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నింటికీ కొత్త అవకాశాలు వచ్చినట్టేనని సమూహ ఇంజనీరింగ్ ఈడీ, స్కార్లెట్ ఎండీ శ్రీరామ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కొత్త కంపెనీలూ వస్తాయని చెప్పారు. ఇప్పటికే ఉన్న కంపెనీలకు మెరుగైన వ్యాపారావకాశాలు ఉంటాయని, ఇవి సామర్థ్యాన్ని పెంచుకుంటాయని వెల్లడించారు. విదేశీ కంపెనీలు సైతం ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయని చెప్పారు. ఉపాధి అవకాశాలు మూడు రెట్లు అవుతాయని పేర్కొన్నారు. ప్రసుత్తం సీమాంధ్ర, తెలంగాణలో రూ.1,500 కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నారు. నాలుగేళ్లలో ఇది రూ.7,500 కోట్లు దాటుతుందని వివరించారు. పౌర విమానయాన రంగంలో కూడా ఆఫ్సెట్ పాలసీ అమలైతే రెండు రాష్ట్రాల్లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు.