
న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్ 1997–98 నుంచి ఆటో అమ్మకాల డేటాను రికార్డు చేస్తుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయి పతనం నమోదుకాలేదు. ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), వాణిజ్య వాహనాలు (సీవీ), ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు 23.55% తగ్గాయి. గతనెల విక్రయాలు 18,21,490 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన మొత్తం వాహనాలు 23,82,436 యూనిట్లు.
10వ నెల్లోనూ పీవీ సేల్స్ డౌన్..: ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 31.57 శాతం క్షీణతను నమోదుచేశాయి. గతనెల అమ్మకాలు 1,96,524 యూనిట్లు కాగా, 2018 ఆగస్టు విక్రయాలు 2,87,198 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. వరుసగా 10 నెలల నుంచి పీవీ అమ్మకాలు దిగజారుతూనే ఉన్నాయి.
మారుతి అమ్మకాల్లో 36.14 శాతం క్షీణత
పీవీ విక్రయాల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకీ ఆగస్టు నెల అమ్మకాల్లో 36.14 శాతం క్షీణతను నమోదుచేసింది. గతనెల విక్రయాలు 93,173 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక మహీంద్ర అండ్ మహీంద్ర అమ్మకాలు 31.58 శాతం, హ్యుందాయ్ సేల్స్ 16.58 శాతం తగ్గాయి.
ద్విచక్ర వాహనాల సేల్స్ 22 శాతం డౌన్
ఆగస్టులో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 22.24% తగ్గాయి. గతనెల విక్రయాలు 15,14,196 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన వాహనాలు 19,47,304.
Comments
Please login to add a commentAdd a comment