
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల కొనుగోలు దారులకు భారీ షాకిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి టాటా ఎలక్ట్రిక్ వెహికల్ ధరల్ని 0.7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీకి వినియోగించే ముడి సరకు ధరలు పెరగడమే తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
ప్రతి మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే, టాటా మోటార్స్ నిర్దిష్ట వేరియంట్ మోడల్‌పై 0.7 శాతం సగటు పెరగనుంది.ఫలితంగా, టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ చేసిన పంచ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షలుగా ఉంది. టాటా కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దీని ధరలు పెరిగే అవకాశం ఉంది.
గత ఏడాది ఏప్రిల్‌లో టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్ ధరల్ని దాదాపు 0.6 శాతం పెంచింది. మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. టాటా కంపెనీ కార్ల ధరల్ని పెంచినప్పటికీ దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలలో కంపెనీ 9 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2022లో 40,043 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 2023 డిసెంబర్ 43,470 యూనిట్లకు చేరుకుంది.