
వాహన విక్రయాలు ఈ ఏడాది జూలైలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీల విక్రయాలు స్వల్పంగానే పెరిగాయి. గత ఏడాది జూలైలో హై బేస్ (అమ్మకాలు అధికంగా ఉండటం) కారణంగా ఈ ఏడాది జూలైలో పలు కంపెనీల వాహన విక్రయాలు అంతంతమాత్రం వృద్ధినే నమోదు చేశాయని నిపుణులంటున్నారు. గత నెలలో ట్రాన్స్‌పోర్టర్ల సమ్మె కారణంగా ఫోర్డ్, మహీంద్రా కంపెనీల ప్రయాణీకుల వాహనాలు తగ్గాయి. కొత్త అమేజ్ మోడల్ కారణంగా హోండా కార్స్ అమ్మకాలు పుంజుకున్నాయి. వాహన దారుల సమ్మె, రిటైల్ అమ్మకాలు మందగించడం వంటి సమస్యలున్నప్పటికీ, వాణిజ్య వాహనాలకు డిమాండ్ కొనసాగుతోందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వధేరా చెప్పారు. పండుగల సీజన్‌లోకి ప్రవేశించామని, కొనుగోలు సెంటిమెంట్ మరింతగా పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మహీంద్రా మారజో వాహనాన్ని వచ్చే నెలలో మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. వివరాలు....
మారుతీ కార్ల ధరలు పెంపు...
మారుతీ సుజుకీ కంపెనీ తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. కమోడిటీల ధరలు పెరగడం, కరెన్సీ ఒడిదుడుకులు, ఇంధనాల ధరలు పెరుగుతుండటం రవాణా వ్యయాలు కూడా పెరుగుతున్నాయని, దీంతో ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. ఏ మోడళ్ల ధరలను ఎంత మేర పెంచాలనే విషయమై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇవే కారణాలతో ధరలు పెంచనున్నామని టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కూడా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment