
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తాజాగా మాట్లాడుతూ.. ‘భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అందరూ మాట్లాడుతున్నారు. అసలు యుద్ధం అంటే ఏం తెలుసా?. యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?. యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదు. యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయినా దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తాను. యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారు. తెలివితక్కువ వాళ్ల వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా.. దాన్ని నివారించేందుకే మనం మొగ్గు చూపాలి.
ఇప్పుడు చాలామంది పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా.. చర్చలతోనే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటాను. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి పూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి పరిస్థితులు ఉంటాయి. ఇవేవీ మిగతా వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. కొన్నిసార్లు దాడుల కారణంగా పిల్లలు సైతం తీవ్రంగా గాయపడతారు. యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. యుద్ధమంటే ఖరీదైన వ్యాపారం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్‌పై తీవ్రమైన చర్చ జరిగింది.
మరోవైపు.. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ ఒప్పందానికి భారత్ ఎందుకు ఒప్పుకుందని అటు ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా భారత్‌కు జరిగిన లాభమేంటి? అని కామెంట్స్ చేశారు.