ప్యాసింజర్ వాహనాలతో ఒక బిజినెస్
వాణిజ్య వాహనాలతో మరో యూనిట్
టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. వాణిజ్య వాహనాలు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాలు మరో కంపెనీగా ఏర్పాటుకానుంది. తద్వారా వృద్ధి అవకాశాలను మరింత బలంగా అందిపుచ్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది.
న్యూఢిల్లీ: ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటా ర్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటుకానుంది.
విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్‌రోవర్‌సహా ప్యాసింజర్ వాహనాల(పీవీ) బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతోపాటు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంసైతం కలసి ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు టాటా మోటార్స్ తెలియజేసింది. ఎన్‌సీఎల్‌టీ నిబంధనలకు అనుగుణంగా విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు 2 లిస్టెడ్ సంస్థలలోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది.
టర్న్ అరౌండ్
గత కొన్నేళ్లలో కంపెనీ బలమైన టర్న్‌అరౌండ్‌ను సాధించింది. మూడు ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లూ స్వతంత్ర నిర్వహణలో కొనసాగుతూ నిలకడైన పనితీరును చూపుతున్నాయి. తాజా విడదీతతో మార్కెట్ కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయ్. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా మోటార్స్
12–15 నెలలు
కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డుసహా.. వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందనున్నట్లు తెలియజేశారు.
విడదీత పూర్తికి 12–15 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపబోదని స్పష్టం చేశారు. కాగా.. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, మూడు సంయుక్త కంపెనీలు, రెండు సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి.
తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు రూ. 996 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో రూ. 987 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment