ధరల తగ్గింపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ కోత తగ్గింపు కారణంగా పలు వాహన కంపెనీల ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, వీఈ కమర్షియల్ వెహికల్స్, యమహా, టీవీఎస్‌లు చేరాయి.
టాటా తగ్గింపు లక్షన్నర వరకూ
టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను రూ. 1.5 లక్ష వరకూ తగ్గించింది. తమ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.6,300-రూ.69,000 వరకూ తగ్గించామని, అలాగే వాణిజ్య వాహనాల ధరలను రూ.15,000-రూ.1,50,000 వరకూ తగ్గించామని కంపెనీ పేర్కొంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులందించడానికి ఈ ధరలు తగ్గించామని వివరించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఫోర్డ్ కోత రూ.1.07 లక్షల వరకూ
తమ వాహనాలపై రూ. 23,399 నుంచి రూ.1.07 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నామని ఫోర్డ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఫోర్ట్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్‌లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించింది.
వీఈ కమర్షియల్..: ఐషర్ ట్రక్కులు, బస్సులపై ధరలను తగ్గిస్తున్నామని వీఈ కమర్షియల్ వెహికల్స్ పేర్కొంది. 4 శాతం ఎక్సైజ్ సుంకం పూర్తి తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తామని, ఈ తగ్గింపు ఈ నెల 18 (మంగళవారం) నుంచే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది.
యమహా ఇండియా...
కంపెనీ టూవీలర్స్ ధరలను రూ.1, 033 నుంచి రూ. 3,066 వరకూ తగ్గించింది. ఎక్సైజ్ సుంకం పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ శుక్రవారం తెలిపారు. ఈ కంపెనీ ఆల్ఫా, రే జడ్, రే స్కూటర్లను, వైబీఆర్ 110, ఎఫ్‌జడ్16, వైజడ్‌ఎఫ్ ఆర్15 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది.
టీవీఎస్ తగ్గింపు రూ.3,500 వరకూ
ఎక్సైజ్ సుంకం తగ్గింపును పూర్తిగా వినియోగదారులకే అందిస్తున్నామని, తమ టూవీలర్లు, త్రీ వీలర్ల ధరలను రూ.850 నుంచి రూ.3,500 వరకూ తగ్గిస్తున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) జె. శ్రీనివాసన్ తెలిపారు. డీలర్ల దగ్గర ప్రస్తుతమున్న స్టాక్‌లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించారు. ఈ కంపెనీ స్టార్ సిటీ, అపాచీ ఆర్‌టీఆర్ బైక్‌లతో పాటు జూపిటర్, వెగో స్కూటర్లను విక్రయిస్తోంది.
కాగా మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, ఫియట్, మెర్సిడెస్, ఆడి, హీరో, హోండా మోటార్ సైకిల్ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయి.