సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On Allu Arjun and Film Industry | Sakshi
Sakshi News home page

సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్‌

Published Sun, Dec 22 2024 4:49 AM | Last Updated on Sun, Dec 22 2024 4:49 AM

CM Revanth Reddy Comments On Allu Arjun and Film Industry

వారిని ప్రత్యేకంగా పరిగణించే చట్టాలేమీ లేవు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్‌ రోడ్‌ షో చేశారు 

తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయినా.. అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లారు 

అరెస్టు కోసం వెళ్లిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు

తల్లి చనిపోయి, కొడుకు బ్రెయిన్‌డెడ్‌ అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు 

మానవత్వం లేకుండా వ్యవహరించిన వారిని ఏమనాలి?.. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం.. కానీ ప్రాణాలు పోతుంటే ఊరుకోవాలా? 

అల్లు అర్జున్‌కు ఏమైనా కాలుపోయిందా, కన్ను పోయిందా?.. ఒక్కరోజు జైలుకెళితేనే అంత మంది పరామర్శించారు 

చావుబతుకుల్లో ఉన్న పిల్లాడిని ఎవరూ పరామర్శించలేదని మండిపాటు 

తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిని విడిచిపెట్టబోమన్న సీఎం

సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో అమానవీయంగా వ్యవహరించొద్దు. మీరు సినిమా తీయండి. వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించండి. ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అన్నీ తీసుకోండి. షూటింగ్స్‌ కోసం ఏమేం కావాలో అదీ తీసుకోండి. అయితే ఎవరిదైనా హత్య జరిగాక, ఎవరిదైనా ప్రాణం పోయాక మాత్రం స్పెషల్‌ ప్రివిలేజెస్‌ కోరితే.. అవి ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకవు. నేను సీఎం సీట్లో ఉన్నంత వరకూ అది జరగదు.     
– సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: సినిమా వాళ్లకు మానవత్వం లేకపోవడాన్ని ఏమనాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సినీ పరిశ్రమ తీరు అమానవీయమని.. ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కు కావాలంటే దొరకదని పేర్కొన్నారు. కేవలం ఒక్కరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన హీరోను పరామర్శించిన సినీ పరిశ్రమ పెద్దలు... బాధిత కుటుంబీకులను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. సాధారణ ప్రజల ప్రాణాలు  కాపాడటం తమకు ప్రధానమని.. ప్రాణాలు పోయేందుకు ఎవరు కారణమైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిని విచారించి శిక్షించే వరకు విడిచిపెట్టబోమని ప్రకటించారు. 

శనివారం అసెంబ్లీలో రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘సంధ్య థియేటర్‌ తొక్కిసలాట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా స్పందించిందన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక మహిళ చనిపోగా, ఒక బాలుడు కోమాలో, మరొకరు తొక్కిసలాటలో ఇరుక్కుపోతే.. ఆ హీరో కనీసం పట్టించుకోకుండా అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’’అని పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ఈ అంశం సభలో చర్చకు వస్తుందని అనుకోలేదు. డిసెంబర్‌ 4న పుష్ప–2 విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్‌ వస్తారని బందోబస్తు కల్పించాలని డిసెంబర్‌ 2న సంధ్య టాకీస్‌ వాళ్లు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేశారు. ఆ ప్రాంతంలో రద్దీతోపాటు సంధ్య థియేటర్‌లోకి వెళ్లడానికి, బయటికి రావడానికి ఒకే గేటు ఉన్న కారణంగా సెక్యూరిటీ కల్పించలేమని అనుమతి నిరాకరిస్తూ 3న అక్కడి సీఐ సమాధానమిచ్చారు. 

అయినా 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా తన కారు రూఫ్‌టాప్‌ ఓపెన్‌ చేసి రోడ్‌షో నిర్వహిస్తూ థియేటర్‌కు వచ్చారు. తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఉన్న ఆ ప్రాంతంలో వేలమంది ఒకచోట చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లు అర్జున్‌ 50, 60 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీ అడ్డుగా ఉన్న వారిని తోసేయడం తొక్కిసలాటకు దారితీసింది. రేవతి అనే మహిళ, శ్రీతేజ్‌ అనే బాలుడు స్పృహ తప్పినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పటికే రేవతి మరణించగా, శ్రీతేజ్‌ బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. 

పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు 
ఏసీపీ ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో సంధ్య థియేటర్‌కు వెళ్లి పరిస్థితి బాగో లేదని.. హీరోను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినా పూర్తి సినిమా చూస్తానంటూ ఆయన పట్టించుకోలేదు. తర్వాత డీసీపీ వెళ్లారు. వెంటనే వెళ్లిపోకపోతే అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో బయటికి వచ్చారు. ఇంత ప్రమాదం జరిగి, ఒకరు చనిపోయాక కూడా హీరో కారు రూఫ్‌టాప్‌ ఓపెన్‌ చేసి అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారంటే... ఆయన ఎలాంటి మనిషి అనుకోవాలి? నేను సీఎం కుర్చీలో కూర్చుని మౌనంగా ఉండలేను. 

ఇంటికెళ్లిన పోలీసులతో దురుసుగా.. 
తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు పెట్టారు. కొందరిని అరెస్ట్‌ చేశారు. కొన్నిరోజుల తర్వాత హీరో నివాసానికి కూడా వెళ్లి తమ వెంట రావాల్సిందిగా కోరారు. కానీ పోలీసులపై వారు దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ హీరోను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగానే... నా రాజకీయ మిత్రుల కోసం కేసు పెట్టానంటూ సోషల్‌ మీడియాలో కొన్ని రాజకీయపార్టీల వారు నన్ను పైశాచికంగా, నీచంగా తిడుతూ పోస్టులు పెట్టారు. 

బాధితులను కనీసం పరామర్శించలేదు 
శ్రీతేజ్‌ తండ్రి నెలకు రూ.30 వేలు సంపాదించే మామూలు ఉద్యోగి. కొడుకు ఆ హీరో అభిమాని కావడంతో.. స్పెషల్‌ షో కోసం ఒక్కో టికెట్‌కు రూ.మూడేసి వేల చొప్పున రూ.12 వేలు పెట్టి కొన్నారు. తల్లి రేవతి చనిపోయి, అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురై 11 రోజులు గడిచినా ఆ కుటుంబ సభ్యులను హీరో, ప్రొడ్యూసర్, మరెవరూ పరామర్శించలేదు. 

ఇది ఏరకమైన మానవత్వం? ఇలా వ్యవహరించే వారిని ఏమనాలి? విధి నిర్వహణలో భాగంగా హీరోను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళితే.. పదేళ్లు మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి, ఉద్యమాల టైంలో షూటింగ్‌లు జరపొద్దంటూ దాడులు చేసిన వ్యక్తి విమర్శలు చేస్తారు. ఈ హీరో భగవత్‌ స్వరూపుడు, ఆయనను పోలీసులు ముట్టుకుంటారా? అసలేం జరుగుతోంది? అంటారు. అంటే మీ స్నేహితులైతే అరెస్ట్‌ చేయొద్దా? వారేం చేసినా మాఫీనా? 

ప్రత్యేక రాయితీలిచ్చింది మా సర్కారే కదా! 
సినీ పరిశ్రమను ప్రోత్సాహించాలని ఆ సినిమాకు టికెట్‌ రేట్ల పెంపు, స్పెషల్‌ షోలకు అనుమతినిచ్చింది మా ప్రభుత్వమే. అయితే ఇలా ప్రోత్సహించే క్రమంలో ప్రాణాలు తీసే ఘటనలు జరిగినా ఏమీ చేయకూడదంటే ఎలా? అంటే ఫిల్మ్‌స్టార్, సూపర్‌స్టార్, రాజకీయ ప్రముఖులు ఎవరినైనా హత్యచేసినా... వారిని ప్రాసిక్యూట్‌ చేయొద్దని ఏదైనా ప్రత్యేక చట్టం ఉంటే చెప్పండి పాటిస్తాం. 

సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. 
తల్లి చనిపోయింది, పిల్లవాడు బ్రెయిన్‌డెడ్‌ అయ్యి కోమాలో ఉంటే ఒక్కరైనా వెళ్లారా? సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. ఆ సినీ హీరోకు ఏమైంది కాలు పోయిందా? చెయ్యి పోయిందా? కన్ను పోయిందా? కిడ్నీలు దెబ్బతిన్నాయా? ఏమైంది.. వెళ్లి పరామర్శించడానికి.. అదే చావుబతుకుల్లో ఉన్న పిల్లవాడిని ఒక్కరూ పరామర్శించలేదు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. 

హీరో అయితే అర్ధరాత్రి జైలు నుంచి వదిలిపెట్టాలా? 
హీరోకు హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఆయనను అర్ధరాత్రి 11, 12 గంటలకు విడుదల చేయాలని చాలా మంది గట్టిగా కోరారు. అర్ధరాత్రి జైలు నుంచి వదిలేందుకు చట్టంలో ఏదైనా వెసులుబాటు ఉందా? సినీహీరో కాబట్టి అర్ధరాత్రి వదిలిపెట్టాలంటే ఎలా? కొన్ని రాజకీయ పార్టీల నేతలు, పదేళ్లు మంత్రిగా ఉన్న వారు ఆ హీరోపై కేసు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. హీరో కాబట్టి ఏం చేసినా చెల్లుతుందా? మేం అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం, న్యాయం ప్రకారం నడిపిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement