ధరల పెంపుబాటలో కార్ల కంపెనీలు..!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కార్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని యోచిస్తున్నాయి. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుపోతున్న కారణంగా ఈ కంపెనీలు ధరలను పెంచాలనుకుంటున్నాయని సమాచారం. వచ్చే నెల నుంచి ధరలు పెంచే విషయమై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు.
అయితే ఎంత వరకూ పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదని వివరించారు. ధరల పెంపు విషయమై చర్చలు జరుగుతున్నాయని, పెంచే అవకాశాలున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల ధరలను 1-2 శాతం పెంచనున్నది. హోండా కార్స్ కంపెనీ కార్ల ధరలు రూ. 3.99 లక్షల నుంచి రూ.24.36 లక్షలు, మహీంద్రా ప్రయాణికుల వాహనాల ధరలు రూ.5.43 లక్షల నుంచి రూ.14.48 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. కాగా గత నెలలో మహీంద్రా కంపెనీ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.13,000 నుంచి రూ.49,000 రేంజ్‌లో హోండా కార్స్ కంపెనీ రూ.44,741 వరకూ తగ్గించాయి. ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడంతో ఈ కంపెనీలే కాకుండా పలు కంపెనీలు వాహనాల ధరలను తగ్గించాయి.