October sales
-
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్‌మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్‌టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
హావెల్స్ రికార్డ్- అశోక్ లేలాండ్ అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ హావెల్స్ ఇండియా కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ అక్టోబర్ నెలలో అమ్మకాలు జోరందుకోవడంతో ఆటో రంగ కంపెనీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హావెల్స్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో హావెల్స్ ఇండియా నికర లాభం 80 శాతం జంప్‌చేసి రూ. 325 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ. 2,452 కోట్లకు చేరింది. ఇబిటా 79 శాతం ఎగసి రూ. 421 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 6.7 శాతం బలపడి 17.2 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 816 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 827 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడింది. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 51,000 కోట్లను అధిగమించింది. అశోక్ లేలాండ్ ఈ అక్టోబర్ నెలలో అశోక్ లేలాండ్ 1 శాతం అధికంగా 9,989 వాహనాలను విక్రయించింది. ఇందుకు ఎల్‌సీవీలు, ట్రక్కుల విక్రయాలలో 14 శాతం నమోదైన వృద్ధి సహకరించింది. అయితే మధ్య, భారీస్థాయి వాహన విక్రయాలు 11 శాతం క్షీణించాయి. అయితే నెలవారీగా చూస్తే మొత్తం అమ్మకాల పరిమాణం 20 శాతం వృద్ధి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎల్‌సీవీలు, వాణిజ్య వాహనాలకు దేశీయంగా డిమాండ్ పెరుగుతున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో కంపెనీ 8,344 యూనిటన్లు విక్రయించింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం బలపడి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 87.5కు చేరువైంది. గత మూడు నెలల్లో ఈ షేరు 72 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
సగం అమ్మకాలు 4జీ ఫోన్లవే
అక్టోబర్ అమ్మకాలపై ఐడీసీ వెల్లడి న్యూఢిల్లీ: 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరుగా ఉన్నాయి. అక్టోబర్‌లో మొత్తం 93 లక్షల స్మార్ట్ఫోన్లు అమ్ముడవగా, వీటిల్లో సగానికి పైగా 4జీ ఆధారిత మొబైల్ ఫోన్లేనని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. ఐడీసీ వివరాల ప్రకారం.., * ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొత్తం కోటికి పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. * భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా ఆన్లైన్లో మొబైల్ ఫోన్ల విక్రయాలు 12% పెరి గాయి. దీంతో సెప్టెంబర్‌లో 34 శాతంగా ఉన్న మొబైల్ ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ అమ్మకాలు అక్టోబర్‌లో 41%కి పెరిగాయి. * 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు అక్టోబర్‌లో 26% పెరిగాయి. పలు కంపెనీలు 3జీ స్మార్ట్ఫోన్ల స్థానంలో 4జీ స్మార్ట్ఫోన్లను తెస్తుండటం దీనికి ప్రధాన కారణం. నవంబర్‌లో కూడా ఇదే స్థాయి అమ్మకాలు జరగవచ్చు. * శామ్సంగ్, లెనొవొ కంపెనీల అమ్మకాలు బాగా పెరిగాయి.