ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
దేశ పారిశ్రామిక రంగానికి దశ దిశ చూపిన ధీశాలి
ఆదాయంలో 65 శాతం దాతృత్వానికే..
కరోనాపై పోరుకు రూ.1,500 కోట్లు విరాళమిచ్చిన వితరణశీలి-అనితర సాధ్యుడు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.
ఆయన తనకు గొప్ప మిత్రుడు, గురువు, మార్గదర్శకుడు అని చెప్పారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఆయనొక విజనరీ బిజినెస్ లీడర్, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారని చెప్పారు.
మెరుగైన సమాజం కోసం కృషి చేశారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని గుర్తుచేశారు. విద్యా, వైద్యం, పారిశుధ్యం, జంతు సంరక్షణ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తిత్వంతో ఎంతోమందికి ఆప్తుడైన రతన్ టాటా దూరం కావడం చాలా బాధాకరమని ఉద్ఘాటించారు. రతన్ టాటా కుటుంబానికి ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు.
‘రతన్ టాటా ఒక టైటాన్’ అని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్‡్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రతన్ టాటా ఇక లేరు అనే నిజాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
వివిధ రంగాలలో రతన్ టాటా సంస్థలు
సంపదలో 65% విరాళం
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్‌గా సేవలందించారు.
పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రతన్ టాటా వితరణశీలిగా పేరుగాంచారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.
అనితరసాధ్యుడు..
బాల్యం..విద్యాభ్యాసం..
పారిశ్రామిక దిగ్గజం, వితరణ శీలి రతన్ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా, దత్తత తీసుకున్న నవల్ టాటా, సూనూ టాటా ఆయన తల్లి దండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్‌జీ టాటా సతీమణి అయిన నవాజ్‌బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్ టాటా సవతి సోదరుడు. రతన్ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు.
100 బిలియన్ డాలర్లకు టాటా గ్రూప్..
రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎల్రక్టానిక్స్ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్ ఇంచార్జ్‌గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు.
1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్‌కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్‌డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు.
గ్రూప్‌ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్‌మెంట్ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్.చంద్రశేఖరన్‌కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి.
టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. సాఫ్ట్‌వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూ. 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి 100 బిలియన్ డాలర్లకు ఎగిసింది.
సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్‌లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే.
వితరణశీలి.. ఇన్వెస్టరు..
రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన వి భాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు.
వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. శ్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్, మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు. కరోనా నియంత్రణ కోసం రూ.1,500 కోట్లు అందించారు.
పురస్కారాలు
పారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు.
సిమీ గ్రేవాల్‌తో అనుబంధం..
రతన్ టాటా వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు. నాలుగు సార్లు వివాహానికి దగ్గరగా వచ్చినా పలు కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్ నటి సిమీ గ్రేవాల్‌తో ఆయన ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.
మిస్త్రీతో వివాదం..
టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా ఏరి కోరి సైరస్ మిస్త్రీని తన వారసుడిగా నియమించారు. కానీ మిస్త్రీ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి 2016లో మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది.
ఆయన మార్గదర్శకత్వం అమూల్యం
ఆనంద్ మహీంద్రా
రతన్ టాటా లేరన్నది నేను అంగీకరించలేక పోతున్నా. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ముందడుగులో ఉంది. మనం ఈ స్థానంలో ఉండటానికి రతన్ జీవితం, పని తీరుతో చాలా సంబంధం కలిగి ఉంది. ఈ సమయంలో అతని మార్గదర్శకత్వం అమూల్యం. మన ఆర్ధిక సంపద, విజయాలకు ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లెజెండ్స్‌కి మరణం లేదు.
దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త
ప్రధాని నరేంద్ర మోదీ
రతన్ టాటా దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త. దయార్ధ్ర హృదయం కలిగిన అసాధారణ వ్యక్తి. భారత దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఇదే సమయంలో ఇతని సహకారం బోర్డు రూమ్‌ను
మించిపోయింది. ఎంతో మందికి ఆప్తుడయ్యారు.
లక్షలాది మంది జీవితాలను తాకిన దాతృత్వం
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాము. ఎంతో మందికి అమూల్యమైన సహకారం అందించిన నిజమైన అసాధారణ నాయకుడు. టాటా గ్రూప్ మాత్రమే కాదు.. మన దేశం స్వరూపం కూడా. టాటా గ్రూప్‌కు.. ఆయన చైర్‌పర్సన్ కంటే ఎక్కువ. వ్యాపార వేత్తలందరికీ ఆయన ఓ దిక్సూచి. టాటా దాతృత్వం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయన్ని ఇష్టపడే వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్
Comments
Please login to add a commentAdd a comment