నిరాశపరిచిన పండుగ సీజన్
తగ్గిన మారుతీ సుజుకీ, హ్యుందాయ్ విక్రయాలు
ఎంఅండ్‌ఎం, ఎంజీ మోటార్స్, టయోటా అమ్మకాల్లో వృద్ధి
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి.
చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్‌లో తమ ఎస్‌యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్‌యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం విశేషమన్నారు.
మహీంద్రాఅండ్‌మహీంద్రా ఎస్‌యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్‌లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి.
ఆల్‌టైం గరిష్టానికి మారుతీ సేల్స్...
మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment