కోహ్లీ రిసర్చ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా కొత్త సారథి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కోహ్లి రిసర్చ్ బ్లాక్‌ను టాటా సన్స్ కాబోయే చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం ప్రారంభించారు. ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో పరిశోధన, బోధన, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఫౌండేషన్ కోహ్లి సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ కేంద్రం ఐటీ రంగంలో అభివృద్ధికి ప్రేరణ కలిగిస్తుందని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో అధునాతన పరిశోధనకై విద్యావేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆటోమేషన్ సంచలనాలను సృష్టిస్తుందని, అత్యుత్తమ పరిశోధనకు కోహ్లి రిసర్చ్ సెంటర్ కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు.