Breach Candy hospital
-
వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయం
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. ఆయన తనకు గొప్ప మిత్రుడు, గురువు, మార్గదర్శకుడు అని చెప్పారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఆయనొక విజనరీ బిజినెస్ లీడర్, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారని చెప్పారు. మెరుగైన సమాజం కోసం కృషి చేశారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని గుర్తుచేశారు. విద్యా, వైద్యం, పారిశుధ్యం, జంతు సంరక్షణ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తిత్వంతో ఎంతోమందికి ఆప్తుడైన రతన్ టాటా దూరం కావడం చాలా బాధాకరమని ఉద్ఘాటించారు. రతన్ టాటా కుటుంబానికి ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. ‘రతన్ టాటా ఒక టైటాన్’ అని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్‡్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రతన్ టాటా ఇక లేరు అనే నిజాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వివిధ రంగాలలో రతన్ టాటా సంస్థలు సంపదలో 65% విరాళం రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్‌గా సేవలందించారు. పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రతన్ టాటా వితరణశీలిగా పేరుగాంచారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అనితరసాధ్యుడు..బాల్యం..విద్యాభ్యాసం.. పారిశ్రామిక దిగ్గజం, వితరణ శీలి రతన్ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా, దత్తత తీసుకున్న నవల్ టాటా, సూనూ టాటా ఆయన తల్లి దండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్జీ టాటా సతీమణి అయిన నవాజ్‌బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్ టాటా సవతి సోదరుడు. రతన్ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. 100 బిలియన్ డాలర్లకు టాటా గ్రూప్..రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎల్రక్టానిక్స్ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్ ఇంచార్జ్‌గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్‌కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు. గ్రూప్‌ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్మెంట్ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్.చంద్రశేఖరన్‌కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. సాఫ్ట్వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూ. 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి 100 బిలియన్ డాలర్లకు ఎగిసింది. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్‌లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే. వితరణశీలి.. ఇన్వెస్టరు.. రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన వి భాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. శ్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్, మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు. కరోనా నియంత్రణ కోసం రూ.1,500 కోట్లు అందించారు.పురస్కారాలుపారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు. సిమీ గ్రేవాల్‌తో అనుబంధం..రతన్ టాటా వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు. నాలుగు సార్లు వివాహానికి దగ్గరగా వచ్చినా పలు కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్ నటి సిమీ గ్రేవాల్‌తో ఆయన ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.మిస్త్రీతో వివాదం..టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా ఏరి కోరి సైరస్ మిస్త్రీని తన వారసుడిగా నియమించారు. కానీ మిస్త్రీ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి 2016లో మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. ఆయన మార్గదర్శకత్వం అమూల్యం ఆనంద్ మహీంద్రా రతన్ టాటా లేరన్నది నేను అంగీకరించలేక పోతున్నా. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ముందడుగులో ఉంది. మనం ఈ స్థానంలో ఉండటానికి రతన్ జీవితం, పని తీరుతో చాలా సంబంధం కలిగి ఉంది. ఈ సమయంలో అతని మార్గదర్శకత్వం అమూల్యం. మన ఆర్ధిక సంపద, విజయాలకు ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లెజెండ్స్‌కి మరణం లేదు.దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త ప్రధాని నరేంద్ర మోదీ రతన్ టాటా దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త. దయార్ధ్ర హృదయం కలిగిన అసాధారణ వ్యక్తి. భారత దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఇదే సమయంలో ఇతని సహకారం బోర్డు రూమ్‌ను మించిపోయింది. ఎంతో మందికి ఆప్తుడయ్యారు.లక్షలాది మంది జీవితాలను తాకిన దాతృత్వంరతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాము. ఎంతో మందికి అమూల్యమైన సహకారం అందించిన నిజమైన అసాధారణ నాయకుడు. టాటా గ్రూప్ మాత్రమే కాదు.. మన దేశం స్వరూపం కూడా. టాటా గ్రూప్‌కు.. ఆయన చైర్పర్సన్ కంటే ఎక్కువ. వ్యాపార వేత్తలందరికీ ఆయన ఓ దిక్సూచి. టాటా దాతృత్వం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయన్ని ఇష్టపడే వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
ఆస్పత్రికెళ్లిన దీపికా పదుకొణె.. ఎందుకంటే?
బాలీవుడ్ భామ దీపికా పదుకొణే ఆస్పత్రికెళ్లారు. సోమవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి కెళ్లిన హీరోయిన్ పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం దీపికా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్లో పాల్గొంది. అదే సమయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. (చదవండి: ఆ బాధకు కారణం తెలియదు..ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: దీపికా పదుకోణె) దీపికా పదుకొణె ప్రస్తుతం షారుక్ ఖాన్ చిత్రం పఠాన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణె ఫైటర్ చిత్రంలో నటించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలోనూ దీపికా కనిపించనుంది. -
లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం!
ముంబై: సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వైద్యుడొకరు శనివారం చెప్పారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఆరోగ్యం చాలావరకు క్షీణించినట్లు సమాచారం. ఆమెకు కరోనా సోకడంతో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జనవరి 8న బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరారు. డాక్టర్ ప్రతీత్ సందానీ, ఆయన బృందం లతకు చికిత్స అందిస్తోంది. చికిత్సకు లతా దీదీ చక్కగా స్పందిస్తున్నారని, వెంటిలేటర్‌పై ఉన్నారని శనివారం ఆసుపత్రి బయట సందానీ మీడియాతో చెప్పారు. అంతకుముందు ఉదయం మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. జనవరి 29న మాట్లాడినప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్ తొలగించామని, ఐసీయూలోనే మరికొంత కాలం పరిశీలనలో ఉంచుతామని అన్నారు. 2019 నవంబర్‌లో లతా మంగేష్కర్‌కు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. బ్రీచ్‌క్యాండీలో ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా సోకినట్లు తేలింది. 28 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. 1942లో కేవలం 13 ఏళ్ల వయసులో గాయనిగా జీవనం ఆరంభించిన లతా మంగేష్కర్ వివిధ భారతీయ భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ‘మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి ప్రతిష్టలు పొందారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతోపాటు సినీ రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. -
ఆసుపత్రిలో... బప్పీలహరి
బాలీవుడ్ సినీసెలబ్రీటీలు కరోనా బారిన పడటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హిందీ చిత్రసీమకు చెందిన దాదాపు 12 మంది సినీ ప్రముఖులకు ఇటీవల కరోనా సోకగా తాజాగా ప్రముఖ సంగీత దర్శకులు బప్పీలహరి కరోనా బారినపడ్డారు. ‘‘కొంతకాలంగా అనారోగ్యంతో బప్పీలహరి బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబయ్‌లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన పదిహేను రోజుల్లో ఆయన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినందిగా బప్పీలహరి కోరుతున్నారు’’’ అని బప్పీలహరి మీడియా ప్రతినిధి పేర్కొన్నారు. -
కోలుకున్న లతా మంగేష్కర్
ముంబై: దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మంగళవారం డిశ్చార్జ్ అవుతారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమెను ఆస్పత్రిలో ఉంచాలని భావించినట్లు తెలిపారు. మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో వేలాది పాటలు పాడారు. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం పనిచేశారు. 1989లో ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను అందుకున్నారు. -
ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్
సాక్షి,ముంబై : ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (90) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పడంతో (నవంబర్ 11) సోమవారం తెల్లవారుఝామున లతాజీని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఎడమ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్‌తోపాటు, న్యుమోనియో కూడా ఎటాక్ కావడంతో ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. కాగా లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28 న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆమెకు పుట్టినరోజు కానుకగా భారత ప్రభుత్వం ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదును కేంద్రం అందించింది. వీటితోపాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు. బాలీవుడ్‌కు 1000కి పైగా చిత్రాల్లో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన లతా మంగేష్కర్‌కు తెలుగులో కూడా సంతానం సినిమాలో ‘నిద్దుర పోరా తమ్ముడా ’ అనే పాటను పాడారు. ఆమె చేసిన విశేష సేవలకు గాను దేశంలోని అత్యున్నత పురస్కారం భారత్ రత్న అవార్డును అందుకున్నారు. మరోవైపు అశుతోష్ గోవారికర్ చిత్రం ‘ పానిపట్’ లో గోపికా బాయిగా నటించిన తన మేనకోడలు పద్మిని కోహ్లాపురి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిన్న (నవంబరు 10) లతా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పద్మినితోపాటు, చిత్ర యూనిట్‌కు ఆమె శుభాకాంక్షలు అందజేసిన సంగతి తెలిసిందే. Namaskar. Meri bhaanji Padmini Kolhapure ek bahut acchi kalakar hai aur ab woh Panipat is film mein Gopika bai ka kirdaar nibha rahi hai. Main Padmini ko aashirwad deti hun aur Ashutosh aur unki team ko shubhkaamanayein deti hun. pic.twitter.com/bTZJMUjdYq — Lata Mangeshkar (@mangeshkarlata) November 10, 2019 -
చిరంజీవికి మళ్లీ ఆపరేషన్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి మరో ఆపరేషన్ జరగనుంది. ఆయన ఎడమ భుజానికి త్వరలో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరగనుంది. ఈ మేరకు చిరంజీవి సన్నిహిత వర్గాలు గురువారం వెల్లడించాయి. త్వరలో చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి ఈ ఆపరేషన్ చేయించుకోనున్నారని తెలిపాయి. చిరంజీవి గత రెండేళ్లుగా భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. గత నెలలో చిరంజీవి కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. తమిళంలో తెరకెక్కిన కత్తి సినిమాను చిరంజీవి హీరోగా 150వ చిత్రంగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 17వ తేదీన చెన్నైలోని నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం నిర్వహించనున్న క్రికెట్ మ్యాచ్ లో చిరంజీవి పాల్గొనున్నారు. -
చిరంజీవికి నేడు ఆపరేషన్
ముంబై: మెగాస్టార్ చిరంజీవి గురువారం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో భుజానికి ఆయన శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చాలా కాలంగా ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నారని, కత్తి సినిమా షూటింగ్ కు ముందే ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ముంబై ఆస్పత్రిలో చేరారని తెలిపాయి. చాలా రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నా కుదరలేదని వెల్లడించాయి. చిరంజీవి సతీమణి సురేఖ ఆయన వెంట ఉన్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆయనను ఎప్పుడు డిశ్చార్జి చేస్తారనేది వెల్లడి కాలేదు. పూర్తిగా కోలుకున్నాకే ఆయన హైదరాబాద్ కు తిరిగొచ్చే అవకాశముందని సమాచారం. కత్తి సినిమా రీమేక్ నటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభంకానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారు. -
కామ్రేడ్ పాన్‌సరేకు లాల్‌సలాం!
వేలాది మంది అశ్రునయనాల మధ్య కమ్యూనిస్టు నేతకు అంతిమ వీడ్కోలు సాక్షి, ముంబై/కొల్హాపూర్: ప్రముఖ హేతువాది, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, టోల్ పన్ను వ్యతిరేక ఉద్యమకారుడు గోవింద్ పాన్‌సరేకు వేలాది మంది తమ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 16న కొల్హాపూర్‌లో దుండగుల కాల్పులకు గురైన పాన్సరే శుక్రవారం అర్థరాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. మెరుగైన చికిత్స కోసం 82 ఏళ్ల పాన్సరేను కొల్హాపూర్ నుంచి శుక్రవారం ఉదయం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం అధికం కావడంతో మరణించారని జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్ టీపీ లహానే ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం మధ్యాహ్నం తిరిగి కొల్హాపూర్ తీసుకొచ్చారు. పాన్సరే హత్యను అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. నిస్వార్థపరుడైన పాన్సరేను హత్య చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. ఈ నేరానికి పాల్పడిన దుండగులను శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు ఆయన మంత్రివర్గ సహచరులు, బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, ఆర్పీఐ పార్టీల నేతలు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. పాన్సరే హత్యకు నిరసనగా, ఆయన హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సీపీఐ సమా అన్ని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐ, ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని బీఆర్పీబీఎం పార్టీలు మద్దతు పలికాయి. ఓ ప్రగతిశీల నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని, పేదలకు న్యాయం చేకూర్చేందుకు ఆయన చేసిన పోరాటాన్ని రాష్ట్రం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు. పాన్సరే హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. ఎర్ర సముద్రాన్ని తలపించిన కొల్హాపూర్ కామ్రేడ్ పాన్‌సరేకు లాల్ సలాం అన్న నినాదాలతో కొల్హాపూర్ శనివారం హోరెత్తిపోయింది. పాన్సరే అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది ప్రజలతో కొల్హాపూర్ పట్టణం ఎర్రసముద్రాన్ని తలపించింది.పంచగంగ నదీ తీరంలో పాన్సరే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కమ్యునిస్ట్ నాయకులు, కార్యకర్తలతో ఆ పరిసరాలు ఎరుపెక్కాయి. ‘రెడ్ సెల్యూట్ టూ పాన్సరే’, ‘లాల్ సలాం - పాన్సరే అమర్హ్రే’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దసరా చౌక్‌లో అంతిమ దర్శనం కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. వేలాది మంది ఆయనను చివరిసారిగా చూసి నివాళులు అర్పించారు. సాయంత్రం మూడు గంటల తర్వాత పంచగంగ నదీతీరం వైపు అంతిమయాత్రను ప్రారంభించారు. నదీ తీరంలో పాన్సరే భౌతికకాయనికి ఆయన కోడలు మనమళ్ల చేతులమీదుగా దహన సంస్కారం పూర్తిచేశారు. విమానాశ్రయంలోనే ఒక గంటపాటు భౌతికకాయం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోవింద్ పాన్సరే భౌతికకాయం ఒక గంటపాటు విమానాశ్రయంలో ఉండిపోయింది. పాన్సరే మరణానంతరం శనివారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకగంట ఆలస్యంగా కొల్హాపూర్‌కు బయలుదేరాల్సి వచ్చిందని శాసన మండలి సభ్యుడు కపిల్ పాటిల్ ఆరోపించారు. ఒక్క అధికారి కూడా ఎయిర్పోర్ట్ వద్దకి రాలేదన్నారు. ఉదయం 10.20 గంటలకు తాము పాన్సరే భౌతిక కాయాన్ని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చామని, కానీ 11..54 గంటలకు కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానం బయల్దేరిందని చెప్పారు. దీంతో తాము 12.55 గంటలకు కొల్హాపూర్ చేరుకున్నామన్నారు. కాల్పులు జరిపింది మరాఠీ భాషీయులే సాక్షి, ముంబై: గోవింద్ పాన్సరే దంపతులపై కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని భావిస్తున్నారు. గోవింద్ పాన్సరే సతీమణీ ఉమా పాన్సరే పోలీసులకు అందించిన వివరాల మేరకు కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని వెల్లడైంది. కోల్హపూర్‌లో చికిత్స పొందుతున్న ఆమె దర్యాప్తు అధికారితో మాట్లాడారు. ఈ నెల 16న తామిద్దరం వాహ్యాళికి వెళ్లిన ప్పుడు తమకు ఎదురైన దుండగులు ‘మోరే యెతే కుటే రహతాత్..? (మోరే ఎక్కడ ఉంటారు..?)’ అని ప్రశ్నించారు. అనంతరం సుమారు 15 నుంచి 17 నిమిషాలకు తాము ఇంటివైపు వెళ్లే సమయంలో మళ్లీ వారిద్దరు మోటర్‌సైకిల్ వచ్చి కాల్పులు జరిపారు’ అని ఆమె పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దుండగులు ముందుగా తన భర్త గోవింద్ పై కాల్పులు జరిపారని, ఆయనకు అడ్డుగా వెళ్లిన తనపై కూడా కాల్పులు జరిపారని చెప్పారు. -
పన్సారేను ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు
ముంబై: దుండగల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కమ్యూనిస్టు పార్టీ యోధుడు గోవింద్ పన్సారేను ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ శుక్రవారం నాగపూర్‌లో వెల్లడించారు. కోల్హాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పన్సారేకు మరింత మెరుగైన వైద్య చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించడంతో... ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పన్సారే ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. పన్సారేపై జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పన్సారేపై కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే గతేడాది పుణేలో హత్యకు గురైన డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి శుక్రవారం నగర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. మహారాష్ర్టలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే దంపతులపై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మోటార్ సైకిల్ వచ్చిన దుండగులు ఆయన నివాసం సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. శివాజీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా ఆగంతుకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. కోల్హాపూర్ లోని ఆసుపత్రిలో పన్సారే దంపతులు చికిత్స పొందుతున్నారు. -
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రవిచోప్రా మృతి
ముంబై: ప్రముఖ బాలీవుడు దర్శకుడు, నిర్మాత బీఆర్ చోప్రా కుమారుడు ప్రముఖ దర్శకుడు రవి చోప్రా (68) బుధవారం ముంబైలో మరణించారు. గత కొంత కాలంగా ఆయన ఉపిరితిత్తులకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రవిచోప్రాను ఆయన కుటుంబ సభ్యులు నవంబర్ 6న నగరంలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు కన్నుమూశారు. రవిచోప్రా అంత్యక్రియలు గురువారం ఉదయం 11.00 గంటలకు పవన్ హన్స్లో నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రవిచోప్రాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రవిచోప్రా మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. రవిచోప్రా మృతి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ చిత్రదర్శకుడు మదురు బండార్కర్ అన్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అతి అరుదైన వ్యక్తుల్లో రవిచోప్రా ఒకరని ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ తెలిపారు. రవిచోప్రా మృతిపై ప్రముఖ నటీ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన దర్శకత్వంలో పని చేసిన చిత్రాలకు సంబంధించిన అంశాలను స్మృతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. రవి చోప్రా ఇన్సఫ్ కా తరజు చిత్రానికి అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. అమితాబ్, హేమమాలిని కాంబినేషన్లో బాగ్బన్ చిత్రాన్ని తీశారు. జమీర్ (1975), ద బర్నింగ్ ట్రైన్ (1980), మజ్దూర్ (1983), దహ్లీజ్ (1986), బాబుల్ (2006) భూతనాథ్, భూత్నాథ్ రిటర్న్స్ చిత్రాలను ఆయన నిర్మించారు. మహాభారత్ సీరియల్ రవిచోప్రాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. -
బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి షిండే డిశార్జ్
బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే (72) ను ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేశారని ఆయన కుమార్తె, షోలాపుర్ ఎమ్మెల్యే ప్రీతి షిండే ఆదివారం ముంబైలో వెల్లడించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మరో ఐదారు రోజుల్లో ఆయన విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. ఉపిరితిత్తులు కొద్దిగా పెరగడంతో షిండేకు ఈనెల 4వ తేదీన బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కేంద్ర హోం మంత్రి షిండేకు శస్త్రచికిత్స
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు ఊపిరితిత్తుల సంబంధిత ఆపరేషన్ జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 71 ఏళ్ల షిండే గతరాత్రి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. అయితే షిండే అనారోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశముంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షిండే హాజరుకానున్నారు. అయితే ఎప్పడు ఆయన ఢిల్లీకి వెళతారనేది తెలియలేదు. శస్త్ర చికిత్స తర్వాత తన తండ్రి బాగానే ఉన్నారని షిండే కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణితి తెలిపారు. ఆస్పత్రిలో చేరడానికి ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి జయంత్ బాంటియా, ఇతర ఉన్నతాధికారులను శనివారం షిండే కలిశారు. హజ్ హౌస్‌లో చవాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వర్లీలో నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.