
ఆటో రంగ దిగ్గజాలు వచ్చే నెల(ఏప్రిల్) నుంచి వాహన ధరలను పెంచే సన్నాహాల్లో ఉన్నాయి. పెరిగిన ముడిసరుకుల వ్యయాలను కొంతవరకూ సర్దుబాటు చేసుకునే ప్రణాళికల్లో భాగంగా ధరలు పెంచనున్నట్లు చెబుతున్నాయి. ప్రధానంగా కార్ల తయారీ కంపెనీలు ధరల పెంపు(car prices) యోచనను వెల్లడించాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 4 శాతం వరకూ పెంచే యోచనలో ఉన్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వాణిజ్య వాహన ధరలను 2 శాతంవరకూ పెంచనున్నట్లు టాటా మోటార్స్(Tata Motors) వెల్లడించింది. ఈ బాటలో హోండా కార్స్ సైతం ధరల పెంపువైపు చూస్తున్నట్లు తెలియజేసింది. వెరసి కొత్త ఏడాది(2025)లో రెండోసారి ధరల పెంపును చేపట్టనున్నాయి.
ముడివ్యయాల సర్దుబాటు
ముడిసరుకులతోపాటు నిర్వహణ వ్యయాలు పెరగడంతో కార్ల ధరలను సవరించనున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. మోడల్ ఆధారంగా గరిష్టంగా 4 శాతంవరకూ ధరల పెంపు ఉండొచ్చని తెలియజేసింది. కస్టమర్లపై వ్యయ ప్రభావాన్ని కనీసస్థాయికి పరిమితం చేసే బాటలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ప్రస్తుతం మారుతీ ఎంట్రీలెవల్ ఆల్టో కే10సహా ఎంపీవీ.. ఇన్విక్టో వరకూ పలు మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు(ఢిల్లీ ఎక్స్‌షోరూమ్) రూ. 4.23 లక్షల నుంచి రూ. 29.22 లక్షలవరకూ ఉన్నాయి.
ఇదీ చదవండి: జీడీపీలో ఎంఎస్‌ఎంఈ వాటా పెంపునకు ఏఐ తోడ్పాటు
ఫిబ్రవరి 1 నుంచి మారుతీ కార్ల ధరలను గరిష్టంగా రూ. 32,500 వరకూ పెంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో టాటా మోటార్స్ సైతం ఏప్రిల్ నుంచి వాణిజ్య వాహన ధరలను 2 శాతంవరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ఇక హోండా కార్స్ ఇండియా సైతం వాహన ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment