లిస్టులో మారుతీ, హ్యుందాయ్, టాటా మోటర్స్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి.
2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్‌గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు.
మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, బయో–సీఎన్‌జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు ..
2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది.
10 ఈవీలపై టాటా దృష్టి..
2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment