
స్వల్ప డిమాండ్, నిల్వల సర్దుబాటులో భాగంగా డీలర్లకు సరఫరా తగ్గడంతో మార్చిలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ దేశీయ వాహన విక్రయాలు క్షీణించాయి. మరోవైపు ఎస్‌యూవీ మోడళ్లకు డిమాండ్ కొనసాగడంతో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది.
మారుతీ సుజుకీ దేశీయంగా క్రితం నెలలో 1,50,743 వాహనాలు విక్రయించింది. గత ఏడాది మార్చిలో అమ్ముడైన 1,52,718 వాహనాలతో పోలిస్తే 1% తక్కువ. కాగా ఆర్థిక సంవత్సరం 2024–25(ఎఫ్‌వై 25)లో దేశీయంగా మొత్తం 17,60,767 ప్యాసింజర్ వాహనాలు అమ్మింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 17,59,881 యూనిట్లుగా ఉంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ వాహన విక్రయాలు 53,001 యూనిట్ల నుంచి 2% క్షీణించి 51,820కు వచ్చి చేరాయి. ఇక ఎఫ్‌వై 25లో దేశీయంగా 5,98,666 వాహనాలు అమ్మింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 6,14,721 యూనిట్లుగా ఉంది.
ఎస్‌యూవీలకు డిమాండ్ లభించడంతో ఎంఅండ్‌ఎం మార్చి దేశీయ అమ్మకాల్లో 18% వృద్ధి నమోదై 48,048 యూనిట్లకు చేరాయి.
ఎఫ్‌వై25లో దేశీయంగా 5,51,487 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. ఎఫ్‌వై 2024లో అమ్ముడైన 4,59,877 వాహనాలతో పోలిస్తే ఇవి 20% అధికం.
టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 3% పెరిగి 51,872 యూనిట్లకు చేరుకున్నాయి. ఎఫ్‌వై 25లో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 3% క్షీణత నమోదై 5,56,263 యూనిట్లకు దిగివచ్చాయి.
ఇదీ చదవండి: లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మార్చి నెలలో 23,430 వాహనాలను విక్రయించినట్లు వాహన్ డేటాలో వెల్లడైంది. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల నుంచి మంచి డిమాండ్ కారణంగా విక్రయాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. తన జెన్3 వాహనాల డెలివరీలను మార్చి నుంచి ప్రారంభించింది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచి ఏప్రిల్ నుంచి వేగవంతమైన డెలివరీలు అందిచనున్నట్లు ఓలా తెలిపింది.
