న్యూఢిల్లీ: డిమాండ్ మందగించిన కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగం విక్రయాల వృద్ధి 5–7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికల్స్) శైలేష్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీపరంగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ మోడల్స్‌తో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న వాహనాలను సరికొత్తగా తీర్చిదిద్దడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.
కోవిడ్‌పరమైన పరిణామాలతో డిమాండ్ భారీగా పేరుకుపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో పీవీల అమ్మకాలు 27 శాతం వృద్ధి నమోదు చేశాయి. కానీ ప్రస్తుతం కొన్ని స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు తప్ప మిగతావాటికి డిమాండ్ తగ్గిందని చంద్ర పేర్కొన్నారు. కొత్త ఉద్గార ప్రమాణాలకు మారే క్రమంలో వాహనాల రేట్ల పెరుగుదల కూడా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన చెప్పారు. అయితే, రాబోయే రోజుల్లో వృద్ధి తిరిగి రెండంకెల స్థాయికి చేరగలదని ఆయన వివరించారు.
తమ సంస్థ విషయానికొస్తే పంచ్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను తేబోతున్నామని .. కర్వ్, సియెరా వంటి వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చంద్ర చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరగబోతున్నాయని పేర్కొన్నారు. టాటా మోటర్స్ ఈ మధ్యే తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో సీఎన్‌జీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో డీలర్లకు రికార్డు స్థాయిలో 5.4 లక్షల వాహనాలను సరఫరా చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే హోల్‌సేల్ అమ్మకాలు 45 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment