వాహన అమ్మకాలు ఓకే..
* జూలైలో మారుతీ, హ్యుందాయ్, హోండా, టయోటా దేశీ విక్రయాలు అప్
* వరుసగా మూడో నెలలోనూ పెరిగిన దేశీ సేల్స్...
* పరిశ్రమ పుంజుకుంటున్న సంకేతాలు... పండుగల సీజన్‌పై కంపెనీల ఆశలు
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది జూలైలో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల దేశీయ అమ్మకాలు పెరిగాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా కంపెనీల సేల్స్ పుంజుకున్నాయి. కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు పెరగడం వరుసగా ఇది మూడో నెల. దీర్ఘకాలంగా మందగమనంలో ఉన్న వాహన మార్కెట్ పుంజుకుంటోందన్నడానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ అమ్మకాలకు సంబంధించి మారుతీ 20 శాతం, హ్యుందాయ్ 13 శాతం, హోండా కార్స్ ఇండియా 40 శాతం, టయోటా 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. మొత్తం అమ్మకాలు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) మాత్రం మిశ్రమంగా ఉన్నాయి.
సెంటిమెంట్ మెరుగు
ఆర్థిక వృద్ధి మందకొడిగా ఉండటంతో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వాహన విక్రయాలు బాగా తగ్గాయి. ఈ రంగానికి ఊపునివ్వడానికి గత ప్రభుత్వం ఫిబ్రవరిలో తన మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ సుంకాల తగ్గింపును కొత్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ వరకూ పొడిగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, డిమాండ్ పుంజుకుంటోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
ముందుంది మంచి కాలం: వర్షాలు ఓ మోస్తరుగా ఉండడం, స్థూల ఆర్థిక అంశాలు నిలకడగా ఉండడం వంటి కారణాల వల్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. కొత్త కొత్త మోడళ్లను అందించడం వల్ల డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. వినియోగదారుల సెంటిమెంట్ గత కొన్ని నెలలుగా క్రమక్రమంగా పుంజుకుంటోందనడానికి చాలా సూచనలున్నాయని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా చెప్పారు.
స్టాక్ మార్కెట్లు పెరగడం, తయారీ రంగం పుంజుకోవడం వంటి అంశాలు వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడటానికి దోహద పడ్డాయని వివరించారు.సెంటిమెంట్ కొద్దిగా మెరుగుపడినప్పటికీ, అధికంగా ఉన్న వడ్డీరేట్లు, ఇంధనం రేట్లు వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపాయని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తుండడం, పండుగల సీజన్ సమీపిస్తుండటంతో రానున్న నెలల్లో వినియోగదారుల సెంటిమెంట్ మరింతగా మెరుగుపడవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. కాగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నందున రానున్న నెలల్లో అమ్మకాలు పుంజుకోగలవని కొన్ని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి.