N. Chandrasekaran
-
రెండు కంపెనీలుగా టాటా మోటార్స్
టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. వాణిజ్య వాహనాలు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాలు మరో కంపెనీగా ఏర్పాటుకానుంది. తద్వారా వృద్ధి అవకాశాలను మరింత బలంగా అందిపుచ్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. న్యూఢిల్లీ: ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటా ర్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటుకానుంది. విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్రోవర్సహా ప్యాసింజర్ వాహనాల(పీవీ) బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతోపాటు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంసైతం కలసి ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు టాటా మోటార్స్ తెలియజేసింది. ఎన్సీఎల్టీ నిబంధనలకు అనుగుణంగా విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు 2 లిస్టెడ్ సంస్థలలోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది. టర్న్ అరౌండ్ గత కొన్నేళ్లలో కంపెనీ బలమైన టర్న్‌అరౌండ్‌ను సాధించింది. మూడు ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లూ స్వతంత్ర నిర్వహణలో కొనసాగుతూ నిలకడైన పనితీరును చూపుతున్నాయి. తాజా విడదీతతో మార్కెట్ కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయ్. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా మోటార్స్ 12–15 నెలలు కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డుసహా.. వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందనున్నట్లు తెలియజేశారు. విడదీత పూర్తికి 12–15 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపబోదని స్పష్టం చేశారు. కాగా.. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, మూడు సంయుక్త కంపెనీలు, రెండు సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి. తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు రూ. 996 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో రూ. 987 వద్ద ముగిసింది. -
కొనుగోళ్లపై టాటా కన్జూమర్ కన్ను
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై కన్నేసింది. విభిన్న కేటగిరీలలో సరైన అవకాశాలను అందిపుచ్చుకునే యోచనలో ఉన్నట్లు కంపెనీ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వివిధ విభాగాలలో అనువైన కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా వృద్ధికి ఊతమివ్వాలని చూస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ వార్షిక సమావేశంలో భాగంగా వాటాదారుల ప్రశ్నలకు స్పందిస్తూ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం, పంపిణీని విస్తరించడం, నూతన ఆవిష్కరణలు, కొత్త విభాగాలలోకి ప్రవేశించడం వంటి పలు ప్రణాళికలను వెల్లడించారు. భవిష్యత్ వృద్ధికి మద్దతుగా ఇతర కంపెనీల కొనుగోళ్లతోపాటు.. సొంత కార్యకలాపాల విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 361 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. వెలుపలి అవకాశాల ద్వారా విస్తరించడం కంపెనీ కీలక వ్యూహాలలో భాగమని ప్రస్తావించారు. గతేడాది కొనుగోళ్లు గతేడాది గ్రూప్ సంస్థ టాటా స్మార్ట్‌ఫుడ్(టీఎస్‌ఎఫ్‌ఎల్)ను రూ. 395 కోట్లకు టాటా కన్జూమర్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలతో ఆరోగ్యకర అల్పాహారం, స్నాక్స్ తయారు చేసే కొట్టారం ఆగ్రో ఫుడ్స్‌ను టాటా కన్జూమర్ చేజిక్కించుకుంది. కాగా.. ఇటీవల భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, సరఫరా సవాళ్లు, చమురుసహా పలు కమోడిటీల ధరలతో ద్రవ్యోల్బణం అదుపు తప్పినట్లు చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇలాంటి అనిశ్చితుల్లో తాము పటిష్ట కార్యాచరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ కాలంలో పుట్టుకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గతేడాది నౌరిష్కో, టాటా సంపన్న్, టాటా సోల్‌ఫుల్, టాటా క్యూ బ్రాండ్లు 52 శాతం పురోభివృద్ధిని సాధించినట్లు వెల్లడించారు. టాటా స్టార్‌బక్స్ భాగస్వామ్య సంస్థ కరోనా మహమ్మారి సవాళ్లలోనూ 50 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. దీంతో 26 పట్టణాలలో 268కు స్టోర్స్ సంఖ్య చేరినట్లు వెల్లడించారు. టాటా కన్జూమర్ షేరు నామమాత్ర లాభంతో రూ. 730 వద్ద ముగిసింది. -
ఈ దశాబ్దం భారత్‌దే
న్యూఢిల్లీ: ప్రస్తుత దశాబ్దం (2030 వరకు) భారత్‌కు ఆశావహం అని, ఎన్నో అవకాశాలు రానున్నాయని టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి వచ్చేలా చూడాలన్నారు. సీఐఐ నిర్వహించిన వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో 70% ప్రపంచ వృద్ధి అంతా వర్ధమాన దేశాల నుంచే ఉంటుందని చంద్రశేఖరన్ అంచనా వేశారు. అందులోనూ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని, భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమ్మిళిత వృద్ధి..: ‘‘మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. కానీ, ఈ వృద్ధి ఫలాలు అందరూ అనుభవించే విధంగా ఉండాలి. ధనిక, పేదల మధ్య అంతరం పెరగకుండా చూడాలి. నా వరకు ఇదే మూల సూత్రం’’అని చంద్రశేఖరన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీస నాణ్యమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలన్నారు. రానున్న పదేళ్లలో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే భారత్ ప్రపంచ జీడీపీలో 3% నుంచి 7%కి చేరింది. ఈ అభివృద్ధి వల్ల గత పదేళ్లలోనే 27 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. మనం కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించాం. 2022లోనే ఇప్పటి వరకు చూస్తే ప్రతీ వారం ఒక యూనికార్న్ ఏర్పడింది. అయినా, మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. అది మహిళలకు ఉపాధి కల్పించే విషయంలోనూ. ఇప్పటికీ ఎంతో మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా సదుపాయాలను అందుకోలేకున్నారు’’అని చంద్రశేఖరన్ తెలిపారు. సమస్యలను పరిష్కరించుకోవాలి.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘5 లక్షల కోట్ల డాలర్లు, 8 లక్షల కోట్ల డాలర్లకు భవిష్యత్తులో చేరుకుంటాం. తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, ఇది సమ్మిళితంగా ఉండాలి’’ అని తెలిపారు. ఈ దశాబ్దం భారత్‌దేనని మరోసారి గుర్తు చేస్తూ ఈ క్రమంలో సమస్యలు, సవాళ్లను పరిష్కరించుకున్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయాన్ని ఎన్.చంద్రశేఖరన్ గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఇది 27 శాతం నుంచి 23 శాతానికి దిగివచ్చినట్టు చెప్పారు. అయితే, కొత్త నైపుణ్య నమూనా కారణంగా ఇది మారుతుందన్నారు. ఇంటి నుంచే పని విధానం ఇప్పుడప్పుడే పోదంటూ, అది శాశ్వతంగానూ కొనసాగదన్నారు. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’పై టీసీఎస్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్నిరంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్షన్ (ఇంటి నుంచే సేవలందించడం) ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టన్ ద్వారా తమకు ఖర్చుల భారం తగ్గినట్టు కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. కానీ, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ద్వారా ఖర్చులు మరింతగా పెరిగాయని టాటా సన్స్ (టీసీఎస్) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షిం,ఇ, ఖర్చులను తగ్గించే ప్రణాళికను టీసీఎస్ అవలంభిస్తుందని షేర్ హోల్డర్ల సమావేశంలో పేర్కొన్నారు. కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో కీలక పెట్టుబడులను ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, చిన్న కంపెనీలను కొనుగోలు చేసే వ్యూహం తమ ప్రణాళికలో లేదని అన్నారు. కేవలం లాభాల కోసం సంస్థలను కొనుగోలు చేయమని తెలిపారు. టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపినాథ్ స్సందిస్తూ.. 2016నుంచి 2020సంవత్సరం వరకు షేర్ హోల్డర్లకు అత్యధిక లాభాలు టీసీఎస్ బ్రాండ్‌తో సాధ్యమయిందని అన్నారు. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సైబర్ బీమా!) -
సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూపు పరిధిలోని ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఆయన లేఖ ద్వారా సందేశమిచ్చారు. డిజిటల్‌పై లోతైన పరిజ్ఞానం, సమష్టితత్వం, నిర్వహణపరమైన కార్యాచరణ, అంతర్జాతీయ మార్పులను సమర్థంగా పరిష్కరించే క్రియాశీలతలపై దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు. 2018లో టాటా గ్రూపు మిశ్రమ పనితీరు కనబరిచినట్టు చెప్పారు. ఇక ముందు చేయాల్సింది ఎంతో ఉందంటూ... 100 బిలియన్ డాలర్లకు పైగా విలువైన గ్రూపు నిర్మాణాన్ని మరింత సరళీకరించడాన్ని ఒకానొక కార్యక్రమంగా ప్రస్తావించారు. ‘‘2019 ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లను తీసుకురానుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక చక్రం పరిపక్వతకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాల కదలికలపైనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారపడటం పెరుగుతోంది. ద్రవ్య పరమైన కఠినతర పరిస్థితులు 2019లోనూ అంతర్జాతీయంగా కొనసాగుతాయి’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘మన పరుగు ను కొనసాగించడమే మన ఉద్యోగం. మరొకరి పరుగుపైకి మనసు మళ్లకూడదు’’ అని సూచించారు. కీలక ముందడుగు..: ‘టాటా కంపెనీల పునర్వ్యవస్థీకరణ, రుణాల తగ్గింపు, గ్రూపు పరిధిలో ఒక కంపెనీలో మరో కంపెనీ వాటాలను స్థిరీకరించడం, కీలకమైన ఆస్తుల కొనుగోలు, భవిష్యత్తు వృద్ధికి గాను రూ.70,000 కోట్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ 2018లో రూ.10 లక్షల కోట్లు దాటింది’’అని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 7,02,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉన్నట్టు చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. భద్రత, గౌరవనీయంగా పనిచేసే వాతావరణం అన్నది మొదటి నుంచి తమకు అత్యంత ప్రాధాన్యమైనవిగా పేర్కొన్నారు. టాటా గ్రూపు పరిధిలో మొత్తం ఉద్యోగుల్లో 1,86,000 మంది మహిళలు పనిచేస్తుండడం గమనార్హం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎకోసిస్టమ్... దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల ఎకోసిస్టమ్ ఏర్పాటుకు టాటా మోటార్స్... గ్రూపులోని టాటా పవర్, టాటా క్యాపిటల్‌తో కలసి పనిచేస్తుందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘‘టాటా క్యాపిటల్ నుంచి ఆర్థిక సాయం, టాటా పవర్ నుంచి చార్జింగ్ వసతుల నెట్వర్క్ విషయమై టాటా మోటార్స్ కృషి చేస్తోంది’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
ఇక టాటా సన్స్ సారథి ‘చంద్ర’
నేడు చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ ముంబై: పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతా ’చంద్ర’గా పిల్చుకునే చంద్రశేఖరన్ (54).. టాటా గ్రూప్ 150 ఏళ్ల చరిత్రలో తొలి పార్సీయేతర చైర్మన్ కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఆయన టాటా గ్రూప్‌లో భాగమైన ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు సారథ్యం వహించారు. ట్రస్టీలతో విభేదాల నేపథ్యంలో సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన టాటా గ్రూప్.. జనవరి 12న చంద్రశేఖరన్‌ను ఆయన స్థానంలో నియమించిన సంగతి తెలిసిందే. ఫొటోగ్రఫీపై మక్కువ కలిగిన చంద్ర .. ప్రపంచవ్యాప్తంగా పలు మారథాన్స్‌లో కూడా పాల్గొన్నారు. కొత్త హోదా తనపై మరింత భారీ బాధ్యత మోపిందని, ఇందులో ఇటు సవాళ్లతో పాటు అటు అవకాశాలు కూడా ఉన్నాయని చంద్రశేఖరన్ గత వారం వ్యాఖ్యానించారు. సవాళ్లతో స్వాగతం..: కొత్త హోదాలో చంద్రశేఖరన్‌కి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ముందుగా టాటా స్టీల్ యూరప్ కార్యకలాపాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. టాటా స్టీల్ ఇప్పటికే బ్రిటన్‌లోని కొన్ని అసెట్స్‌ను విక్రయించడం మొదలుపెట్టింది. అయితే, ఎంత మేర అసెట్స్‌ను విక్రయించాలి, కార్యకలాపాలను మళ్లీ గాడిలో పెట్టడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై చంద్రశేఖరన్ కసరత్తు చేయాల్సి రానుంది. ఇక రతన్ టాటా కలల ప్రాజెక్టు నానో కార్ల విషయంలోనూ ఆయన తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా నష్టాలతో టాటా మోటార్స్‌కి నానో ప్రాజెక్టు గుదిబండగా మారింది. ఇవి కాకుండా మిస్త్రీకి ఉద్వాసన వ్యవహారంలో కేంద్ర బిందువులైన టాటా ట్రస్ట్స్, ట్రస్టీలతో చంద్రశేఖరన్ ఏవిధంగా నడుచుకోబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. టీసీఎస్ చైర్మన్‌గా చంద్రశేఖరన్; సీఈఓగా గోపీనాథన్ టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్ నేటి నుంచి టీసీఎస్ చెర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా కంపెనీ ఎండీ, సీఈఓగా ఆయన వ్యవహరించారు. ఇక ప్రస్తుత టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజేష్ గోపీనా«థన్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు తీసుకుంటారు. కొత్త సీఎఫ్ఓగా వి. రామకృష్ణన్‌ను నియమించారు. మరోపక్క, సీఓఓ ఎన్.గణపతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. -
కోహ్లీ రిసర్చ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా కొత్త సారథి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కోహ్లి రిసర్చ్ బ్లాక్‌ను టాటా సన్స్ కాబోయే చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం ప్రారంభించారు. ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో పరిశోధన, బోధన, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఫౌండేషన్ కోహ్లి సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ కేంద్రం ఐటీ రంగంలో అభివృద్ధికి ప్రేరణ కలిగిస్తుందని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో అధునాతన పరిశోధనకై విద్యావేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆటోమేషన్ సంచలనాలను సృష్టిస్తుందని, అత్యుత్తమ పరిశోధనకు కోహ్లి రిసర్చ్ సెంటర్ కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. -
చంద్రశేఖరన్ సామర్థ్యానికి తగిన గుర్తింపు: రతన్ టాటా
ముంబై: టాటా గ్రూపును నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎంపికైన ఎన్.చంద్రశేఖరన్ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళతారం టూ తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రశేఖరన్ నియామకం జరిగిన మరుసటి రోజు రతన్ టాటా స్పందించారు. టాటా సన్స్, టాటా గ్రూపు చైర్మన్‌గా నియమితులైన చంద్రకు తన అభినందనలు తెలియజేశారు. చంద్రశేఖరన్ నాయకత్వ సామర్థ్యాలకు ఇది తగిన గుర్తింపుగా రతన్ టాటా పేర్కొన్నారు. కొత్త ఉద్యోగం సంక్లిష్టమైనది అయినప్పటికీ అతను టాటా గ్రూపు విలువలను అన్ని వేళలా పరిరక్షిస్తూనే కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలడంటూ చంద్ర పట్ల తన నమ్మకాన్ని వ్యక్తీకరించారు. టీసీఎస్ ఎండీ, సీఈవోగా ఉన్న ఎన్.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
డైరెక్టర్ల బోర్డులోకి ‘టీసీఎస్’ చంద్రశేఖరన్..
టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డులోకి టీసీఎస్ సీఈఓ-ఎండీ ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) సీఈఓ రాల్ఫ్ స్పెత్‌లను అదనపు డెరైక్టర్లుగా తీసుకున్నారు. మిస్త్రీపై వేటువేసిన మర్నాడే టాటా సన్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ నియామకాలపై రతన్ టాటా మాట్లాడుతూ.. తమ నేతృత్వంలోని కంపెనీలను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు గుర్తింపుగానే వారికి ఈ పదవులు లభించాయని పేర్కొన్నారు. కాగా రాల్ఫ్, చంద్రశేఖరన్‌ల నియామకంతో టాటా సన్స్ బోర్డులో మొత్తం డెరైక్టర్ల సంఖ్య 12కు చేరింది. గ్రూప్ కంపెనీల సీఈఓలకు టాటా సన్స్ బోర్డులోకి తీసుకునే పాత సాంప్రదాయాన్ని తాజా చర్యలతో మళ్లీ పునరుద్ధరించినట్లు కనబడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇండియన్ హోటల్స్ చీఫ్ కృష్ణకుమార్, టాటా స్టీల్‌కు చెందిన జేజే ఇరానీలు బోర్డులో ఉన్నారు. కాగా, కొత్త చైర్మన్ రేసులో ఎన్. చంద్రశేఖరన్ కూడా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు బోర్డులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మిస్త్రీ ఇంటర్వ్యూ ఔట్.. టాటా గ్రూపునకు దాదాపు నాలుగేళ్లు సారథిగా పనిచేసిన సైరస్ మిస్త్రీని అవమానకరమైన రీతిలో చడీచప్పుడుకాకుండా తొలగించిన టాటాలు.. ఆయన గుర్తులేవీ గ్రూప్‌లో లేకుండా చేస్తున్నట్లు కనబడుతోంది. ప్రపంచంలో 25 అత్యుత్తమ కార్పొరేట్ కంపెనీలు, ఉద్యోగాల సృష్టికర్తల్లో ఒకటిగా నిలవాలంటూ విజన్-2025 పేరుతో ఆయన ఇచ్చిన ఏకైక ఇంటర్వ్యూను(అంతర్గత మేగజీన్‌కు) కూడా తక్షణం టాటా వెబ్సైట్ నుంచి తొలగించేయడం దీనికి నిదర్శనం. దీన్నిబట్టిచూస్తే.. టాటాలు మిస్త్రీ పనితీరుపై ఏరీతిలో అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘టాటా స్టీల్ యూకే’కు మంచిదే: బ్రిటిష్ మీడియా లండన్: మిస్త్రీ తొలగింపుపై బ్రిటన్ మీడియా కూడా ప్రత్యేకంగా దృష్టిసారించింది. మిస్త్రీ ఉద్వాసన ఒకరకంగా టాటా స్టీల్ యూకే(గతంలో కోరస్) కార్యకలాపాలకు మంచివార్తేనంటూ అక్కడి పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే స్టీల్ వ్యాపారంపై తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాకు అమితమైన మక్కువ(కోరస్‌ను కొనుగోలు చేసింది ఆయనే) ఉండటమే దీనికి కారణమని కూడా పేర్కొన్నాయి. తీవ్రమైన నష్టాల్లో ఉన్న టాటా స్టీల్ యూకే యూనిట్లను వదిలించుకోనున్నట్లు ఈ ఏడాది మార్చిలో మిస్త్రీ సారథ్యంలోని టాటా గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ఉద్యోగులపై వేటు పడుతుందని అక్కడి కార్మిక సంఘాలు గగ్గోలు పెట్టాయి కూడా. టాటా స్టీల్ యూకే ప్లాంట్లు, అక్కడి ఉద్యోగుల భవిష్యత్తుపై గ్రూప్ అనుసరించబోయే ప్రణాళికలకు మిస్త్రీ తొలగింపు అద్దం పడుతోందని ఒక మీడియా కథనం పేర్కొంది. -
టాటా సన్స్ బోర్డులో కొత్త సభ్యులు
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో నిర్ణయం ఆ గ్రూపు తీసుకుంది. చైర్మన్ పదవి రేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. చంద్రశేఖరన్నూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవో డాక్టర్. రాల్ఫ్ స్పెత్ను టాటా సన్స్ డైరెక్టర్ బోర్డులో అదనపు డైరెక్టర్లుగా నియమించింది. వీరి చేరికపై స్పందించిన టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా, వారి వారి కంపెనీల్లో శ్రేష్టమైన నాయకత్వపు గుర్తింపుగా వీరి నియామకం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఇద్దరి ఎంపికతో, తొమ్మిది సభ్యులున్న టాటా సన్స్ బోర్డు సభ్యులు, పదకొండు మందికి పెరిగారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న వారినే చైర్మన్లుగా నియమించే అవకాశముంటుంది కనుక ముందస్తుగా రేసులో ఉన్న వారిని టాటా సన్స్ అదనపు బోర్డు డైరెక్టర్లుగా నియమించుకుంటోంది. -
టీసీఎస్ లాభం 5,684 కోట్లు
క్యూ1లో వృద్ధి 2.1 శాతమే... ♦ ఆదాయం రూ. 25,668 కోట్లు; 16 శాతం అప్ ♦ షేరుకి రూ.5.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ముంబై : దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,684 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,568 కోట్లతో పోలిస్తే లాభం 2.1 శాతమే వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ1లో 16.1 శాతం ఎగబాకి రూ.25,668 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ.22,111 కోట్లుగా ఉంది. జపాన్, లాటిన్ అమెరికా మార్కెట్ల నుంచి ఎదురైన కొన్ని ప్రతికూలతలు ఫలితాలపై ప్రభావం చూపాయి. జూన్ క్వార్టర్లో నికర లాభం రూ.5,460 కోట్లు, ఆదాయం రూ. 25,760 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. లాభాల విషయంలో అంచనాలను మించగా, ఆదాయాలు మాత్రం తగ్గడం గమనార్హం. మరోపక్క, ఫలితాల సీజన్‌ను బోణీ చేసే ఇన్ఫోసిస్ స్థానంలో రెండు త్రైమాసికాల నుంచి టీసీఎస్ వచ్చి చేరడం విశేషం. సీక్వెన్షియల్‌గా చూస్తే... గతేడాది ఆఖరి త్రైమాసికం(2014-15, క్యూ4)లో లాభం(రూ.3,712 కోట్లు)తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1లో లాభం 53 శాతం ఎగబాకింది. అయితే, మార్చి క్వార్టర్లో ఉద్యోగులకు వన్‌టైమ్ బోనస్(రూ.2,628 కోట్లు) ప్రకటించిన నేపథ్యంలో దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే లాభం 1.5 శాతం మేర తగ్గినట్లు లెక్క. ఇక ఆదాయం విషయానికొస్తే పెరుగుదల 6 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో కంపెనీ ఆదాయం రూ. 24,220 కోట్లుగా ఉంది. కాగా, డాలర్ల రూపంలో క్యూ1 ఆదాయం సీక్వెన్షియల్‌గా 3.5 శాతం వృద్ధితో 4.03 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మార్కెట్ వర్గాలు 4 శాతం వృద్ధిని అంచనా వేశాయి. కాగా, బ్రిటిష్ కంపెనీ డిలిజెంటా టేకోవర్ వల్ల కూడా 25 మిలియన్ డాలర్ల మేర ఆదాయంలో తగ్గుదలకు దారితీసిందని.. లేదంటే 4 శాతం వృద్ధి సాధించేవాళ్లమని టీసీఎస్ ఎండీ, సీఈఓ ఎన్. చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుపై టీసీఎస్ రూ.5.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ♦ 20 మిలియన్ డాలర్లకు పైబడిన 10 కాంట్రాక్టులను క్యూ1లో చేజిక్కించుకుంది. ఇక 50, 100 మిలియన్ డాలర్లను మించిన కాంట్రాక్టులు చెరొకటి కంపెనీకి లభించాయి. ♦ క్యూ1లో స్థూలంగా కంపెనీ 20,302 మంది ఉద్యోగులకు జతచేసుకుంది. అయితే, 15,023 మంది ఉద్యోగులు వలసపోవడంతో నికరంగా 5,279 మంది మాత్రమే జతయ్యారు. దీంతో జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 3,24,935కు చేరింది. ♦ ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు జూన్ క్వార్టర్లో 15.9 శాతంగా నమోదైంది. మార్చి క్వార్టర్లో ఇది 14.9 శాతం. గడిచిన ఆరు త్రైమాసికాలుగా టీసీఎస్‌లో అట్రిషన్ రేటు పెరుగుతూనే ఉండటం గమనార్హం. ♦ టీసీఎస్ షేరు ధర గురువారం బీఎస్ఈలో 2.8 శాతం క్షీణించి రూ.2,521 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.14,229 కోట్లు దిగజారి రూ.4,93,874 కోట్లకు తగ్గింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. వృద్ధికి ‘డిజిటల్’ తోడ్పాటు... కీలక మార్కెట్లయిన ఉత్తర అమెరికాలో ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకోవడంతోపాటు ఫైనాన్షియల్ సర్వీసులు, రిటైల్, లైఫ్‌సెన్సైస్ రంగాల్లో డిజిటల్ సొల్యూషన్లకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో క్యూ1లో మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. కాంట్రాక్టుల అమలులో మాకున్న అపారమైన నైపుణ్యం, ట్రాక్రికార్డులు.. ఐపీ, డిజిటల్ సామర్థ్యాల్లో భారీస్థాయి పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ వ్యాపారాభివృద్ధికి మరింత చేయూతనందించనున్నాయి. పటిష్టమైన ఆర్డర్లు, వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు డిజిటల్ సేవలను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో సంబంధిత టెక్నాలజీలన్నింటిలోనూ ఈ ఏడాది లక్ష మందికిపైగా నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నాం. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ