
ఫెడరల్ బ్యాంక్ లాభం ప్లస్
బంధన్ బ్యాంక్ లాభం దూకుడు
ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం పుంజుకుని రూ. 1,091 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 2,377 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 33 శాతం జంప్‌చేసి రూ. 1,006 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 3.21 శాతం నుంచి 3.12 శాతానికి స్వల్పంగా నీరసించాయి.
తాజా స్లిప్పేజీలు రూ. 352 కోట్ల నుంచి రూ. 483 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 1.94 శాతం నుంచి 1.84 శాతానికి దిగిరాగా.. కనీస మూలధన నిష్పత్తి 16 శాతానికి చేరింది. కాగా.. క్యూ4లో స్టాండెలోన్ నికర లాభం రూ. 906 కోట్ల నుంచి రూ. 1,030 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్‌ఈలో 3.3 శాతం పతనమై రూ. 197 వద్ద ముగిసింది.
మరో ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 6 రెట్లు దూసుకెళ్లి రూ. 318 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 55 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,890 కోట్ల నుంచి రూ. 6,133 కోట్లకు ఎగసింది.
కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 2,745 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 21,041 కోట్ల నుంచి రూ. 24,915 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్‌ఈలో 1.3% నీరసించి రూ. 166 వద్ద ముగిసింది.