కార్ల ధరలు దిగొచ్చాయ్..
న్యూఢిల్లీ: అమ్మకాల క్షీణతతో అతలాకుతలమవుతున్న వాహన రంగానికి ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఊపిరినిచ్చింది. వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తీసుకున్న నిర్ణయం కారణంగా పలు వాహన కంపెనీలు ధరలను తగ్గించాయి. ఈ ధరల తగ్గింపు కారణంగా అమ్మకాలు పెరుగుతాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్, ఫియట్, హోండా, నిస్సాన్‌లు బుధవారం రేట్ల కోతను ప్రకటించాయి. లగ్జరీ కార్ల దిగ్గజాలు ఆడి, మెర్సిడెస్‌లతో పాటు టూవీలర్ కంపెనీలు.. హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ కూడా ఇప్పటికే ధరలను తగ్గించాయి.
సుంకం తగ్గింపు పూర్తి ప్రయోజనం కస్టమర్లకే...
ఎక్సైజ్ సుంకం తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకే అందజేస్తామని, ఆ మేరకు ధరలను తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు తెలిపాయి. కార్ల ధరలను మారుతీ సుజుకీ రూ.8,501 నుంచి రూ.30,984 రేంజ్‌లో, హ్యుందాయ్ కంపెనీ రూ.10,000 నుంచి రూ.1,35,300 రేం జ్‌లో తగ్గించాయి. మహీంద్రా రూ.13,000 నుంచి రూ.49,000 వరకూ, ఫియట్ రూ.8,000-12,000 వరకూ ధరలను తగ్గిం చాయి. మహీంద్రా కంపెనీ ప్రీమియం ఎస్‌యూవీ రెక్స్‌టన్ ధరలను రూ.92,000 వరకూ తగ్గించింది.
ఫోక్స్‌వ్యాగన్, హోండా కూడా...
మారుతీ సుజుకి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో హ్యాచ్‌బాక్‌ను రూ.8,502 తగ్గించింది. ఇది కనిష్ట తగ్గింపు, ఇక గరిష్టంగా ఎస్‌ఎక్స్4 సెడాన్ ధరను రూ. 30,984కు తగ్గించింది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన సెలెరియో ధరను కూడా కంపెనీ రూ.13,615 వరకూ తగ్గించింది. స్విఫ్ట్ ధరలను రూ.15,874, ఎర్టిగ ధరను రూ.18,747 తగ్గించింది. హోండా కార్స్ ఇండియా కంపెనీ ధరలను రూ.44,741 వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోక్స్‌వ్యాగన్ వాహన ధరలు రూ.14,500 నుంచి రూ.51,000 వరకూ తగ్గాయి.
నిస్సాన్ తగ్గింపు 6 శాతం...: నిస్సాన్ కంపెనీ కార్ల ధరలను
4-6 శాతం వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. మైక్రా యాక్టివ్, మైక్రా, సన్నీ, ఇవిల, టెర్రానో, టియనా కార్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. దేశీయ వాహన పరిశ్రమకు పునరుత్తేజాన్నిచ్చే దిశగా ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఆహ్వానించదగ్గ చర్య అని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ కెనిచిరో యోముర చెప్పారు. ఈ కార్ల తగ్గింపు కారణంగా తమ అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కంపెనీ రూ.3.5 లక్షల నుంచి రూ.25.47 లక్షల రేంజ్‌లో ఉన్న కార్లను విక్రయిస్తోంది. కాగా, టూవీలర్ల దిగ్గజాలు హీరో మోటోకార్ప్5 శాతం(రూ.4,500 )వరకూ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ కంపెనీ రూ.1,600 నుంచి రూ.7,600 వరకూ ధరలను తగ్గించిన విషయం విదితమే.
అధిక వడ్డీరేట్లు, అంతకంతకూ పెరుగుతున్న ఇంధనం ధరలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం తదితర కారణాల వల్ల గత ఏడాది కార్ల విక్రయాలు 11 ఏళ్ల కనిష్టానికి క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం తగ్గింపు మంచి ఉపశమన చర్య అని వాహన కంపెనీలు హర్షం ప్రకటించాయి. ఎక్సైజ్ సుంకాన్ని ... చిన్న కార్లు, స్కూటర్లు, మోటార్ బైక్‌లు, వాణిజ్య వాహనాలపై 12% నుంచి 8%కి; ఎస్‌యూవీలపై 30% నుంచి 24%కి, మిడ్ సైజ్ కార్లపై 24 శాతం నుంచి 20%కి, పెద్ద కార్లపై 27 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం తెలిసిందే.
ధరలు ఇలా తగ్గాయ్...
కంపెనీ తగ్గింపు (రూ.లలో)
మారుతీ సుజుకి 8,502-30,984
హ్యుందాయ్ 10,000-1,35,300
ఫోక్స్‌వ్యాగన్ 14,500-51,000
మహీంద్రా 13,000-49,000
ఫియట్ 8,000-12,000
హోండా కార్స్ 44,751 వరకూ
నిస్సాన్ 4-6 శాతం
ఆడి 3.82లక్షల వరకూ
మెర్సిడెస్ బెంజ్ 2 లక్షల వరకూ
హీరో మోటోకార్ప్ 4,500 వరకూ
హోండా మోటార్‌సైకిల్ 1,600-7,600