ముంబై: భారతీయ గ్రామీణ మార్కెట్లో 50 లక్షల వాహన అమ్మకాల మైలురాయిని అధిగమించామని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 17,00కు పైగా అవుట్‌లెట్లను కలిగి ఉన్నామని, దాదాపు 40% వాహనాలు ఈ ప్రాంతంలోనే అమ్ముడవుతాయని కంపెనీ పేర్కొంది. కస్టమర్లు, స్థానిక డీలర్ల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైనట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కంపెనీ వ్యాపారంలో గ్రామీణ మార్కెట్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
ఈ ప్రాంత అవసరాలకు సరిపోయే నాణ్యమైన ఉత్పత్తులను, మెరుగైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. ‘‘వాహన ఎంపికలో ఇక్కడి కస్టమర్ల ఆకాంక్షలు మెట్రో నగరవాసులకు అభిరుచులకు దగ్గరగా ఉంటాయి. ప్రత్యేక శిక్షణ తీసుకున్న 12,500 మంది రెసిడెంట్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డీలర్ల సలహా, సూచనలను పరిగణలోకి తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు అనువైన మోడళ్లను రూపొందిస్తున్నాం. వాహనాల పట్ల వీరు అధిక సంరక్షణ, శ్రద్ధను కోరుకుంటారు’’ అని శ్రీవాస్తవ వివరించారు. ఈ జూన్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ మొత్తం 3,53,614 యూనిట్లను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment