న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు డిమాండ్ తగ్గుదలతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. మారుతీ సుజుకీ 2018–19లో రికార్డు స్థాయిలో మొత్తం 18,62,449 యూనిట్లు విక్రయించినప్పటికీ.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.7 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. 2017–18లో మారుతీ 17,79,574 వాహనాలు విక్రయించింది. దీంతో సవరించుకున్న అంచనాలను కూడా సాధించలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల స్థాయిలో అమ్మకాల వృద్ధి ఉంటుందని అంచనా వేసినప్పటికీ గతేడాది డిసెంబర్‌లో మారుతీ సుజుకీ దీన్ని 8%కి కుదించింది. దేశీయంగా విక్రయాలు చూస్తే.. 6.1% వృద్ధితో 16,53,500 యూనిట్స్ నుంచి
17,53,700 యూనిట్స్‌కు పెరిగాయి.
మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలు 2.5 శాతం వృద్ధితో 6,90,184 వాహనాల నుంచి 7,07,348 వాహనాలకు పెరిగాయి. అయితే, దేశీయంగా మాత్రం అమ్మకాలు కేవలం 1.7 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. 5,36,241 నుంచి 5,45,243 వాహనాలకు పెరిగాయి. ‘గత ఆర్థిక సంవత్సరం 1.7 శాతం వృద్ధితో సానుకూలంగా ముగిసింది. దేశీయంగా అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. అటు మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 2 శాతం వృద్ధితో 2,49,505 యూనిట్స్ నుంచి 2,54,701 యూనిట్స్‌కు పెరిగాయి. దేశీయంగా ఆటోమొబైల్ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. అన్ని విభాగాలు కలిపి చూస్తే దేశీ విక్రయాల్లో 11 శాతం వృద్ధి సాధించగలిగామని ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు ఉత్పత్తులు ఇందుకు తోడ్పడ్డాయని ఆయన వివరించారు.
టాటా మోటార్స్ 16 శాతం..
టాటా మోటార్స్ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం 16 శాతం వృద్ధితో 5,86,507 యూనిట్స్ నుంచి 6,78,486కి చేరాయి. గత నెల మార్చిలో మాత్రం 1 శాతం క్షీణించి 69,409 యూనిట్స్ నుంచి 68,709 యూనిట్స్‌కు తగ్గాయి. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 1,70,026 యూనిట్స్ నుంచి 1,83,787 యూనిట్స్‌కు చేరాయి. మార్కెట్లో కఠిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఫలితాలు సాధించడం సానుకూలాంశమని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) అమ్మకాలు 7 శాతం వృద్ధితో 1,40,645 వాహనాల నుంచి 1,50,525 యూనిట్స్‌కు చేరింది.
హీరో అమ్మకాలు 78 లక్షలు..
ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 78,20,745 వాహనాలు విక్రయించింది. 2017–18లో అమ్మకాలు 75,87,130గా నమోదయ్యాయి. అటు సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాలు సుమారు 30 శాతం వృద్ధితో 5,74,711 యూనిట్స్ నుంచి 7,47,506కి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 12 శాతం వృద్ధితో 37.57 లక్షలకు పెరిగాయి.
పెరిగిన మారుతీ సుజుకీ కార్ల ధరలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను స్వల్పంగా పెంచినట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్’ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)ను వాహనాలకు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ ప్లేట్స్ వ్యయాన్ని కస్టమర్లపై మోపుతున్నట్లు వివరించింది. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధిక భద్రతా ప్లేట్ ధర రూ.689 వరకు ఉన్నందున ఈ మొత్తానికి ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఆల్టో 800 నుంచి ఎస్‌క్లాస్ వరకు అనేక కార్లను సంస్థ విక్రయిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ.2.67 లక్షలు–11.48 లక్షల వరకు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment