కారు.. పల్లె‘టూరు’ | India automobile industry sees rural areas | Sakshi
Sakshi News home page

కారు.. పల్లె‘టూరు’

Published Fri, Sep 13 2019 5:24 AM | Last Updated on Fri, Sep 13 2019 5:41 AM

India automobile industry sees rural areas - Sakshi

అమ్మకాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణచూపాడు. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా... దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్‌ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పల్లెకు పోదాం.. మందగమనాన్ని తట్టుకుందాం.. అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాటపై సాక్షి బిజినెస్‌ స్పెషల్‌ స్టోరీ...

వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్‌ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు దాదాపు సగంగా ఉండే మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్‌ అవుట్‌లెట్‌లను అందుబాటులోకి తెచ్చింది. అమ్మకాలు పెంచుకోవడానికి టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది.  

సమృద్ధిగా వర్షాలు....
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను ఆకర్షించడానికి వాహన కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన ఎక్సే్ఛంజ్‌ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్‌ స్కీమ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా కురియడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో  వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌ బాట పడుతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయనే అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్‌ ప్రోత్సాహాన్నివ్వడం తదితర అంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్‌ పెరగగలదని కంపెనీలు భావిస్తున్నాయి.  

భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదే...
కాగా మందగమనం కారణంగా వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌ బాట పట్టాయనడం పూర్తిగా సరైనది కాదని కొందరు నిపుణలంటున్నారు. పెద్ద నగరాల్లో కాకుండా ఇతర మార్కెట్లలో భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా దీనికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనో ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ అంటున్నారు.  గ్రామీణ ప్రాంతాలే ముందుగా మందగమన పరిస్థితులను అధిగమిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజుకుంటాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు రియల్టీ కుదేలైందని, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోనే రియల్టీకి డిమాండ్‌ పెరిగిందని, ఆ తర్వాత పట్టణాల్లో రియల్టీ రంగం పుంజుకుందని ఆయన ఉదహరించారు.  

ఎంక్వైరీలు పెరుగుతున్నాయి.  
ఇప్పటికే గ్రామీణ ప్రాంత వినియోగదారుల నుంచి ఎంౖMð్వరీలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఈడీ (మార్కెటింగ్,  సేల్స్‌) శశాంక్‌ శ్రీవాత్సవ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌ కార్లకు సంబంధించి అధికంగా వివరాలు అడుగుతున్నారని, ఎంక్వైరీలు పెరగడం మార్కెట్‌ పునరుజ్జీవనం పొందుతుందనడానికి ఆరంభ సంకేతమని పేర్కొన్నారు. మొత్తం మారుతీ అమ్మకాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు 38 శాతంగా ఉంటాయి. మందగమనం కారణంగా మారుతీ సుజుకీ కంపెనీ పట్టణ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్‌–జూలై కాలంలో భారీగా తగ్గగా,  గ్రామీణ ప్రాంత అమ్మకాలు 16 శాతం తగ్గాయి.


గ్రామీణ మార్కెటే మెరుగు
మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల వ్యాపారంతో పోల్చితే గ్రామీణ  వ్యాపారం ఒకింత మెరుగ్గా ఉందని హ్యుందాయ్‌ సేల్స్‌ హెడ్‌ వికాస్‌ జైన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ కంపెనీ గ్రామీణ ప్రాంత అమ్మకాలు 5 శాతం మేర మాత్రమే తగ్గాయి. త్వరలోనే ఈ మార్కెట్లు పుంజుకుంటాయని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించగలవని ఈ కంపెనీ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement