న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్‌లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది.
డిమాండ్
పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది.
కొత్త వాహనాల ఊతం..
కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీముల్లాంటివి భారత్‌ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు.
ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ
టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment