Rural market
-
ధరలకు రెక్కలు..
న్యూఢిల్లీ: భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో బెంబేలెత్తించింది. 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2%గా నమోదైంది. ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. ⇒ ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెలలో 10.87 శాతం పెరిగింది. ⇒ దేశ వ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6.2% ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా, పట్టణ ప్రాంతాల్లో 5.62 శాతంగా నమోదయ్యింది. ⇒1,114 పట్టణ, 1,181 గ్రామీణ మార్కెట్లలో ధరలను వారంవారీగా విశ్లేషించి జాతీయ గణాంకాల కార్యాలయం నెలవారీ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేస్తుంది. -
బలహీనంగా గ్రామీణ మార్కెట్
న్యూఢిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్ బలహీనంగా ఉందని ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో తెలిపింది. పట్టణ మార్కెట్, ప్రీమియం విభాగాలు స్థిర వృద్ధిని కొనసాగించాయని వివరించింది. పండగల జోష్‌తో మొత్తం మీద ఈ రంగం డిమాండ్‌లో కొంత మెరుగుదల నమోదైందని తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో తమ కంపెనీ సింగిల్ డిజిట్ వృద్ధి నమోదు చేసిందని మారికో వెల్లడించింది. ‘కీలక ముడి పదార్థాల ధరలు, విక్రయ ధరల్లో కొంత స్థిరత్వాన్ని చూశాం. నిర్వహణ లాభాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ వ్యాపారంలోనూ వృద్ధి సాధించాం. స్థిర వృద్ధి, లాభదాయకతను అందించాలనే ఆకాంక్షను కొనసాగిస్తున్నాం’ అని మారికో వివరించింది. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు! -
మారుతీ గ్రామీణ విక్రయాలు @ 50 లక్షలు
ముంబై: భారతీయ గ్రామీణ మార్కెట్లో 50 లక్షల వాహన అమ్మకాల మైలురాయిని అధిగమించామని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 17,00కు పైగా అవుట్లెట్లను కలిగి ఉన్నామని, దాదాపు 40% వాహనాలు ఈ ప్రాంతంలోనే అమ్ముడవుతాయని కంపెనీ పేర్కొంది. కస్టమర్లు, స్థానిక డీలర్ల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైనట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కంపెనీ వ్యాపారంలో గ్రామీణ మార్కెట్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ప్రాంత అవసరాలకు సరిపోయే నాణ్యమైన ఉత్పత్తులను, మెరుగైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. ‘‘వాహన ఎంపికలో ఇక్కడి కస్టమర్ల ఆకాంక్షలు మెట్రో నగరవాసులకు అభిరుచులకు దగ్గరగా ఉంటాయి. ప్రత్యేక శిక్షణ తీసుకున్న 12,500 మంది రెసిడెంట్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డీలర్ల సలహా, సూచనలను పరిగణలోకి తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు అనువైన మోడళ్లను రూపొందిస్తున్నాం. వాహనాల పట్ల వీరు అధిక సంరక్షణ, శ్రద్ధను కోరుకుంటారు’’ అని శ్రీవాస్తవ వివరించారు. ఈ జూన్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ మొత్తం 3,53,614 యూనిట్లను విక్రయించింది. -
గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ విక్రయాలు డౌన్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా ఉండకపోవచ్చంటూ విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రకటించింది. కరోనా రెండో దశ కారణంగా జూన్ త్రైమాసికంలో ఎన్నో సవాళ్లను చూశామని.. పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ విక్రయాలు నిదానించొచ్చని ఈ సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పట్టణ మార్కెట్లలో విక్రయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్నాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఒకే మాదిరి విక్రయాలు ఉండొచ్చని విప్రో కన్జూమర్‌కేర్ అంచనా వేసింది. పామాయిల్ ధరలు కాస్త శాంతించడంతో సంతూర్ సబ్బుల ధరలు పెరుగుతాయని భావించడం లేదని తెలిపింది. సబ్బుల తయారీలో పామాయిల్‌ను ముడిపదార్థంగా ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ ఏడాది మార్చి, జూన్‌లో రెండు పర్యాయాలు మొత్తం మీద 8 శాతం వరకు సబ్బుల ధరలను విప్రో కన్జూమర్ పెంచడం గమనార్హం. ఆన్లైన్లో ఎఫ్ఎంసీజీ విక్రయాలు జోరుగా నడుస్తుండడంతో.. ఈకామర్స్ కోసమే ఉత్పత్తులను తీసుకురానున్నట్టు విప్రో తెలిపింది. ఆన్లైన్లో పెరిగిన విక్రయాలు ఇక ముందూ కొనసాగుతాయని అంచనా వేస్తున్నట్టు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ ఈడీ వినీత్ అగర్వాల్ తెలిపారు. ‘‘గతంలో మాదిరి కాకుండా ఈ విడత గ్రామీణ ప్రాంతాలు సైతం కరోనాతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కనుక అమ్మకాల్లో వృద్ధి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒకేలా ఉండొచ్చు. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో విప్రో 17.3 శాతం వృద్ధిని నమోదు చేసింది’’ అని అగర్వాల్ వివరించారు. -
కారు.. పల్లె‘టూరు’
అమ్మకాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణచూపాడు. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా... దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పల్లెకు పోదాం.. మందగమనాన్ని తట్టుకుందాం.. అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాటపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు దాదాపు సగంగా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్ అవుట్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. అమ్మకాలు పెంచుకోవడానికి టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది. సమృద్ధిగా వర్షాలు.... గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను ఆకర్షించడానికి వాహన కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన ఎక్సే్ఛంజ్ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా కురియడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పడుతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయనే అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్ ప్రోత్సాహాన్నివ్వడం తదితర అంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు భావిస్తున్నాయి. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదే... కాగా మందగమనం కారణంగా వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పట్టాయనడం పూర్తిగా సరైనది కాదని కొందరు నిపుణలంటున్నారు. పెద్ద నగరాల్లో కాకుండా ఇతర మార్కెట్లలో భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా దీనికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనో ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలే ముందుగా మందగమన పరిస్థితులను అధిగమిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజుకుంటాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు రియల్టీ కుదేలైందని, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోనే రియల్టీకి డిమాండ్ పెరిగిందని, ఆ తర్వాత పట్టణాల్లో రియల్టీ రంగం పుంజుకుందని ఆయన ఉదహరించారు. ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంత వినియోగదారుల నుంచి ఎంౖMð్వరీలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కార్లకు సంబంధించి అధికంగా వివరాలు అడుగుతున్నారని, ఎంక్వైరీలు పెరగడం మార్కెట్ పునరుజ్జీవనం పొందుతుందనడానికి ఆరంభ సంకేతమని పేర్కొన్నారు. మొత్తం మారుతీ అమ్మకాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు 38 శాతంగా ఉంటాయి. మందగమనం కారణంగా మారుతీ సుజుకీ కంపెనీ పట్టణ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూలై కాలంలో భారీగా తగ్గగా, గ్రామీణ ప్రాంత అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గ్రామీణ మార్కెటే మెరుగు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల వ్యాపారంతో పోల్చితే గ్రామీణ వ్యాపారం ఒకింత మెరుగ్గా ఉందని హ్యుందాయ్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ కంపెనీ గ్రామీణ ప్రాంత అమ్మకాలు 5 శాతం మేర మాత్రమే తగ్గాయి. త్వరలోనే ఈ మార్కెట్లు పుంజుకుంటాయని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించగలవని ఈ కంపెనీ భావిస్తోంది. -
వాహన అమ్మకాలు అటూఇటూ!
మారుతీ, టాటా మోటార్స్ జోరు * ప్రభావం చూపుతున్న గ్రామీణ మార్కెట్ మందగమనం న్యూఢిల్లీ: వాహన విక్రయాలు మేలో మిశ్రమంగా నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ మినహా మిగిలిన కంపెనీల వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు మాత్రం దేశీయ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. హ్యుందాయ్, హోండాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ ఇండియా, టయోటా కంపెనీల అమ్మకాలు తగ్గాయి. ఇక టూ వీలర్ల విషయానికొస్తే హీరోమోటొకార్ప్ అమ్మకాలు 5 శాతం తగ్గగా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అమ్మకాలు 3 శాతం పెరిగాయి. సెప్టెంబర్ వరకూ ఇంతే... వరుసగా రెండో నెలలోనూ మారుతీ సుజుకీ రెండంకెల వృద్ధిని సాధించింది. ఇదే జోరు రానున్న నెలల్లో కూడా కొనసాగించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంత, డీజిల్ వాహన విక్రయాలు తగ్గాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. వాహన మార్కెట్ ఇంకా రికవరీ బాటలోనే ఉందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. తొలిసారిగా కార్లను కొనుగోలు చేసే వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదావేస్తూనే ఉన్నారని వివరించారు. వడ్డీరేట్లు తగ్గుతాయనే వారు వెనకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ వరకూ వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే ఉంటాయని, వర్షాలు, ఆర్థిక వ్యవస్థ కుదుటపడడం వంటి కారణాల వల్ల ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. హీరో అమ్మకాలు 5 శాతం డౌన్ వాహన పరిశ్రమ రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. వడ్డీరేట్లు తగ్గితే అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. సెంటిమెంట్లు మరింతగా మెరుగుపడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. హిందూజా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ 40 శాతం వృద్ధిని సాధించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం వల్ల తమ అమ్మకాలు 5% తగ్గాయని హీరోమోటొకార్ప్ తెలిపింది. అయినప్పటికీ నెలకు 5 లక్షల చొప్పున టూవీలర్లను విక్రయించగలుగుతున్నామని వివరించింది. ఈ ఏడాది మంచి వృద్ధే ! కంపెనీలు కొత్త మోడళ్లను అందించనుండడం, పట్టణ ప్రాంతాల్లో సెంటిమెంట్ మెరుగుపడడం, కమోడిడీ ధరలు తక్కువగా ఉండడం, వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు, జోరుగా ఉన్న మౌలిక సదుపాయాల కల్పన కోసం జోరుగా పెరుగుతున్న పెట్టుబడులు తదితర కారణాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు సంతృప్తికరమైన వృద్ధినే సాధించగలవని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.