ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని అన్నారు. కానీ, ప్రధాని మోదీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే ప్రధాని మోదీ పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.
ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోదీ ఎప్పుడు పర్యటించినా.. విభజన, అశాంతిని రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒక కులానికి మరొక కులాన్ని వ్యతిరేకంగా ఉంచుతున్నాయని శుక్రవారం ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చేందటం.వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోదీ అన్నారు.
ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment