Honda Cars India
-
90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. 'ఫ్యూయల్ పంప్లో సమస్య' కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది.2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 - అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది.హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్‌లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు 'వీఐఎన్'ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
హోండా ఎలివేట్ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ ప్రవేశపెట్టింది. ఎలివేట్‌కు భారత్ తొలి మార్కెట్ కాగా, ఈ మోడల్ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్‌యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్‌తో 6–స్పీడ్ మాన్యువల్, 7–స్పీడ్ సీవీటీ ట్రిమ్స్‌లో 1.5 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. లీటరుకు మైలేజీ మాన్యువల్ ట్రిమ్ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, లేన్ వాచ్ కెమెరా, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్డీ ఫుల్ కలర్ టీఎఫ్టీ మీటర్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో, డ్రైవ్ వ్యూ రికార్డింగ్ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు పోటీనిస్తుంది. అయిదు ఎస్‌యూవీలు: భారత్‌లో 2030 నాటికి అయిదు ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్‌ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్‌లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. -
హోండా కార్లు కొనేవారికి చేదువార్త! ఆ మోడళ్ల ధరల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సిటీ, అమేజ్ మోడళ్ల ధరలను జూన్ నుంచి ఒక శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన వ్యయ ఒత్తిళ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బుధవారం (మే24) ప్రకటించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో అమేజ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల వరకు ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్స్‌తో సహా సిటీ మోడల్ శ్రేణి రూ.11.55 లక్షలు మొదలుకుని రూ.20.39 లక్షల వరకు ఉంది. మరోవైపు హోండా ఇండియా కార్స్ తన తాజా ఎస్యూవీ లాంచింగ్ తేదీని ధ్రువీకరించింది. జూన్ 6న హోండా ఎలివేట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన టీజీర్ చిత్రాన్ని హోండా ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఇదీ చదవండి: e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు.. -
హోండా నుంచి ఏటా కొత్త కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్ లేదా వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో కంపెనీ వాటాను పెంచుకోవడం లక్ష్యంగా వచ్చే 3–5 ఏళ్లపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. హోండా వాటా ప్రస్తుతం 2.5 శాతం మాత్రమే. 2023 సెప్టెంబర్‌లోగా ఒక ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఒకటి రానుందని చెప్పారు. అలాగే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని వెల్లడించారు. 2022–23లో 8 శాతం వృద్ధితో దేశీయంగా 92,000 యూనిట్ల అమ్మకాలను కంపెనీ ఆశిస్తోంది. అలాగే 25 శాతం వృద్ధితో ఎగుమతులు 23,000 యూనిట్లు నమోదు కానున్నాయి. రాజస్థాన్‌లోని ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 1.8 లక్షల యూనిట్లు. -
హోండా కార్స్ నుంచి న్యూ సిటీ
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా తాజాగా న్యూ సిటీ (పెట్రోల్), న్యూ సిటీ ఈ:హెచ్ఈవీ పేరిట రెండు కొత్త మోడల్స్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. భద్రత, కనెక్టివిటీ, సౌకర్యాలకు సంబంధించి వీటిలో అదనపు ఫీచర్స్‌ను జోడించినట్లు కంపెనీ తెలిపింది. న్యూ సిటీ (ఐ–వీటెక్) ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 14.72 లక్షల వరకూ ఉంటుంది. న్యూ సిటీ (ఈ–హెచ్ఈవీ) ధర రూ. 18.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షల వరకూ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 17.8 నుంచి 18.4 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తాయి. న్యూ సిటీలో అధునాతన 20.3 సెం.మీ. టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఆడియో, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, అలాగే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హోండా లేన్ వాచ్, యాంటీ థెఫ్ట్ అలారం తదితర ఫీచర్లు ఉంటాయి. రెండు మోడల్స్‌లోనూ 3 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. కావాలంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వర కూ అదనంగా వారంటీ తీసుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వారంటీ 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ.గా (ఏది ముందైతే అది) ఉంటుంది. -
ఏటా ఒక కొత్త హోండా కారు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా భారత మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించి ఏటా ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. పెట్రోల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్‌లో రూ.10 లక్షలు, ఆపై ధరలో వీటిని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుమురా తెలిపారు. ‘ప్యాసింజర్ వాహన రంగంలో 40 శాతం వాటా రూ.10 లక్షల పైచిలుకు మోడళ్లదే. ఈ విభాగం వాటా మరింత పెరగనుంది. అమేజ్, సిటీ మోడళ్ల టాప్ ట్రిమ్స్ 60 శాతం పైగా వాటా కైవసం చేసుకున్నాయి. విదేశాల్లో విక్రయిస్తున్న మోడళ్లను సైతం ఇక్కడ ప్రవేశపెడతాం. రూ.260 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా సేల్స్ నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తున్నాం’ అని వివరించారు. వృద్ధిపై దృష్టిపెట్టాం.. : అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత మోడళ్లపై ఫోకస్ చేయాలని నిర్ణయించామని సుమురా చెప్పారు. ‘ఈ ప్రణాళికలో భారత్ కూడా ఉంది. అయితే మౌలిక వసతులనుబట్టి ఒక్కో మార్కెట్ ఒక్కోలా ఉంటుంది. అంతర్జాతీయ పోకడలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లో డీజిల్ మోడళ్లను నిలివేశాం. చిప్ కొరత ప్రభావం ఇప్పటికీ కంపెనీపై ఉంది. రాజస్థాన్ ప్లాంటులో ఏటా 1.3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. కొత్త మోడళ్ల రాకతో ప్లాంటు వినియోగం పెరుగుతుంది. ప్లాంటు పూర్తి సామర్థ్యం ఏటా 1.8 లక్షల యూనిట్లు. దీనిని 2.2 లక్షల యూనిట్లకు విస్తరించవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలతో రెండేళ్లుగా భారత్‌లో లాభాలు గడిస్తున్నాం. ఈ ఏడాది రానున్న ఎస్‌యూవీతో అమ్మకాలు అధికం అవుతాయి’ అని తెలిపారు. కొత్త వెర్షన్స్‌లో సిటీ.. సిటీ కొత్త వెర్షన్స్‌ను కంపెనీ గురువారం ప్రవేశపెట్టింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇది తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం. మైలేజీ వర్షన్నుబట్టి లీటరుకు 17.8–18.4 కిలోమీటర్లు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్ (ఈహెచ్ఈవీ) ధర రూ.18.89 లక్షల నుంచి మొదలు. మైలేజీ లీటరుకు 27.13 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో సిటీ అమ్మకాల్లో 15 శాతం వాటా ఈహెచ్ఈవీ నుంచి ఉంటుందని హోండా భావిస్తోంది. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను జనవరి 23 నుంచి పెంచుతోంది. మోడల్‌నుబట్టి ధర రూ.30,000 వరకు అధికం కానుంది. ముడిసరుకు వ్యయాలు దూసుకెళ్లడం, నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీ చేపడుతుండడం ఇందుకు కారణమని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కాలుష్యం ఏ మేరకు విడుదల అవుతుందో తెలుసుకునే పరికరాన్ని కార్లలో ఏర్పాటు చేయాలన్న నిబంధన 2023 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తోంది. ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇప్పటికే ప్రకటించాయి. -
హోండా కార్లకు ఐడీబీఐ బ్యాంక్ రుణాలు
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా ఐడీబీఐ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హోండా కార్స్ కస్టమర్లకు సులభ రుణ పథకాలను ఐడీబీఐ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. అందుబాటు ధరలకే, వేగంగా, సులభంగా రుణాలను కస్టమర్లు పొందొచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, నామమాత్రపు ప్రాసెసింగ్ చార్జీలపై రుణాలు అందిస్తున్నట్టు తెలిపాయి. చదవండి: రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ -
జనవరి 1 నుంచి హోండా కార్ల ధరల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం హోండా కంపెనీ వచ్చే నెల జనవరి 1 నుంచి భారత్‌లో తన వాహన ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ధరల పెంపు నిర్ణయంపై ఇప్పటికే కంపెనీ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరెన్సీ అనిశ్చితులు, ఉత్పత్తి వ్యయం ఒత్తిళ్లతో కంపెనీ జనవరి నుంచి ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు కంపెనీ డీలర్లు తెలిపారు. తన అనుబంధ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) ద్వారా దేశంలో ఈ కంపెనీ కాంపాక్ట్, సెడాన్, అమెజ్ నుంచి ప్రీమియం ఎస్యూవీ సీఆర్–వీ వరకు పలు వాహనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద అమెజ్ ప్రారంభ ధర రూ.6.17 లక్షలుండగా, ఎంట్రీ లెవల్ సీఆర్వీ ధర రూ.28.71 లక్షలుగా ఉంది. -
హోండా సిటీ : కొత్త వేరియంట్స్
సాక్షి, ముంబై: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) తన పాపులర్ సెడాన్ హోండా సిటీ 2020ని మంగళవారం లాంచ్ చేసింది. హోండీ సిటీ కి చెందిన నాల్గవ తరం రెండు పెట్రోల్ వేరియంట్లను తాజాగా ఆవిష్కరించింది. 9.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభధరగా నిర్ణయించింది. ఇటీవలే హోండా సిటీ సెడాన్ సరికొత్త 5 వ తరం వెర్షన్‌ను విడుదల చేసిన సంస్థ, 4 వ తరం కారును ఎస్ వీ, వి గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో (మాన్యువల్ ట్రాన్స్ మిషన్) ఈ కారును అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలతో , సమకాలీన స్టైలింగ్‌తో తమ పాపులర్ మోడల్ 4వ తరం హోండా సిటీ అమ్మకం కొనసాగించాలని ఆశిస్తున్నామని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ తెలిపారు. (చదవండి : ఒకినావా ఆర్30 ఈ స్కూటర్) -
ఆన్లైన్లో ఆటోమొబైల్ అమ్మకాలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో షోరూమ్‌లు మూతబడిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాల కోసం కొంగొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్ బాట పడుతున్నాయి. డీలర్ల దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా సేల్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించినట్లు హోండా కార్స్ ఇండియా సోమవారం వెల్లడించింది. ’హోండా ఫ్రమ్ హోమ్’ పేరిట ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టినట్లు వివరించింది. దీనితో దేశంలో ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని హోండా కార్స్ తెలిపింది. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిలకు కూడా అనుసంధానం చేయనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ కూడా ఇటీవలే క్లిక్ టు బై పేరిట ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కూడా జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కూడా భారత్‌లో ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఇంటి నుంచే కస్టమర్లు తమకు నచ్చిన మోడల్ ఎంపిక చేసుకుని, బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా సేల్స్, సరీ్వస్ పోర్ట్‌ఫోలియోను డిజిటలీకరణ చేసినట్లు ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. అటు లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సైతం ‘కాంటాక్ట్‌లెస్ ఎక్స్పీరియన్స్’ పేరిట ఆన్లైన్ విక్రయాలకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కొత్త, ప్రీ–ఓన్డ్ బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయొచ్చని, సరీ్వస్ బుక్ చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే చెల్లింపులు జరపవచ్చని సంస్థ భారత విభాగం తాత్కాలిక ప్రెసిడెంట్ అర్లిండో టెక్సీరా తెలిపారు. ఇక మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా ’మెర్క్ ఫ్రం హోమ్’ పేరిట ఆన్లైన్ సేల్స్ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు వెల్లడించింది. -
వచ్చే నెల్లో మార్కెట్లోకి ‘హోండా సివిక్’
హైదరాబాద్: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 10వ తరం ‘హోండా సివిక్’ను మార్చి 7న మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఈ కొత్త సివిక్ అందుబాటులోకి రానుంది. 1.8 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజిన్, 1.6 లీటర్ ఐ–డీటీఈసీ డీజిల్ ఇంజిన్లతో నూతన కారు విడుదల కానుండగా.. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, లీటరుకు 26.8 కిలోమీటర్ల మైలేజీ ఈ కారు ప్రత్యేకతలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ మాట్లాడుతూ.. ‘ప్రీ–లాంచ్ దశలోనే ఈ కారుకు ఊహించని స్పందన లభిస్తోంది. అంచనాల కంటే అధిక స్థాయిలో ప్రీ–బుకింగ్స్ జరిగాయి. వచ్చే నెల 7న కారును మార్కెట్లో విడుదల చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
హోండా జాజ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా తన ఫ్లాగ్షిప్ హ్యాచ్ బ్యాక్ కారు జాజ్‌లో ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. పెట్రోలు సీవీటీ వేరియంట్‌గా మాత్రమే లభిస్తున్న ఈ స్పెషల్ వేరియంట్ హోండా జాజ్ ధరను రూ.9.22 లక్షలుగా (ఎక్స్ షోరూం,ఢిల్లీ) నిర్ణయించింది. కారు బయటా, లోపల స్టయిలిష్ డిజైన్‌తో రేడియంట్ రెడ్, ఆర్చిడ్ వైట్ పర్ల్ కరల్స్ లో దీన్ని ఆవిష్కరించింది. దీంతోపాటు హోండా అమేజ్, హోండా డబ్యుఆర్-వీ లో కూడా ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. హోండా అమేజ్ ధర రూ.7.86లక్షలుగా, డబ్యుఆర్-వీ ధరను రూ.9.35లక్షలుగా నిర్ణయించింది. జాజ్ తప్ప మిగిలిన రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజీన్లతో లభ్యమవుతున్నాయి. -
హోండా కార్స్ స్పెషల్ ఎడిషన్స్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా సిటీ, అమేజ్, డబ్ల్యూఆర్–వీ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హోండా సిటీ 20వ వార్షికోత్సవం ఎడిషన్, అమేజ్ ప్రైడ్ ఎడిషన్, డబ్ల్యూఆర్–వీ ఎడ్జ్ ఎడిషన్ అనేవి వీటి పేర్లు. ఇవన్నీ టాప్–ఎండ్ వేరియంట్ల రూపంలో, కొన్ని అదనపు ఫీచర్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి ఎక్స్ షోరూమ్ ధరలివీ... మోడల్ పెట్రోల్ ధర(రూ.లలో) డీజిల్ ధర (హోండా సిటీ 20వ వార్షికోత్సవం ఎడిషన్) 13,74,532 13,82,382 హోండా అమేజ్ ప్రైడ్ ఎడిషన్ 6,29,900 7,83,486 డబ్ల్యూఆర్–వీ ఎడ్జ్ 8,01,017 9,04,683 -
హోండా సిటీ విక్రయాలు@ 7 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్)కు చెందిన పాపులర్ మిడ్సైజ్డ్ సెడాన్ కారు ‘హోండా సిటీ’ విక్రయాలు భారత్‌లో 7 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. హెచ్‌సీఐఎల్ 1998లో హోండా సిటీని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ అంతర్జాతీయ విక్రయాలను పరిశీలిస్తే.. వీటిల్లో భారత్ వాటా 25 శాతానికి పైగానే ఉంది. ‘హోండా సిటీ అనేది మాకు భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఇండియాలో 7 లక్షల యూనిట్ల మార్క్‌ను అందుకున్న ఒకేఒక ప్రీమియం సెడాన్ ఇది’ అని హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్, సీఈవో యుచిరో యూనో తెలిపారు. కాగా హోండా సిటీలో నాలుగు జనరేషన్లు ఉన్నాయి. తొలి జనరేషన్ హోండా సిటీ విక్రయాలు (1998–2003) 59,378 యూనిట్లుగా, రెండో జనరేషన్ హోండా సిటీ విక్రయాలు (2003–2008) 1,77,742 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ మోడల్ విక్రయాలు 2008–2013 మధ్యకాలంలో 1,92,939 యూనిట్లుగా, 2014 నుంచి ఇప్పటిదాకా 2,69,941 యూనిట్లుగా నమోదయ్యాయి. -
హోండా కార్ల రేట్ల పెంపు
రూ. 90వేల దాకా పెరుగుదల న్యూఢిల్లీ: జీఎస్టీ సెస్సు పెరిగిన నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా తమ కార్ల ధరలను పెంచినట్లు ప్రకటించింది. సిటీ, బీఆర్–వీ, సీఆర్–వీ మోడల్స్‌పై ఈ పెరుగదల రూ. 7,003 నుంచి రూ. 89,069 దాకా ఉందని వివరించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఎస్యూవీ బీఆర్–వీ ధరపై పెరుగుదల రూ. 12,490–రూ. 18,242 శ్రేణిలో ఉంది. అలాగే ప్రీమియం ఎస్యూవీ సీఆర్–వీ రేటు పెంపు రూ. 75,304–రూ. 89,069 మధ్యలో ఉంది. మధ్య స్థాయి సెడాన్ సిటీ రేటు వేరియంట్‌ను బట్టి రూ. 7,003 నుంచి రూ. 18,791 దాకా పెరిగింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన కార్ల మోడల్స్‌పై రేట్లను రూ. 13,000 నుంచి రూ. 1.6 లక్షల దాకా పెంచిన సంగతి తెలిసిందే. జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలే మధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సును 2–7 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగానే కార్ల తయారీ సంస్థలు కూడా రేట్లు పెంచుతున్నాయి. -
మార్కెట్లోకి హోండా ‘అమేజ్’ కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.6.48 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.48 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.7.73 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కొత్త లిమిటెడ్ వెర్షన్లో అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదిరిపోయే ఎక్స్టీరియర్ సహా ఏబీఎస్ (డీజిల్ వేరియంట్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, పవర్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘కస్టమర్లకు ఉత్తమమైన ఫీచర్లను అందించడమే మా ప్రధాన లక్ష్యం. హోండా అమేజ్‌లో ప్రివిలేజ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది’ అని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. -
ఇప్పుడు హోండా వంతు..
కార్ల ధరలు 3 శాతం వరకూ పెంపు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ తాజాగా తన వాహన ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు నిర్ణయం 2017, జనవరి తొలివారం నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీపేర్కొంది. మారకపు విలువలో తీవ్ర ఒడిదుడుకులు, ముడిపదార్థాల ధరలు పెంపు వంటి పలు అంశాల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని వివరించింది. కంపెనీ రూ.4.69లక్షలు నుంచి రూ.37 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ధర శ్రేణిలో తన వాహనాలను మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా హ్యుందాయ్ మోటార్, నిస్సాన్, టయోటా, రెనో, మెర్సిడెస్, టాటా మోటార్ వంటి కంపెనీలు కూడా వాటివాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. -
హోండా కార్స్ నుంచి అప్డేటెడ్ బ్రియో
ప్రారంభ ధర రూ.4.69 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ బ్రియోలో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4.69-రూ.6.81 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇది ఈ ఎంటీ, ఎస్ ఎంటీ, వీఎక్స్ ఎంటీ, వీఎక్స్ ఏటీ అనే నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ప్రత్యేకతలు.. కంపెనీ తాజా అప్డేటెడ్ బ్రియోలో పలు కొత్త ఫీచర్లను పొందుపరిచింది. ఇందులో ప్రధానంగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్పోర్టీ ఎక్స్టీరియర్స్, ప్రీమియం ఇంటీరియర్స్, సరికొత్త ఇన్స్ట్రూమెంట్ ప్యానెల్, నూతన టెయిల్ ల్యాంప్, అడ్వాన్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ ఏసీ కంట్రోల్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు వరుసగా లీటరుకు 18.5 కిలోమీటర్లు, 16.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయని పేర్కొంది. నూతన బ్రియో ఒక ఆల్‌రౌండర్ హోండా ఇంజినీరింగ్ నైపుణ్యాలకు, తయారీ విలువలకు బ్రియో నిదర్శనంగా నిలిచిందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యొచిరొ యుఎనొ తెలిపారు. ‘బ్రియో ఒక ఆల్‌రౌండర్ లాంటిది. విశాలవంతంగా, సౌకర్యవంతంగా, చూడటానికి చక్కగా ఉంటుంది. అలాగే మైలేజ్, ఇంజిన్, పనితీరు.. ఇలా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కూడా బ్రియోతో కస్టమర్ సంతృప్తిపడతాడు’ అని పేర్కొన్నారు. కాగా కంపెనీ బ్రియోను 2011లో మార్కెట్లోకి తెచ్చింది. -
హోండా బహుముఖ వ్యూహం
⇒ హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ ⇒ కొత్త మోడల్స్ విడుదల; ఉత్పత్తి పెంపుపై దృష్టి... లోకలైజేషన్‌కు ప్రాధాన్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :డిమాండ్‌కి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్, నెట్వర్క్ విస్తరణతో కొనుగోలుదారులకు మరింత చేరువవుతున్నామంటున్నారు ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్. లోకలైజేషన్‌పై దృష్టి సారించడం ద్వారా నాణ్యమైన కార్లను తక్కువ ధరకు అందించే ప్రయత్నం చేస్తున్నామంటూ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు సేన్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. భారీ మార్కెట్... సుమారు 120 కోట్ల మంది పైగా జనాభా గల మన దేశంలో ప్రస్తుతం కార్ల మార్కెట్ కేవలం ముప్పై లక్షల మేర ఉంటోంది. సంపన్న దేశాల్లో వెయ్యి మందికి ఆరేడు వందలు, పొరుగు దేశాల్లో దాదాపు వంద కార్లుగాను నిష్పత్తి ఉంటే.. మన దగ్గర ఇది ఇరవై కార్ల కన్నా తక్కువగానే ఉంది. కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులకు అనుగుణంగా ఈ మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. అదే అంచనాలతో మేమూ మా ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాం. ప్రస్తుతం ఏడు మోడల్స్ విక్రయిస్తున్నాం. సీఆర్-వీ సహా ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నవే. దిగుమతి చేయడం లేదు. తదుపరి వృద్ధిని అందుకునే దిశగా మేము సన్నద్ధమవుతున్నాం. ఏప్రిల్, మేలో అమ్మకాలు కాస్త మందగించాయి. ప్రధానంగా డీజిల్, పెట్రోల్ కార్ల విషయంలో కొనుగోలుదారుల అభిరుచులు మారడం, డిమాండ్-సరఫరాకి మధ్య వ్యత్యాసాలు మొదలైనవి ఇందుకు కారణం. మరికొద్ది కాలంలో ఇది సర్దుకోవచ్చు. విక్రయాల వృద్ధికి వ్యూహాలు.. కొనుగోలుదారులకు మరింత చేరువయ్యే దిశగా కొత్త మోడల్స్ ప్రవేశపెట్టడం, స్థానికంగా తయారీకి ప్రాధాన్యం ఇవ్వడం, ఉత్పత్తి పెంచుకోవడం తదితర వ్యూహాలను అమలు చేస్తున్నాం. ప్రస్తుతం 190 నగరాల్లో సుమారు 298 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం 340కి పెంచుకోనున్నాం. కార్ల మార్కెట్లో దాదాపు మూడో వంతు రీప్లేస్మెంట్దే ఉంటున్న నేపథ్యంలో పాత కార్ల ఎక్స్చేంజీ ఆఫర్లు కూడా ఇస్తున్నాం. అలాగే లోకలైజేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. మా వాహనాల్లో గరిష్టంగా భారత్‌లో తయారైన విడిభాగాలే ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు ఇటీవలే ప్రవేశపెట్టిన బీఆర్-వీనే తీసుకుంటే.. ఇది 94 శాతం భాగం దేశీయంగానే తయారైనది. దీనికి సుమారు నెల రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది వేల పైచిలుకు ఆర్డర్లు వచ్చాయి. ఇక, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ఎక్కువగా స్థానీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దిగుమతి వ్యయాలు తగ్గడం వల్ల తక్కువ ధరల రూపంలో ఆ ప్రయోజనాలను కొనుగోలుదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఉత్పత్తికి సంబంధించి రాజస్తాన్‌లోని టపుకరాలో 1.2 లక్షల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు ఉంది. అక్కడ సామర్థ్యాన్ని 1.8 లక్షలకు పెంచుకునే దిశగా రూ. 380 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. గ్రేటర్ నోయిడాలోని మరో ప్లాంటుతో కూడా కలుపుకుంటే విస్తరణతో మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల నుంచి 3 లక్షలకు పెరుగుతుంది. కొత్త సెగ్మెంట్లలోకి.. మేం వివిధ విభాగాల్లో కాస్త ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ.. నాణ్యతే ప్రధానంగా ముందుకెడుతున్నాం. గత మూడేళ్లుగా ఎంట్రీ లెవెల్ సెడాన్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఇవన్నీ మా అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయి. ఈ ఏడాది హోండా అకార్డ్ (హైబ్రీడ్) సెప్టెంబర్‌లో ప్రవేశపెడుతున్నాం. దీన్ని మాత్రం దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తాం. హైబ్రీడ్ కార్ల మార్కెట్ చిన్నగానే ఉన్నప్పటికీ.. పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఇది మెరుగుపడవచ్చు. విధానాల్లో స్పష్టత కొరవడింది... సవాళ్ల విషయానికొస్తే.. విధానాల్లో స్పష్టత లేకపోవడం సమస్యలకు దారితీస్తోంది. పరిశ్రమల శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు దీని ప్రభావాల గురించి వివరించింది. ప్రస్తుతానికైతే ఢిల్లీలోనే ఇది అమలవుతోంది. డీజిల్ వాహనాలపై ఆంక్షలు కొనుగోలుదారుల్లో ఆలోచనల్లో కొంత అనిశ్చితికి దారి తీశాయి.. ఇది మాకూ కొంత సమస్యాత్మకంగా మారింది. కొనుగోలుదారులు డీజిల్ నుంచి పెట్రోల్ కార్లవైపు మళ్లుతుండటంతో దానికి తగ్గట్లుగా ఉత్పత్తినీ సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాది మార్కెట్.. రయ్ రయ్ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది మార్కెట్ చాలా వేగంగా పరుగులు తీస్తోంది. అయిదేళ్ల క్రితం ఉత్తరాది ముందువరుసలో ఉంటే, పశ్చిమ, దక్షిణాది రీజియన్లు వరుసగా రెండు, మూడో స్థానంలో ఉండేవి. కానీ ప్రస్తుతం మూడూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. బహుశా మరో ఒకట్రెండు సంవత్సరాల్లో దక్షిణాది జోన్ ముందుకు వచ్చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కరీంనగర్, వరంగల్ మొదలుకుని ఏపీలో వైజాగ్, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో మా డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కొత్తగా నల్లగొండలో ప్రారంభిస్తున్నాం. -
మార్కెట్లోకి హోండా చౌక ఎస్యూవీ ... బీఆర్-వీ
ధరలు రూ.8.75 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్లో ఎస్యూవీ ప్రత్యేకతలు...: 4 వేరియంట్లలలో లభ్యమయ్యే ఈ ఎస్‌యూవీలో బ్లాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ తదితర ఫీచర్లున్నాయి. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 16 కిమీ కాగా... డీజిల్ వేరియంట్ 21.9 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా... బీఆర్-వీ మోడల్‌తో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) సెగ్మెంట్లో ప్రవేశించింది. ఈ ఎస్‌యూవీని పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.8.7 లక్షల నుంచి రూ.11.84 లక్షలు, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.9.9 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్లో ఉన్నాయని హోండా కార్స్ ఇండియా(హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యుఇనో పేర్కొన్నారు. ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొన్నారు. హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ ఎస్‌యూవీలకు ఈ బీఆర్-వీ ఎస్యూవీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
3 లక్షల కార్ల విక్రయ లక్ష్యం: హోండా
- రూ. 380 కోట్లతో రాజస్థాన్ యూనిట్ విస్తరణ - వచ్చే ఏడాది మార్కెట్లోకి హోండా న్యూ అకార్డ్ - హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియాలో వచ్చే ఏడాది మూడు లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. కొత్తమోడల్స్ ప్రవేశంతో 2016-17లో మూడు లక్షల కార్ల మార్కును అధిగమించగలమన్న ధీమాను హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిండెంట్ (మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ ధీమాను వ్యక్తం చేశారు. గతేడాది 1.89 లక్షల కార్లను విక్రయించామని, కొత్త జాజ్ రాకతో ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం ద్వారా రెండు లక్షల మార్కును అధిగమించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ప్రీమియం సెగ్మెంట్లో న్యూ అకార్డ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో హోండా న్యూ జాజ్ కార్‌ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా సేన్ మాట్లాడుతూ దేశీయ మార్కెట్ విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని తయారీ యూనిట్‌ను రూ. 380 కోట్లతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. దీంతో అదనంగా 60,000 కార్ల తయారీ సామర్థ్యం అందుబాటులోకి రావడంతో మొత్తం వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లకు చేరుతుందన్నారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం గుజరాత్లో స్థలాన్ని సమీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే డీలర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తున్నామని, వచ్చే మార్చిలోగా డీలర్ల సంఖ్యను 247 నుంచి 300కి పెంచడమే కాకుండా, పట్టణాల సంఖ్యను 157 నుంచి 200కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశీయ కార్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 7 శాతంగా ఉందని, ఈ నెట్వర్క్ విస్తరణతో ఇది మరింత పెరుగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కొత్తగా విడుదల చేసిన న్యూ జాజ్ 12 వేరియంట్లలో ఏడు రంగుల్లో లభిస్తోందన్నారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధరను రూ. 5.40-7.98 లక్షలు (పెట్రోల్), రూ. 6.62 లక్షల నుంచి రూ. 8.75 లక్షలు (డీజిల్)గా నిర్ణయించినట్లు తెలిపారు. -
హోండా బ్రియో, అమేజ్ కార్ల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా... బ్రియో, అమేజ్ మోడళ్ల కార్ల ధరలను స్వల్పంగా పెంచింది. బడ్జెట్లో పన్నుల హేతుబద్ధీకరణ కారణంగా బ్రియో కార్ల ధరలను రూ.600 వరకూ, అమేజ్ కార్ల ధరలను రూ.800 వరకూ పెంచామని హోండా కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెరుగుదల ఈ నెల మొదటి వారం నుంచే వర్తిస్తుందని తెలిపింది. ధరలు పెంచిన తర్వాత బ్రియో ధరలు రూ. 4.21 లక్షల నుంచి రూ.6.79 లక్షలు, అమేజ్ కార్ల ధరలు రూ.5.18 లక్షల నుంచి రూ.8.21 లక్షల రేంజ్లో(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇతర మోడళ్ల ధరలను పెంచలేదని తెలిపింది. -
పుంజుకుంటున్న అమ్మకాలు
ఫిబ్రవరిలో వాహన విక్రయాలు స్వల్పంగా వృద్ధి న్యూఢిల్లీ: కార్ల విక్రయాలు ఫిబ్రవరిలో కొంత పుంజుకున్నాయి. కొత్త మోడళ్లు దీనికి ప్రధాన కారణం. ప్రధాన కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు గత నెల విక్రయాల్లో ఒక అంకె వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ ఇండియా, టాటా మోటార్స్‌లు మాత్రం రెండంకెల వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఇక టూవీలర్ల విషయానికొస్తే హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో విక్రయాలు తగ్గగా, టీవీఎస్ మోటార్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఇంధనాల ధరలు తక్కువగా ఉండడం, తరుగుదల ప్రయోజనం పొందడం కోసం కొత్త కార్లను కొనుగోలు చేయడం, పెళ్లిళ్ల సీజన్ వంటి కారణాల వల్ల కూడా అమ్మకాలు కొంచెం పుంజుకున్నాయని నిపుణులంటున్నారు. హ్యుందాయ్ ఐ20ఇలీట్, మారుతీ సెలెరియా, సియాజ్, టాటా బోల్ట్, జెస్ట్, హోండా సిటీ కార్లు డిమాండ్‌ను పెంచాయి. వడ్డీరేట్లు తగ్గించాలి... : గత రెండు నెలల విక్రయాలపై ఎక్సైజ్ సుంకం రాయితీల రద్దు ప్రభావం చూపుతోందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు వడ్డీ రేట్లు తగ్గితేనే అమ్మకాలు మరింత పుంజుకుంటాయని వివరించారు. విక్రయాల విశేషాలు... ⇒ మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు 8%, ఎగుమతులు 14% చొప్పున పెరిగాయి. కాంపాక్ట సెడాన్ డిజైర్ టూర్ వి6కయాలు 96% వృద్ధితో 2,552కు పెరిగాయి. ⇒ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన జెస్ట్, బోల్డ్ కార్లకు స్పందన బావుందని టాటా మోటార్స్ పేర్కొంది. ఎగుమతులు 11% తగ్గాయని వివరించింది. ⇒ హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 10% పెరిగాయి. ఎగుమతులు 18%తగ్గాయి. ⇒ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ బైక్‌ల విక్రయాలు 2% తగ్గాయి. ⇒ టీవీఎస్ మోటార్ టూవీలర్ల విక్రయాలు 15% వృద్ధి చెందాయి. బైక్‌ల విక్రయాలు 18%, స్కూటర్ల అమ్మకాలు 35%, త్రీ వీలర్ల విక్రయాలు 23%, ఎగుమతులు 35 % చొప్పున వృద్ధి చెందాయి. ⇒ బజాజ్ ఆటో మోటార్ సైకిల్ విక్రయాలు 21% తగ్గాయి. ఎగుమతులు 20%, వాణిజ్య వాహనాల విక్రయాలు 32% చొప్పున తగ్గాయి. -
హోండా 4 లక్షల లోపు కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా చిన్న కార్ల మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తోంది. మాస్ మార్కెట్ లక్ష్యంగా రూ.4 లక్షల లోపు ఖరీదు చేసే కారును తీసుకొచ్చే పనిలో ఉంది. ప్రస్తుతమీ కారు అభివృద్ధి దశలో ఉంది. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో రూ.4 లక్షల లోపు ఖరీదు చేసే కార్ల వాటా 35-40 శాతముంటుంది. చిన్న కారు రావడానికి కొంత సమయం పడుతుందని హోండా కార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షిగేరు యమజకి తెలిపారు. మల్టీపర్పస్ వెహికల్ ‘మొబీలియో’ను విడుదల చేసేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కాగా, హోండా ఇప్పటికే ‘బ్రియో’ హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తోంది. దీని ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.4.10 లక్షల నుంచి ప్రారంభం. ఆందోళన కలిగిస్తున్నా..: మందగమనం నుంచి ఇప్పుడిప్పుడే భారత కార్ల మార్కెట్ పుంజుకుంటోందని యమజకి అన్నారు. ఈ ఏడాది మంచి వృద్ధి ఉంటుందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయని, దీర్ఘకాలంలో మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. ఈ అంశాలు ఆందోళన కలిగి స్తున్నాయన్నారు. కాగా, ఎంపీవీ మార్కెట్లో మొబీ లియో కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని కంపెనీ జనరల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమణ్‌కుమార్ శర్మ తెలిపారు. ఇప్పటికే 10 వేలకుపైగా బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. మొబీలియో స్పందననుబట్టి రాజస్థాన్ ప్లాంటులో రెండో షిఫ్ట్ ప్రారంభిస్తామని వివరించారు. మొబీలియో ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో పెట్రోలు వర్షన్ రూ.6.8 లక్షలు, డీజిల్ వర్షన్ రూ.8.2 లక్షల నుంచి ప్రారంభం. మొత్తం 60 లక్షల కార్లు.. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి 60 లక్షల కార్లను విక్రయించాలని హోండా కార్స్ లక్ష్యంగా చేసుకుంది. 12 లక్షల యూనిట్లు ఆసియా దేశాల నుంచి కాగా, ఇందులో 3 లక్షలు భారత్‌లో అమ్మాలని లక్ష్యం విధిం చుకుంది. లక్ష్యానికి చేరువయ్యేందుకు విదేశాల్లో అందుబాటులో ఉన్న మోడళ్లను దశలవారీగా ఇక్కడ పరిచయం చేయనుంది. కాంపాక్ట్ సెడాన్, మిడ్ సైజ్ సెడాన్, ఎంపీవీ విభాగాల్లో కంపెనీ ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో విడుదల కానుంది.