
గతేడాది అక్టోబర్‌లో మెట్రో–3 మొదటి దశ మార్గం ప్రారంభం
మొదట్లో అపూర్వ స్పందన..అనంతరం క్రమంగా తగ్గుదల
ప్రస్తుతం ప్రయాణికులు, ఆదాయం లేక ఆందోళన
కారణాల అన్వేషణలో ఎంఎంఆర్‌వీసీ
దాదర్: ముంబైలోని పశ్చిమ ఉప నగరాలతో ఉత్తర–దక్షిణ ప్రాంతాలను కలిపే మెట్రో–3 భూగర్భ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. ప్రయాణికులు రాక ఆదాయం లేకపోవడంతో మంబై మెట్రో రైలు వికాస్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌వీసీ) అందోళనలో పడింది. మెట్రో– 3 మార్గానికి ప్రారంభంలో ప్రయాణికులు నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. అయితే క్రమ క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారుల దృష్టికి వచి్చంది. మెట్రో అధికారులు ఈ పరిస్థితికి కారణాలను అన్వేషిస్తున్నారు.
రెండు, మూడు దశలు పూర్తైతే!
రాష్ట్రంలోనే అత్యధిక పొడవైన భూగర్భ మెట్రో రైలు మార్గమైన మెట్రో–3 ప్రాజెక్టు మొదటి దశ మార్గాన్ని గతేడాది అక్టోబరులో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మెట్రోరైళ్లు రోజుకు 162 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రారంభం నుంచి నవంబరు ఆరో తేదీ దాకా ఈ మార్గం మీదుగా ఏకంగా 6.33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక రెండో నెల గడిచిన తరువాత ఈ సంఖ్య 5.64 లక్షలకు పడిపోయింది. దీన్ని బట్టి మొదటి రెండు నెలల్లో మొత్తం 11.97 లక్షలమంది ఈ రైళ్లలో రాకపోకలు సాగించారు. రోజువారీగా చూస్తే మొదటినెలలో రోజుకు సగటున 20, 426 మంది ప్రయాణికులు, ఆ తరువాతి నెలలో రోజుకు 18,810 మంది మాత్రమే రాకపోకలు సాగించారు. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ సంఖ్య మరింత తగ్గడం మొదలైంది. రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుండటంతో ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో మొదట్లో ఎంతో ఆసక్తి కనబర్చిన ప్రయాణికులు ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారో అర్ధం కావడం లేదని అధికారులు అంటున్నారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులకు బయట బెస్ట్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు సరిగా అందుబాటులో ఉండడం లేదని ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదలకు ఇది కూడా ఒక కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. రెండో, మూడో దశ రైలు మార్గం పనులు పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు.
మేలోగా మూడు దశల ముగింపు!
రూ.37,275 కోట్ల వ్యయంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మెట్రో–3 భూగర్భ రైలు మార్గం నిర్మాణాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా జేవీఎల్‌ఆర్ నుంచి బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ) వరకు రూ.14,200 కోట్లతో నిర్మించిన మొదటి దశ భూగర్భ రైలు మార్గాన్ని గతేడాది అక్టోబరు ఏడున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 12.69 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో పది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ మార్గాన్ని మార్చి చివరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆఖరుదైన మూడో దశ మార్గాన్ని మే నెలాఖరులోగా పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని ఎంఎంఆర్‌వీసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు దగ్గరపడుతుండటంతో వందలాది అధికారులు, ఇంజనీర్లు, కారి్మకులు, కూలీలు రోజుకు మూడు షిప్టుల్లో విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment