
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) బహిర్గతం చేశారు. ఈ ప్రకటన అనంతరం కొందరు నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) స్పందిస్తూ ట్రోలింగ్ చేస్తున్న వారికి కౌంటరిచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచారు. భారత్ గొంతును వినిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. అలాంటి అధికారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిస్రీపై విమర్శలు చేస్తున్నవారు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా చేయగలరా?’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో భారత ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ, నేవీ వింగ్ కమాండర్-హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్‌ల పనితీరుపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. వారి పనితీరు అద్భుతమని కొనియాడారు.
అంతకుముందు.. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం ప్రకటన అనంతరం.. కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విక్రమ్ మిస్రీపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఆయన వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న పౌర సేవకులపై వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోల్స్ చేయడం విచారకరమని ఐఏఎస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.