అనారోగ్యం బారిన పడ్డారన్న వార్తలపై స్పందించిన రతన్ టాటా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా.
నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment