పన్సారేను ఎయిర్ అంబులెన్స్లో ముంబై తరలింపు
ముంబై: దుండగల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కమ్యూనిస్టు పార్టీ యోధుడు గోవింద్ పన్సారేను ఎయిర్ అంబులెన్స్లో ముంబై తరలించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ శుక్రవారం నాగపూర్లో వెల్లడించారు. కోల్హాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పన్సారేకు మరింత మెరుగైన వైద్య చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించడంతో... ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పన్సారే ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
పన్సారేపై జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పన్సారేపై కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే గతేడాది పుణేలో హత్యకు గురైన డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి శుక్రవారం నగర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది.
మహారాష్ర్టలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే దంపతులపై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మోటార్ సైకిల్ వచ్చిన దుండగులు ఆయన నివాసం సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. శివాజీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా ఆగంతుకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. కోల్హాపూర్ లోని ఆసుపత్రిలో పన్సారే దంపతులు చికిత్స పొందుతున్నారు.