
ముంబై: సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో వృద్ధి బాటపట్టాయి. మూడో దశ లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ప్యాసింజర్ వాహన విక్రయాలకు కలిసొచ్చింది. గత నెలలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ విక్రయాలు పెరిగాయి. అయితే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టయోటా, హోండా కార్ల అమ్మకాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. మరోవైపు ద్విచక్ర వాహనాలు విక్రయాలు డీలాపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీంతో సంపద్రాయ టూ వీలర్స్ అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు వరుసగా 29% 6%, 15% చొప్పున క్షీణించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. బేస్ ఎఫెక్ట్ కారణంగా ట్రాకర్ల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ‘‘దేశంలో గత మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత లీటరు ఇంధన ధరలు రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం మార్చి వాహన విక్రయాలపై ప్రతికూలతను చూపొచ్చు’’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment