2030 నాటికి సాధ్యం
20 శాతం వాటా లక్ష్యం
టాటా మోటార్స్ వెల్లడి
ముంబై: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వెహికిల్స్ మార్కెట్ 6 శాతం వార్షిక వృద్ధితో 2029–30 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. ఆ సమయానికి 18–20 శాతం వాటా చేజిక్కించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం సంప్రదాయ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ విభాగంలో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది.
కఠినమైన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్‌ఈ–3) నిబంధనలు 2027 నుండి ప్రారంభం కానుండడంతో ఈవీలు, సీఎన్‌జీ వాహనాల వాటా పెరుగుతుంది. మరోవైపు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల ధరలు అధికం అవుతాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 2029–30 నాటికి ఈవీల వాటా 20 శాతం, సీఎన్‌జీ విభాగం 25 శాతం వాటా కైవసం చేసుకుంటాయని అంచనాగా చెప్పారు.
కొన్నేళ్లుగా కొత్త ట్రెండ్..
వినియోగదార్లకు ఖర్చు చేయతగిన ఆదాయం పెరగడం, తక్కువ కాలంలో వాహనాన్ని మార్చడం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని శైలేష్ చంద్ర అన్నారు. పైస్థాయి మోడల్‌కు మళ్లడం, అదనపు కార్లను కొనుగోలు చేసేవారి వాటా పెరుగుతోందని చెప్పారు. కొన్నేళ్లుగా ఇది ట్రెండ్‌గా ఉందని అన్నారు. నూతనంగా కారు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గుతోందని వివరించారు. ఎస్‌యూవీల కోసం ప్రాధాన్యత పెరుగుతోంది. పెద్ద ఎత్తున కొత్త మోడళ్ల రాకతో ఈ సెగ్మెంట్ వాటా ఎక్కువ కానుందని శైలేష్ తెలిపారు. హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్‌లకయ్యే ఖర్చుతో ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీ ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లు కొన్నేళ్లుగా ట్రెండ్‌గా ఉన్నాయని, ఇది సహజమైన పురోగతి అని ఆయన అన్నారు.
అత్యంత విఘాతం..
సీఏఎఫ్‌ఈ–3 కఠిన నిబంధనలు రాబోయే ఐదారు సంవత్సరాలలో పరిశ్రమకు అత్యంత విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. సీఏఎఫ్‌ఈ–3 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ఇదే జరిగితే బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 2023–24లో దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో కంపెనీకి 13.9 శాతం వాటా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఏడు మోడళ్లతో 53 శాతం మార్కెట్‌లో పోటీపడుతోందని వివరించారు. కొత్త మోడళ్లతో పోటీపడే మార్కెట్‌ను పెంచుకుంటామని వెల్లడించారు. కర్వ్, సియెర్రా మోడళ్లను రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త మోడళ్ల కోసం ఆదాయంలో 6–8 శాతం వెచ్చిస్తామని వెల్లడించారు. అయిదారేళ్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపారం కోసం రూ.16–18 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment