వాహన అమ్మకాలు అటూఇటూ!
మారుతీ, టాటా మోటార్స్ జోరు
* ప్రభావం చూపుతున్న గ్రామీణ మార్కెట్ మందగమనం
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు మేలో మిశ్రమంగా నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ మినహా మిగిలిన కంపెనీల వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు మాత్రం దేశీయ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. హ్యుందాయ్, హోండాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ ఇండియా, టయోటా కంపెనీల అమ్మకాలు తగ్గాయి.
ఇక టూ వీలర్ల విషయానికొస్తే హీరోమోటొకార్ప్ అమ్మకాలు 5 శాతం తగ్గగా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అమ్మకాలు 3 శాతం పెరిగాయి.
సెప్టెంబర్ వరకూ ఇంతే...
వరుసగా రెండో నెలలోనూ మారుతీ సుజుకీ రెండంకెల వృద్ధిని సాధించింది. ఇదే జోరు రానున్న నెలల్లో కూడా కొనసాగించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంత, డీజిల్ వాహన విక్రయాలు తగ్గాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. వాహన మార్కెట్ ఇంకా రికవరీ బాటలోనే ఉందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు.
తొలిసారిగా కార్లను కొనుగోలు చేసే వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదావేస్తూనే ఉన్నారని వివరించారు. వడ్డీరేట్లు తగ్గుతాయనే వారు వెనకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ వరకూ వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే ఉంటాయని, వర్షాలు, ఆర్థిక వ్యవస్థ కుదుటపడడం వంటి కారణాల వల్ల ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
హీరో అమ్మకాలు 5 శాతం డౌన్
వాహన పరిశ్రమ రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. వడ్డీరేట్లు తగ్గితే అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. సెంటిమెంట్లు మరింతగా మెరుగుపడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. హిందూజా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ 40 శాతం వృద్ధిని సాధించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం వల్ల తమ అమ్మకాలు 5% తగ్గాయని హీరోమోటొకార్ప్ తెలిపింది. అయినప్పటికీ నెలకు 5 లక్షల చొప్పున టూవీలర్లను విక్రయించగలుగుతున్నామని వివరించింది.
ఈ ఏడాది మంచి వృద్ధే !
కంపెనీలు కొత్త మోడళ్లను అందించనుండడం, పట్టణ ప్రాంతాల్లో సెంటిమెంట్ మెరుగుపడడం, కమోడిడీ ధరలు తక్కువగా ఉండడం, వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు, జోరుగా ఉన్న మౌలిక సదుపాయాల కల్పన కోసం జోరుగా పెరుగుతున్న పెట్టుబడులు తదితర కారణాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు సంతృప్తికరమైన వృద్ధినే సాధించగలవని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.