ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం(67) ఆరోగ్యంపై గత రెండు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. విష ప్రయోగం జరిగిందని, ఆరోగ్యం విషమించి చావుబతుకుల మధ్య కరాచీ ఆస్పత్రిలో ఉన్నాడని.. ఇలా ప్రచారాలు జరిగాయి. ఈలోపు దావూద్ దగ్గరి బంధువు, పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందద్ హౌజ్‌అరెస్ట్ కావడం, కాసేపటికే.. దావూద్ చనిపోయాడంటూ ఇంటర్నెట్‌లో పోస్టులు కనిపించాయి. దీనికి తోడు పాక్‌లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలగడంతో ఆ వార్తల్ని దాదాపుగా ధృవీకరించేసుకున్నాయి మన మీడియా సంస్థలు. అయితే..
నిన్న సాయంత్రం నుంచి దావూద్ చనిపోలేదంటూ పలు పాక్ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో దావూద్ అనుచరుడు, డీ-కంపెనీ వ్యవహారాలను చూసుకునే చోటా షకీల్ భారత్‌కు చెందిన ఓ మీడియా ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
దావూద్ ఇబ్రహీం ఆరోగ్య విషయంలో వస్తున్న కథనాల్ని చోటా షకీల్ ఖండించాడు. విషప్రయోగం జరిగిందన్న కథనాలతో పాటు దావూద్ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారాన్ని షకీల్ కొట్టిపారేశాడు. భాయ్ వెయ్యి శాతం ఫిట్‌గా ఉన్నాడు అంటూ ఓ భారతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటా షకీల్ చెప్పాడు.
మరోవైపు నిఘా వర్గాలు సైతం దావూద్‌పై విష ప్రయోగం జరిగిందన్న ప్రచారాన్ని ఊహాగానంగా తేల్చేశాయి. ఐఎస్‌ఐ ఏజెంట్లు.. తన నమ్మకస్తుల భద్రతా వలయం నడుమ దావూద్ భద్రంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. అమెరికా దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ.. ఐఎస్‌ఐ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది.
అండర్ వరల్డ్ మాఫియా డాన్‌గా, ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న దావూద్ ఇబ్రహీం.. కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. తాజాగా.. జాతీయ భద్రతా సంస్థ NIA విడుదల చేసిన ఛార్జిషీట్‌లో దావూద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment