
ఏప్రిల్‌లో పెరిగిన మారుతీ, ఎంఅండ్‌ఎం సేల్స్
హ్యుందాయ్, టాటా మోటార్స్ అమ్మకాలు డీలా
ముంబై: మార్కెట్లో నెలకొన్న పలు ప్రతికూల సవాళ్ల మధ్య మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) కంపెనీల వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో పెరిగాయి. అయితే టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు తగ్గాయి. ఆసక్తికరంగా, గత నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్ రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా, ధీర్ఘకాలం పాటు ద్వితీయ స్థానంలో కొనసాగిన హ్యుందాయ్ మోటార్స్ నాలుగో స్థానానికి దిగివచ్చింది.
⇒ మారుతీ సుజుకీ దేశీయంగా ఏప్రిల్ నెలలో 1,38,074 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్‌లో అమ్ముడైన 1,37,952 వాహనాలతో పోలిస్తే 1% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 11,519 నుంచి 6,332 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 56,953 నుంచి 61,591 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఏప్రిల్‌లో కంపెనీ 1,79,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది.

⇒ మహీంద్రా అండ్ మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాలు 28% వృద్ధి చెంది 41,000 యూనిట్ల నుంచి 52,330 యూనిట్లకు వచ్చి చేరాయి. మా పోర్ట్‌ఫోలియో బలాన్ని, కస్టమర్ల ప్రతిపాదనలను అమ్మకాల సంఖ్య తెలియజేస్తుందని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు.
⇒ టాటా మోటార్స్ దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు(ఈవీలను కలుపుకొని) క్రితం ఏడాది ఇదే ఏప్రిల్‌తో పోలిస్తే 47,883 యూనిట్ల నుంచి 45,199 యూనిట్లకు దిగివచ్చాయి.
⇒ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 12% క్షీణించి 44,374 యూనిట్లకు వచ్చి చేరాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 50,021 గా ఉన్నాయి.