పారిశ్రామిక దిగ్గజానికి శ్రద్ధాంజలి ఘటించిన భరతజాతి
అంతిమయాత్ర దారిపొడవునా వాహనం వెంట నడిచిన అభిమానులు
అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు
పార్శీల సంప్రదాయానికి భిన్నంగా విద్యుత్ దహనవాటికలో నిర్వహణ
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వ శిఖరం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. రతన్ టాటా పార్శీ అయినప్పటికీ విద్యుత్ దహనవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
తరలివచ్చిన అభిమానగణం
ముంబైలోని కొలాబాలో ఉన్న రతన్ టాటా స్వగృహానికి ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత అధికారిక లాంఛనాల్లో భాగంగా ఆయన భౌతికకాయంపై జాతీయ జెండాను ఉంచి ప్రత్యేకంగా అలకరించిన వాహనంలో ఇరువైపులా పోలీసులు వెంటరాగా దక్షిణ ముంబైలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ) మైదానానికి తీసుకొచ్చారు. దారి పొడవునా ఆయన అభిమానులు వాహనం వెంట నడిచారు.
పోలీసు బ్యాండ్ ప్రత్యేక ట్యూన్‌ను వాయించింది. ఎన్‌సీపీఏ మైదానంలో మధ్యాహ్నం దాకా ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని వర్లీలో ఉన్న మున్సిపల్ శ్మశానవాటికకు అంతిమయాత్ర కొనసాగింది. దారిపొడవునా జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్మశానవాటికకు తరలించాక అక్కడ ముంబై పోలీసులు టాటాకు గౌరవసూచికగా గన్ సెల్యూట్ చేశారు.
తరలివచ్చిన ప్రముఖులు
వర్లీ శ్మశానవాటికలో సవతి సోదరుడు నోయల్ టాటా, టాటాల కుటుంబ సభ్యులు సహా సినీ, పారిశ్రామిక, సామాజిక, క్రీడా, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, స్థానికులు, టాటా గ్రూప్ సంస్థల ఉద్యోగులు, పోలీసు ఉన్నతాధికారులు, ఎన్‌సీపీఏ విద్యార్థులు, అంత్యక్రియలకు హాజరయ్యారు.
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, పియూశ్ గోయల్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్, మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌ఠాక్రే, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్థికరంగ దిగ్గజం దీపక్ పరేక్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఏపీ సీఎం చంద్రబాబు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, నటుడు అమీర్‌ఖాన్, దర్శకుడు మధు భండార్కర్, నటుడు రాజ్‌పాల్ యాదవ్, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
రతన్ టాటాకు నివాళిగా గురువారం మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు సంతాప దినంగా పాటించాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను అవనతం చేశాయి.
పాత సంప్రదాయానికి భిన్నంగా..
టాటాలు జొరాస్ట్రియన్ మతంలోని పార్శీ వర్గానికి చెందిన వాళ్లు. సాధారణంగా పార్శీల అంత్యక్రియల తర్వాత పార్థివదేహాన్ని దహనం, ఖననం చేయరు. రాబందులకు ఆహారంగా ఒక కొండ శిఖరంపై వదిలేస్తారు. ప్రకృతి వరప్రసాదంగా శరీరంతో భువి మీదకు వచ్చిన మనిషి తిరిగి స్వర్గస్తులైనప్పుడు ఆ శరీరాన్ని మళ్లీ ప్రకృతికే విడిచిపెట్టాలని జొరాస్ట్రియన్లు విశ్వసిస్తారు.
దహనం చేసి గాలిని, ఖననం చేసి నేల, నీటిని కలుషితం చేయడాన్ని వాళ్లు పాపంగా భావిస్తారు. టవర్ ఆఫ్ సైలెన్స్‌గా పిలిచే ప్రాంతంలో పార్థివదేహాన్ని వదిలేస్తారు. అక్కడ రాబందులు శరీరాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అయితే కాలక్రమంలో రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో కొందరు ఆధునిక పార్శీలు ఈ ప్రాచీన సంప్రదాయం నుంచి ‘ఎలక్ట్రిక్ దహనం’ విధానానికి మళ్లారు.
టాటా గ్రూప్ మాజీ చైర్మన్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడు, పార్శీ అయిన సైరస్ మిస్త్రీ అంత్యక్రియలూ ‘టవర్ ఆఫ్ సైలెన్స్’కు బదులు 2022లో వర్లీలోని అదే ఎలక్ట్రిక్ దహనవాటికలో జరిగాయి. గురువారం రతన్ టాటా అంత్యక్రియలనూ అలాగే పూర్తిచేసినట్లు అక్కడి క్రతువుకు సాయపడిన మతాధికారుల్లో ఒకరైన పెరీ కంబట్ట వెల్లడించారు. అయితే మరో మూడు రోజులపాటు రతన్ టాటా ఇంట్లో పార్శి సంప్రదాయ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
ఒక టాటా.. ఒక గోవా!
ముంబై: రతన్ టాటా అంత్యక్రియల వద్ద గంభీరమైన వాతావరణంలో అక్కడికి పరుగెత్తుకొచ్చిన ఒక శునకం రతన్ పార్థివదేహాన్ని చూసి మౌనంగా ఉండిపోయింది. తన నేస్తం, యజమాని ఇక లేరని తెల్సి మౌనంగా రోదించింది. అక్కడే ఉంటూ ఆయన భౌతికకాయం నుంచి దూరం జరగబోనని భీషి్మంచుకుని అక్కడే ఉండిపోయింది. ఒకప్పుడు వీధి కుక్కగా పెరిగి తదనంతరకాలంలో రతన్‌టాటాకు మంచి నేస్తంగా మారిన ‘గోవా’ శునకం అది.
ఒకప్పుడు గాయపడి గోవాలో ఒంటరిగా తిరుగుతున్న చిన్న కుక్క పిల్ల అది. పదేళ్ల క్రితం రతన్ గోవాకు వెళ్లినపుడు ఇది ఆయన కంట పడింది. జంతు ప్రేమికుడైన రతన్ దానిని చేరదీశారు. దాని బాగోగులు చూసుకున్నారు. టాటా గ్రూప్ కేంద్రకార్యాలయం బాంబే హౌస్‌కూ రతన్‌తోపాటు ఇది కూడా వస్తుండేది. గురువారం ఎన్‌సీపీఏ ప్రాంగణంలో రతన్ భౌతికకాయం వద్దకు దీనిని తీసుకొచ్చారు. ‘‘రతన్‌కు ఇది అత్యంత ఆప్తమైన నేస్తం. ఆయన అలా శాశ్వత నిద్రలోకి వెళ్లాక ఇది ఉదయం నుంచి ఇంతవరకు ఏమీ తినలేదు’’ అని దాని సంరక్షకుడు చెప్పారు.
‘‘ రతన్ టాటాకు శునకాలంటే ప్రేమ. తాజ్‌మహల్ హోటల్ కావొచ్చు, బాంబే హౌస్ కావచ్చు, టాటా సంస్థల ప్రాంగణాల్లో మనకు ఒకప్పుటి వీధి శునకాలే మనకు మంచి నేస్తాలుగా స్వాగతం పలుకుతాయి’’ అని మహారాష్ట్ర నవని ర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గుర్తుచేసుకున్నారు. 2018లో బ్రిటన్ యువరాజు ఛార్లెస్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ తీసుకునేందుకు వెళ్లాల్సి ఉంది. సరిగ్గా అప్పుడు ఆయన పెంపుడు శునకం ఒకటి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ స్థితిలో వీటిని ఇలా వదిలేసి వెళ్లబోనని అవార్డ్ కార్యక్రమాన్ని టాటా రద్దుచేసుకున్నారని ఆయన స్నేహతుడు సుహేల్ సేథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment