Health rumors
-
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
Dawood: చోటా షకీల్ కీలక ప్రకటన
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం(67) ఆరోగ్యంపై గత రెండు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. విష ప్రయోగం జరిగిందని, ఆరోగ్యం విషమించి చావుబతుకుల మధ్య కరాచీ ఆస్పత్రిలో ఉన్నాడని.. ఇలా ప్రచారాలు జరిగాయి. ఈలోపు దావూద్ దగ్గరి బంధువు, పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందద్ హౌజ్అరెస్ట్ కావడం, కాసేపటికే.. దావూద్ చనిపోయాడంటూ ఇంటర్నెట్లో పోస్టులు కనిపించాయి. దీనికి తోడు పాక్‌లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలగడంతో ఆ వార్తల్ని దాదాపుగా ధృవీకరించేసుకున్నాయి మన మీడియా సంస్థలు. అయితే.. నిన్న సాయంత్రం నుంచి దావూద్ చనిపోలేదంటూ పలు పాక్ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో దావూద్ అనుచరుడు, డీ-కంపెనీ వ్యవహారాలను చూసుకునే చోటా షకీల్ భారత్‌కు చెందిన ఓ మీడియా ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. దావూద్ ఇబ్రహీం ఆరోగ్య విషయంలో వస్తున్న కథనాల్ని చోటా షకీల్ ఖండించాడు. విషప్రయోగం జరిగిందన్న కథనాలతో పాటు దావూద్ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారాన్ని షకీల్ కొట్టిపారేశాడు. భాయ్ వెయ్యి శాతం ఫిట్‌గా ఉన్నాడు అంటూ ఓ భారతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటా షకీల్ చెప్పాడు. మరోవైపు నిఘా వర్గాలు సైతం దావూద్‌పై విష ప్రయోగం జరిగిందన్న ప్రచారాన్ని ఊహాగానంగా తేల్చేశాయి. ఐఎస్ఐ ఏజెంట్లు.. తన నమ్మకస్తుల భద్రతా వలయం నడుమ దావూద్ భద్రంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. అమెరికా దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ.. ఐఎస్ఐ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్‌గా, ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న దావూద్ ఇబ్రహీం.. కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. తాజాగా.. జాతీయ భద్రతా సంస్థ NIA విడుదల చేసిన ఛార్జిషీట్లో దావూద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఉన్నాయి. -
ఆటో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్? స్పందించిన నటుడు
కమెడియన్, నటుడు ఆటో రాంప్రసాద్ అరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రామ్ ప్రసాద్ ఆస్పత్రి చికిత్స తీసుకుంటున్న ఫొటో ఒకటి లీకైంది. ఇందులో అతడు సర్జికల్ క్యాప్ పెట్టుకుని కనిపంచాడు. దీంతో రాంప్రసాద్ క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు అతడు త్వరగా కోలుకోవాలని ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాజాగా తన అరోగ్యంపై వస్తున్న పుకార్లపై రాంప్రసాద్ స్పందించాడు. చదవండి: ప్రకాశ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ రెండో బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు జబర్దస్త్ షో నటులు పాల్గొన్నారు. అందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాంప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌ను తన ఆరోగ్యంపై ప్రశ్నించగా.. అది నిజం కాదని స్పష్టం చేశాడు. ‘నాకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను తలకు క్యాప్ పెట్టుకోవడంతో అంతా నాకేదో అయ్యిందని ఆందోళన పడ్డారు. నాకు ఏం కాలేదు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాను. అందుకే క్యాప్ పెట్టుకున్నా. చదవండి: ఆశగా మద్రాస్ వెళితే హేళనగా మాట్లాడారు..మానసిక క్షోభకు గురయ్యా: మెగాస్టార్ అంతే నాకేం కాలేదు. నాకేదైనా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారుగా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది నవంబర్ రాంప్రసాద్ తలకు సర్జరీ క్యాప్ పెట్టుకుని ఆస్పత్రిలో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి రాం ప్రసాద్‌కు ఏమైందీ, ఎందుకు క్యాప్ పెట్టుకున్నాడంటూ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో అతడు క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నాడని, గుండు కావడంతో క్యాప్ పెట్టుకున్నాడంటూ పుకార్లు గుప్పుమన్నాయి. కాగా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షోలో తనదైన కామెడీ, ఆటో పంచులతో రాంప్రసాద్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. -
నేను క్షేమంగానే ఉన్నా: పి.సుశీల
సాక్షి, తమిళసినిమా(చెన్నై): ప్రఖ్యాత గాయని పి.సుశీల మరణించారం టూ వాట్సాప్‌లో ఓ ఆకతాయి దుష్ప్రచారం చేయడంతో.. తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. వాట్సాప్‌లో వచ్చిన పోస్టింగ్‌లో నిజం లేదనీ, అది వట్టి వదంతేనంటూ ఓ సెల్ఫీ వీడియోను శుక్రవారం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. -
నేను క్షేమమే..
► ఆందోళన వద్దు ► విజయ్‌కాంత్ ఆరోగ్యంపై వివరణ ► పుకార్లపై డీఎండీకే ఆగ్రహం ► వరద సహాయక చర్యల్లో బిజీ బిజీ సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై పుకార్లు బయలు దేరాయి. ఆయన ఆస్పత్రిలో చేరినట్టు, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా వచ్చిన సమాచారం పుకార్లేనని డీఎండీకే కార్యాలయం స్పష్టం చేసింది. విజయకాంత్ క్షేమంగా ఉన్నారని, వరద సహాయకాల్ని బాధితులకు దరి చేర్చడంలో బిజీగా ఉన్నారని వివరించింది. డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల కాలంగా ఆరోపణలు బయలుదేరుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డట్టుగా ప్రచారం బయలు దేరింది. అయితే, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేసినా, చివరకు సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరిగి ఉండటం వెలుగులోకి వచ్చింది. చివరకు ఆయనకు కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్టు తేలింది. ఆ శస్త్ర చికిత్స తదుపరి విజయకాంత్ సన్నబడ్డారు. కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నా, చివరకు మళ్లీ తన రాజకీయ వ్యూహాల మీద దృష్టి పెట్టారు. ఈశాన్య రుతు పవనాలు కడలూరు మీద ప్రభావం చూపించినప్పటి నుంచి అవిశ్రాంతంగా ఆయన ప్రజల్లోనే ఉన్నారని చెప్పవచ్చు. కడలూరులో గ్రామ గ్రామంలో తిరిగారు. ప్రజలకు భరోసా ఇస్తూ, సహాయకాల పంపిణీ సాగించారు. చెన్నైలో ఒకటి రెండు చోట్లకు వెళ్లినా, చివరకు పార్టీ కార్యాలయం నుంచి సహాయకాల పంపిణీ మీద దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో విజయకాంత్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డట్టుగా, ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్సలు అందిస్తున్నట్టుగా గురువారం వచ్చిన సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన పెరిగింది. తమ నేతకు ఏమైందో తెలుసుకునేందుకు మీడియా కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇదే విషయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాల్ని మీడియా వర్గాలు సంప్రదించడంతో ఆరోగ్య పుకార్లు దావానంలా వ్యాపించాయి. విజయకాాంత్కు ఏమైందోనన్న ఉత్కంఠ బయలు దేరింది. అయితే, అవన్నీ పుకార్లుగా తేల్చుతూ శుక్రవారం ఆ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, వరద సాయంపై విజయకాంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మరో ప్రకటనను వెలువరించింది. క్షేమమే : పార్టీ అధినేత విజయకాంత్ క్షేమంగా ఉన్నారని, పుకార్లు, ప్రచారాల్ని నమ్మవద్దంటూ ఆ పార్టీ కార్యాలయం స్పష్టం చేసింది. విజయకాంత్ అవిశ్రాంతంగా ప్రజల కోసం శ్రమిస్తున్నారని, ప్రతిరోజూ ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయంలోనే ఉంటూ, వరద బాధిత ప్రాంతాలకు సహాయకాలను తరలించే పనుల్ని పర్యవేక్షిస్తున్నట్టుగా వివ రించారు. పేదల ముఖాల్లో చిరునవ్వే తన జీవితానికి ఆనందం అని పదే పదే చెప్పుకునే విజయకాంత్‌కు ఎలాంటి హాని జరగదని, ఆయన క్షేమంగానే ఉన్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. పేదల సేవే పరమాత్ముడి సేవగా భావించి వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా సాగుతున్న విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయకాంత్ విడుదల చేసినట్టుగా మరో ప్రకటనలో, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలు వరదల్లో కోల్పోయిన గృహోపకరణాలను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.