న్యూఢిల్లీ: అంతంత మాత్రం అమ్మకాలతో అతలాకుతలం అవుతున్న వాహన పరిశ్రమకు జూన్‌లో ఊరట లభించింది. ఈ జూన్‌లో కార్లు, ఇతర వాహనాల అమ్మకాలు పుంజుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు జూన్30తో ముగుస్తుందని, ఆ తర్వాత వాహనాల ధరలు పెరుగుతాయనే అంచనాలతో అమ్మకాలు పెరిగాయని నిపుణులంటున్నారు. ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పలువురు వాహన కొనుగోళ్లను వాయిదా వేశారని, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం కూడా అమ్మకాల వృద్ధికి కారణమని వారంటున్నారు.
గత రెండేళ్లుగా అమ్మకాల్లేక పెరిగిపోయిన నిల్వలను తగ్గించుకోవడానికి కార్ల కంపెనీలు భారీగానే డిస్కౌంట్‌లను, వివిధ ఆఫర్లను ఇస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించాలని కేంద్రం నిర్ణయించడంతో అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం రాయితీ కొనసాగింపు కొనుగోలుదారుల సెంటిమెంట్స్‌ను మెరుగుపరచిందని, రానున్నది పండుగల సీజన్ అని అమ్మకాలకు ఢోకా లేదని ఈ కంపెనీలు ధీమాగా ఉన్నాయి.
మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ కంపెనీలు అమ్మ కాలు వృద్ధి బాటన దూసుకుపోయాయి. జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్ కంపెనీల అమ్మకాలు మాత్రం తగ్గాయి. మారుతీ సుజుకికి చెందిన ఎం800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్‌ఆర్‌లతో కూడిన మినీ సెగ్మెంట్ అమ్మకాలు 52% పెరిగాయి. ఎక్సెంట్, గ్రాండ్, శాంటాఫే కార్ల కారణంగా అమ్మకాల్లో 10 శాతం వృద్ధి సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు.
పుంజుకున్న వాహన విక్రయాలు
Published Wed, Jul 2 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement