Vehicle sales
-
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుల్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
భారతదేశంలో వాహన వినియోగం పెరగటమే కాకుండా.. ఎగుమతులు కూడా పెరిగాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతులు ఏకంగా 2,68,000 యూనిట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే మారుతి సుజుకి దాదాపు 70 శాతం షిప్మెంట్లను కలిగి ఉంది.2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 4,04,397 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 577,875 యూనిట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 662,703 యూనిట్లగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో, ఎగుమతులు 672,105 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020-21 కంటే 2,67,708 యూనిట్లు ఎక్కువ. ఎగుమతుల్లో మారుతి సుజుకి రికార్డ్ క్రియేట్ చేసింది.మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల మీద పనిచేస్తుంది. అంతే కాకుండా టయోటాతో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ప్రపంచ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడంలో సహాయపడింది.కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు తమ కార్లను ఎగుమతి చేస్తోందని.. ప్రస్తుతం కంపెనీకి దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రధాన మార్కెట్. భారత్ నుంచి బాలెనొ, డిజైర్, ఎస్-ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేస్తోంది. -
ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది. ⇒ హ్యుందాయ్ గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్‌లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్‌లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి. -
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్.. వాటికే ఎక్కువ డిమాండ్!
ప్యాసింజర్ వాహనాల విక్రయాల పరిమాణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5–7 శాతం వృద్ధి చెందుతుంని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడవ ఏడాది పరిశ్రమ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని తెలిపింది. దేశీయంగా కార్ల విక్రయాలు, వీటి ఎగుమతులకు డిమాండ్ స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం గరిష్ట వృద్ధిని అంచనా వేసిన నేపథ్యంలో.. 2024–25 అమ్మకాల్లో 5–7 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు క్రిసిల్ తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్‌యూవీలకు డిమాండ్.. వినియోగదారుల ప్రాధాన్యతలో గణనీయ మార్పు ఎస్‌యూవీలకు డిమాండ్‌ను పెంచింది. మహమ్మారి కంటే ముందునాటి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో ఎస్‌యూవీల వాటా 28 శాతం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రెండింతలై 60 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వేరియంట్లతో సహా వివిధ ధరల శ్రేణిలో కొత్త మోడళ్ల రాక, భవిష్యత్ మోడళ్లు, సెమీకండక్టర్ల సాధారణ లభ్యత కారణంగా ఎస్‌యూవీలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2024–25లో ఎస్‌యూవీల విక్రయాల్లో 12 శాతం వృద్ధి ఉండొచ్చు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల విభాగాల్లో పోటీ ధరలో ఫీచర్లతో కూడిన మోడళ్ల రాక ఈ జోరుకు ఆజ్యం పోస్తుంది. కార్ల ధరల్లో పెరుగుదల.. విడిభాగాలు, తయారీ వ్యయం పెరుగుతూ వస్తోంది. భద్రత, ఉద్గారాలపై మరింత కఠిన నిబంధనలను తయారీ సంస్థలు పాటించాల్సి రావడంతో వాహనాల ధర గత 3–4 సంవత్సరాలలో అధికం అయింది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల వాటా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి పరిమితం అవుతుందని అంచనా. గత రెండేళ్లలో కీలక ఎగుమతి మార్కెట్లు లాటిన్ అమెరి కా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో ద్రవ్యోల్బణం ఎదు రుగాలులు, పరిమిత విదేశీ మారకపు లభ్యత దీనికి ప్రధాన కారణం. 2024–25లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుంది. అయితే స్థిర కమోడిటీ ధరలు, గత ఆర్థిక సంవత్సరంలో అమలైన ధరల పెంపు పూర్తి ప్రయోజనంతోపాటు ఎస్‌యూవీల వాటా పెరగడంతో తయారీదారుల నిర్వహణ లాభాలు సు మారు 2 శాతం ఎగసి ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి చేరుతుంది. ఎస్‌యూవీలకు డిమాండ్‌తో 2024–25లో ఇది 11.5–12.5 శాతంగా ఉండొచ్చు. రూ.44,000 కోట్ల పెట్టుబడి.. ఈ ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం దాదాపు 85 శాతానికి చేరుకోవచ్చు. ఎస్‌యూవీల కు బలమైన డిమాండ్ కొనసాగుతున్నందున ప్యా సింజర్ వాహన తయారీ సంస్థలు 2023–25 మధ్య సుమారు రూ.44,000 కోట్ల పెట్టుబడి వ్యయం చేస్తున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పో లిస్తే ఇది దాదాపు రెండింతలు. అయితే ఆరోగ్యక రంగా నగదు చేరడం, మిగులు కారణంగా రుణా లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తయారీదారుల క్రెడిట్ ప్రొఫైల్‌లను క్రిసిల్ స్థిరంగా ఉంచుతోంది. -
కొత్త కార్ల పరుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్‌యూవీలు ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. మెర్సిడెస్‌తో బోణీ.. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్ఎస్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్‌ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది. మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్యూవీ టైసర్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్‌లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్‌వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి. ఈవీలు సైతం మార్కెట్లోకి.. ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్‌లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్లో రానుందని సమాచారం. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డ్!
ముంబై: పండుగ సీజన్ డిమాండ్ కలిసిరావడంతో దేశీయ ఆటో పరిశ్రమ అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం 3,91,472 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,36,679 వాహనాలతో పోలిస్తే ఇవి 16% అధికం. సెమీ కండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, దసరా సందర్భంగా నెలకొన్న కొనుగోళ్లు గత నెలలో రికార్డు అమ్మకాల వృద్ధికి తోడ్పడ్డాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది తొలి 3 నెలలు మినహా ప్రతి నెలా అమ్మకాల వృద్ధి జరగడం పరిశ్రమకు సానుకూల సంకేతమన్నారు. క్షేత్ర స్థాయిలో డీలర్ల వద్ద నిల్వల స్థాయి ఇంకా అధికంగా ఉంది. ఈ నవంబర్ తొలి 15 రోజుల్లో రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో హోల్‌సేల్ అమ్మకాలు జరగొచ్చన్నారు. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్‌ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్‌టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో కలిపి 2023 మే నెలలో 20,19,414 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు, ట్రాక్టర్లకు విపరీత డిమాండ్ ఉండడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు 9 శాతం పెరిగి 14,93,234 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 7 శాతం అధికమై 77,135 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 79 శాతం ఎగసి 79,433 యూనిట్లు, ట్రాక్టర్లు 10 శాతం దూసుకెళ్లి 70,739 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది. -
ఎస్‌యూవీలకే డిమాండ్
న్యూఢిల్లీ: ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్‌తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ బలమైన హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి. అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్‌యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. -
జోరు తగ్గిన వెహికల్ సేల్స్ - కారణం ఇదే అంటున్న ఫాడా..!
ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు ఏప్రిల్‌లో నాలుగు శాతం తగ్గినట్లు భారత వాహన డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో మొత్తం 17,24,935 వాహనాలు విక్రయంగా.., గతేడాదిలో ఇదే నెలలో 17,97,432 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన, ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్‌లో నీరసించాయి. ఇందులో ద్విచక్ర వాహన విక్రయాలు 7%, ప్యాసింజర్ వాహనాలు ఒకశాతం పడిపోయినట్లు ఫాడా తెలిపింది. ‘‘ఉద్గార ప్రమాణ నిబంధనలతో ఈ ఏప్రిల్ ఒకటి నుంచి పెరుగనన్న వాహనాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు మార్చిలోనే ముందస్తు కొనుగోళ్లు చేపట్టారు. అలాగే అధిక బేస్ ఎఫెక్ట్ ఒక కారణంగా నిలిచింది. వెరసి గడిచిన ఎనిమిది నెలల్లో తొలిసారి ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి క్షీణత నమోదైంది’’ ఫాడా తెలిపింది. అయితే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల వాహన డీలర్‌షిప్‌ల వద్ద వినియోగదారుల ఎంక్వైరీ పెరిగాయి. మే నెల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫాడా ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే త్రీ–వీలర్స్, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరిగింది. త్రీ–వీలర్ అమ్మకాలు 57 శాతంతో గణనీయమైన వృద్ధిని సాధించాయి. ట్రాక్టర్ విక్రయాలు ఒక శాతం, వాణిజ్య వాహనాలు 2 శాతంతో స్వల్పంగా పెరిగాయి. ‘‘ గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన ప్యాసింజర్ విభాగం గత నెలలో నెమ్మదించింది. ద్విచక్ర వాహనాల విభాగం కరోనా ముందు కంటే 19 శాతం వెనకబడే ఉంది. ఈ విభాగంపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీని 18 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ విభాగం మొత్తం ఆటో అమ్మకాల్లో 75 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున జీఎస్టీ తగ్గింపు ద్విచక్ర వాహన అమ్మకాల పునరుద్ధరణకు దోహదపడుతుంది’’ అని సింఘానియా అన్నారు. -
మారుతీ, హ్యుండై వాటా తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది. ఇతర కంపెనీలు ఇలా.. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. -
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల జోరు.. భారత చరిత్రలోనే ఇదే అత్యధికం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 - 23లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు హోల్‌సేల్‌లో రికార్డు స్థాయిలో 38,90,114 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత చరిత్రలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాల జోరు ఇందుకు దోహదం చేసింది. 2018 - 19లో విక్రయం అయిన 33,77,436 యూనిట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26.73 శాతం వృద్ధి అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ వన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. 2021–22లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 30,69,523 యూనిట్లు. యుటిలిటీ వాహనాలు.. గత ఆర్థిక సంవత్సరంలో 34.55 శాతం వృద్ధితో 20,03,718 యూనిట్ల యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 14,89,219 యూనిట్లు. పీవీ విభాగంలో యుటిలిటీ వెహికిల్స్ వాటా ఏకంగా 51.5 శాతానికి ఎగబాకింది. వాణిజ్య వాహనాలు 7,16,566 నుంచి 9,62,468 యూనిట్లకు చేరాయి. 2018 - 19 తర్వాత ఇదే అధికం. ద్విచక్ర వాహనాలు 17 శాతం అధికమై 1,35,70,008 యూనిట్లు నవెదయ్యాయి. సానుకూలంగా పరిశ్రమ.. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయాలు 20.36 శాతం పెరిగి 2,12,04,162 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్ తెలిపింది. ప్రారంభ స్థాయి మినీ కార్ల విక్రయాలు 57 శాతం పడిపోయాయి. 2016 - 17లో ఈ విభాగంలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. 2018 - 19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ స్కటర్లు 27 శాతం, మోటార్‌సైకిళ్లు 38 శాతం తగ్గాయి. ‘అన్ని విభాగాల్లో మొత్తం డివండ్ క్రమంగా పెరుగుతోంది. సరైన దిశలోనే పరిశ్రమ కదులుతోంది. 2023–24 సంవత్సరానికి సానుకూలంగా ఉంటుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్‌లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
2023 ఫిబ్రవరి అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: ఏకంగా..
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2023 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, గత నెలలో కంపెనీ 79,705 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి మునుపటి కంటే 2.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరి నెలలో 77,733 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత నెల దేశీయ విక్రయాల మొత్తం 78,006 యూనిట్లు కాగా ఇదే నెల గత సమత్సరంలో 73,875 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 6 శాతం పెరిగింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు, ప్యాసింజర్ వాహన విక్రయాలలో కూడా మంచి పురోగతిని సాధించింది. భారతదేశంలో గత నెల మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు (ఎలక్ట్రిక్ వాహాలతో కలిపి) 42,862 యూనిట్లు. 2022 ఇదే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మొత్తం 39,981 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే టాటా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా గతేడాదికంటే 7 శాతం పెరిగాయి. మొత్తం మీద 2023 ప్రారంభం నుంచి టాటా మోటార్స్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
బజాజ్ ఆటో లాభం 16% డౌన్
న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,719 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 2,040 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం తగ్గింది. విదేశాలకు ఎగుమతులు 25 శాతం క్షీణించడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 8,762 కోట్ల నుంచి రూ. 10,203 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మాత్రం లాభం రూ. 1,275 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 11,44,407 యూనిట్ల నుంచి నామమాత్రంగా 1 శాతం వృద్ధితో 11,51,012 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 5,32,216 యూనిట్ల నుంచి 30 శాతం వృద్ధి చెంది 6,94,375 యూనిట్లకు చేరాయి. అయితే ఎగుమతులు మాత్రం 6,12,191 యూనిట్ల నుంచి 4,56,637 యూనిట్లకు తగ్గాయి. విదేశీ మార్కెట్లలో స్థూలఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు ఇందుకు కారణమని బజాజ్ ఆటో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రం విక్రయాలు పుంజుకున్నాయని వివరించింది. శుక్రవారం బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్లు 1% క్షీణించి రూ. 3,569 వద్ద క్లోజయ్యాయి. -
రయ్‌మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 18,77,072 యూనిట్లు నమోదయ్యాయి. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల. సెమికండక్టర్ల లభ్యత మెరుగవడం, పండుగల సీజన్ కోసం డీలర్లు సిద్ధమవడం కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధ్యపడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు 21 శాతం దూసుకెళ్లి 2,81,210 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 16 శాతం ఎగసి 15,57,429 యూనిట్లకు చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్స్ 23 శాతం పెరిగి 10,16,794 యూనిట్లు, స్కూటర్స్ 10 శాతం అధికమై 5,04,146 యూనిట్లకు ఎగశాయి. త్రిచక్ర వాహనాలు 63 శాతం దూసుకెళ్లి 38,369 యూనిట్లకు పెరిగాయి. రుతుపవనాలు మెరుగ్గా ఉండడం, రాబోయే పండుగల సీజన్‌తో వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. పరిశ్రమకు సీఎన్జీ ధర సవాల్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. -
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్‌లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు. -
వాహన అమ్మకాల జోరు: టాప్ గేర్‌లో విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది. డిమాండ్ పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది. కొత్త వాహనాల ఊతం.. కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల్లాంటివి భారత్‌ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు. ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు. -
వాణిజ్య వాహన విక్రయాలు : 4.35 లక్షలు
ముంబై: దేశీయంగా వాణిజ్య వాహనాల (సీవీ) పరిశ్రమ రికవరీ బాట పట్టిందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ (వీఈసీవీ) ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. బస్సుల సెగ్మెంట్ కోలుకోవడం, రిప్లేస్మెంట్కు డిమాండ్ పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 4.35 లక్షల స్థాయి దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2018–19లో రికార్డు స్థాయిలో 5.77 లక్షల పైచిలుకు అమ్ముడైన సీవీలు వివిధ కారణల రీత్యా 2020–21లో 2.34 లక్షలకు పడిపోయాయి. 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 3.34 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య వాహనాల అమ్మకాలు 47 శాతం పెరిగి 3.43 లక్షలకు చేరాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, గత నాలుగు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణమాలను బట్టి చూస్తే సీవీల అమ్మకాలు తిరిగి 2019–20 నాటి స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అగర్వాల్ వివరించారు. వచ్చే మూడేళ్లు పరిశ్రమకు మెరుగ్గా ఉండనున్నట్లు పేర్కొన్నారు. స్వీడన్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. చదవండి👉 ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారులకు శుభవార్త! -
రవాణా ఆదాయం రయ్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2021–22 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రవాణా ఆదాయంలో 58.70 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2019–20తో పోల్చితే 37.95 శాతం వృద్ధి నమోదైంది. వాహన విక్రయాలు పెరగడంతో జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత వృద్ధి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో నమోదు కావడం గమనార్హం. ద్విచక్రవాహనాలు మినహా మిగతా అన్ని రకాల వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. కార్ల జోరు.. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కార్ల విక్రయాల్లో 5.11 శాతం వృద్ధి నమోదైంది. ఆటోలు, ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆటోల విక్రయాల్లో 69.7 శాతం, ప్యాసింజర్ వాహనాలు 57.87 శాతం, గూడ్స్ వాహనాల విక్రయాల్లో 37.28 శాతం వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం –3.75 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు 2019–20 తొలి త్రైమాసికంలో రూ.749.75 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,034.25 కోట్ల ఆదాయం సమకూరింది. జాతీయ స్థాయిలో అన్ని రకాల వాహనాల విక్రయాల్లో ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో ప్యాసింజర్ వాహనాలు కొనుగోళ్లు భారీగా పడిపోగా ఇప్పుడు పెరుగుతున్నాయి. -
వాహన విక్రయాలు జూమ్
ముంబై: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం తగ్గడంతో.., దేశీయంగా జూలైలో వాహన విక్రయాలు వృద్ధి బాటపట్టాయి. వార్షిక ప్రాతిపదికన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా ఆటో అమ్మకాలు పురోగతిని సాధించాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాదిలోకెల్లా జూలైలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. -
రయ్‌మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్‌లో 19 శాతం దూసుకెళ్లి 2,75,788 యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగుపడడం ఈ వృద్ధికి కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 10.6 లక్షల నుంచి 13.08 లక్షల యూనిట్లకు చేరింది. త్రిచక్ర వాహనాలు సుమారు మూడురెట్లు ఎగసి 26,701 యూనిట్లుగా ఉంది. అన్ని విభాగాల్లో కలిపి 13.01 లక్షల నుంచి 16.11 లక్షల యూనిట్లకు పెరిగింది. ఏప్రిల్–జూన్‌లో ప్యాసింజర్ వాహనాలు 41 శాతం పెరిగి 9.1 లక్షల యూనిట్లకు ఎగసింది. వాణిజ్య వాహనాలు 1.05 లక్షల నుంచి 2.24 లక్షల యూనిట్లకు చేరింది. ద్విచక్ర వాహనాలు 24.13 లక్షల నుంచి 37.24 లక్షల యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 24,522 నుంచి 76,293 యూనిట్లకు చేరాయి. అన్ని విభాగాల్లో కలిపి జూన్ త్రైమాసికంలో 31.9 లక్షల నుంచి 49.3 లక్షల యూనిట్లకు పెరిగాయి. రెండింతలైన పోర్ష్ అమ్మకాలు లగ్జరీ కార్ల తయారీలో ఉన్న పోర్ష్ ఈ ఏడాది జనవరి–జూన్‌లో భారత్‌లో 378 యూనిట్లు విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా వృద్ధి. ఖరీదైన స్పోర్ట్స్ కార్ల డిమాండ్‌తో పరిశ్రమ కోలుకుంటోందని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనమని కంపెనీ తెలిపింది. 2021లో భారత్‌లో 474 పోర్ష్ కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటి వరకు సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే. -
వాహన విక్రయాల జోష్
ముంబై: సెమీకండక్టర్ల కొరత ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దేశీయ వాహన విక్రయాలు జూన్‌లో వృద్ధి బాటపట్టాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకీతో సహా హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ కంపెనీలు సమీక్షించిన నెలలో సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా వాణిజ్య వాహన విక్రయా ల్లో వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఊపందుకోవడంతో బజాజ్ ఆటో మినహా మిగిలిన అన్ని ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. -
వాహన విక్రయాల్లో వృద్ధి
ముంబై: గత ఆర్థిక ఏడాది చివరి నెల మార్చి వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ద్విచక్ర వాహనాలు అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ‘‘2021–22లో వాహనాల ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కొంత ప్రభావం చూపింది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా పరిస్థితి అనూహ్యంగా కొనసాగుతున్నందున ప్రస్తుత సంవత్సరంలో ఇది కొంత ప్రభావం చూపవచ్చు’’ అని మారుతీ తెలిపింది. ► మారుతీ సుజుకీ మార్చి మొత్తం అమ్మకాలు 1,43,899 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఫిబ్రవరిలో విక్రయించిన మొత్తం 1,55,417 విక్రయాలతో పోలిస్తే స్వల్పంగా ఆరుశాతం(6.3)గా ఉంది. 2021–22లో ఎగుమతులు 2,38,376 యూనిట్లు నమో దయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి ఎగుమతులు రికార్డు కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. ► కియా మోటర్స్ మార్చి విక్రయాలు 18% పెరిగాయి. ఈ మార్చిలో మొత్తం 22,622 యూనిట్లకు అమ్మింది. ఒక నెలలో ఈ స్థాయిలో విక్రయించడం ఇదే తొలిసారి. సెమికండెక్టర్ల కొరత కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,86,787 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్ 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ మార్చిలో 86,718 కార్లను అమ్మగా.. గతేడాది ఇదేనెలలో 42,293 యూనిట్లను అమ్మింది. హీరో మోటో మార్చి అమ్మకాలు 14% క్షీణించాయి. గతే డాది మార్చిలో 5.24 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ మార్చిలో 4.50 లక్షల యూనిట్లు అమ్మింది. -
పుంజుకున్న వాహన విక్రయాలు
ముంబై: సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో వృద్ధి బాటపట్టాయి. మూడో దశ లాక్డౌన్ ఆంక్షల సడలింపు ప్యాసింజర్ వాహన విక్రయాలకు కలిసొచ్చింది. గత నెలలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ విక్రయాలు పెరిగాయి. అయితే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టయోటా, హోండా కార్ల అమ్మకాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. మరోవైపు ద్విచక్ర వాహనాలు విక్రయాలు డీలాపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సంపద్రాయ టూ వీలర్స్ అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు వరుసగా 29% 6%, 15% చొప్పున క్షీణించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. బేస్ ఎఫెక్ట్ కారణంగా ట్రాకర్ల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ‘‘దేశంలో గత మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత లీటరు ఇంధన ధరలు రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం మార్చి వాహన విక్రయాలపై ప్రతికూలతను చూపొచ్చు’’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
AP: చివరి రోజు అమ్మకాల మోత!
సాక్షి, అమరావతి: గత ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగాయి. సాధారణంగా రోజుకు 3,000 నుంచి 3,500 వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. కానీ, ఆ ఒక్క రోజు మాత్రం మొత్తం 13,034 వాహనాలు అమ్ముడయ్యాయి. కొత్త ఏడాది జనవరి 1 నుంచి రవాణేతర వాహనాలపై జీవిత పన్ను పెరుగుతున్న నేపథ్యంలోనే ఎక్కువమంది ఆ రోజు వాహనాలు కొనుగోలు చేశారని, దీంతో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆ రోజున రాష్ట్రంలోని 738 వాహన డీలర్ల నుంచి ఏకంగా 13,034 వాహన విక్రయాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా మోటారు సైకిళ్లు 10,529.. 1,742 కార్లు అమ్ముడయ్యాయి. అలాగే, ఆ ఒక్కరోజే త్రైమాసిక పన్ను, జీవిత పన్ను రూపంలో రవాణా శాఖకు రూ.32.53 కోట్ల ఆదాయం వచ్చింది. జీవిత పన్ను పెంపు ఇక జనవరి 1 నుంచి ఐదు లక్షల రూపాయల్లోపు రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. అలాగే, రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల్లోపు ఉన్న రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 14 శాతానికి, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల్లోపు వాహనాలపై 17 శాతం, రూ.20 లక్షలు పైనున్న రవాణేతర వాహనాలపై 18 శాతం మేర జీవిత పన్ను అమల్లోకి వచ్చింది. ఈ కారణంతోనే మొన్న డిసెంబర్ 31న భారీఎత్తున మోటార్ సైకిళ్లు, కార్లు కొనుగోలు చేశారని రవాణా శాఖాధికారులు తెలిపారు.