రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి.. విలువలు, దాతృత్వానికి పెట్టింది పేరు. విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడంతోపాటు మంచి స్వభావం గల వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మన మధ్యలేరనే నిజాన్ని అంగీకరించడం ఎవరి వల్ల అవ్వడం లేదు.
86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు భారత్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ముంబైలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని నోయెల్‌కు మోదీ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల లావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రతన్ టాటా అంత్యక్రియలను అమిత్ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
కాగా రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.
#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata being taken to NCPA lawns for the public to pay their last respects
He will be accorded state funeral this evening. pic.twitter.com/6JUgirUqkG— ANI (@ANI) October 10, 2024
మరోవైపు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పార్దివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. అనంతరం ఉదయం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ) గ్రౌండ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. వ్యాపార దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికేందుకు సామాన్య ప్రజలు, ప్రముఖులు బారులు తీరనున్నారు.
అంతకముందు రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన ధోరణి ఆచరణాత్మకమని, దయార్ద్ర హృదయంతో మెరుగైన సమాజం కోసం అనుక్షణం తపించే వారిని ప్రధాని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment