దిల్‌రాజు ఇల్లు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో దాడులు
ఐటీ సోదాలు మొత్తం సినీ పరిశ్రమపై జరుగుతున్నాయి: దిల్ రాజు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్‌రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment