బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రవిచోప్రా మృతి
ముంబై: ప్రముఖ బాలీవుడు దర్శకుడు, నిర్మాత బీఆర్ చోప్రా కుమారుడు ప్రముఖ దర్శకుడు రవి చోప్రా (68) బుధవారం ముంబైలో మరణించారు. గత కొంత కాలంగా ఆయన ఉపిరితిత్తులకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రవిచోప్రాను ఆయన కుటుంబ సభ్యులు నవంబర్ 6న నగరంలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు కన్నుమూశారు. రవిచోప్రా అంత్యక్రియలు గురువారం ఉదయం 11.00 గంటలకు పవన్ హన్స్లో నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రవిచోప్రాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రవిచోప్రా మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది.
రవిచోప్రా మృతి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ చిత్రదర్శకుడు మదురు బండార్కర్ అన్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అతి అరుదైన వ్యక్తుల్లో రవిచోప్రా ఒకరని ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ తెలిపారు. రవిచోప్రా మృతిపై ప్రముఖ నటీ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన దర్శకత్వంలో పని చేసిన చిత్రాలకు సంబంధించిన అంశాలను స్మృతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు.
రవి చోప్రా ఇన్సఫ్ కా తరజు చిత్రానికి అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. అమితాబ్, హేమమాలిని కాంబినేషన్లో బాగ్బన్ చిత్రాన్ని తీశారు. జమీర్ (1975), ద బర్నింగ్ ట్రైన్ (1980), మజ్దూర్ (1983), దహ్లీజ్ (1986), బాబుల్ (2006) భూతనాథ్, భూత్నాథ్ రిటర్న్స్ చిత్రాలను ఆయన నిర్మించారు. మహాభారత్ సీరియల్ రవిచోప్రాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.